Pages

Saturday 31 December 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                                          
గడచిన కాలం మనకు సంతోషాన్ని, విషాదాన్ని పంచి ఉండొచ్చు! జరిగి పోయిన వాటిని పదే పదే తలచుకుని ఇప్పటి కర్తవ్యాన్ని విస్మరించేకంటే ఇప్పటి నుంచి జరగాల్సిన, చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మంచిది. కాలం మనకోసం ఆగదు. దానిని ఎవ్వరూ నిలువరించలేరు. మారుతున్న, సాగిపోతున్న కాలంతో పాటే మనమూ ముందుకు సాగటమే మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యమ్. ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం  సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.  

Thursday 29 December 2011

లోక్ పాల్ పై ఇంతవంచనా ..?


అవినీతిపై సమర శంఖం పూరిస్తామని లోక్ పాల్ బిల్లు తెచ్చి తీరుతామని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ బొక్కబోర్లా పడింది. అవినీతి వ్యతిరేక బిల్లును నిరోదించే విషయంలో రాజకీయ పక్షాలన్నీ ఏకం కావడం వారి దుర్నీతిని తేటతెల్లం చేసింది. లోక్ సభలో హైడ్రామా మధ్య ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లును గట్టేక్కించడంలో అధికార కాంగ్రెస్ తన భాగస్వామ్యపక్షాలను ఒప్పించలేకపోయింది. రాజ్య సభలో సుదీర్ఘ చర్చ సమయంలో విపక్షాల నిలదీతతో అధికార కాంగ్రెస్ లోక్ పాల్ పై వెనకడుగు వేయటం సిగ్గుచేటు. నాలుగున్నర్ర దశాబ్దాల లోక్ పాల్ బిల్లుకు నేటికీ ఆమోదం పొందలేకపోవడం అవినీతిని తుదముట్టించడంలో నేతలకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధమవుతోంది. పార్టీలను ఒప్పించడంలో సర్కారు విఫలం కావడం వల్ల నాటకీయ పరిణామాల మధ్య లోక్ పాల్ బిల్లుకు గ్రహణం పట్టింది. అవినీతిని తుదముట్టించే బిల్లు అన్నా హజారే చెప్పినట్టు కాకుండా ఇలా ఉండాలంటూ తమ సొంత సూత్రీకరణలు చేసిన పార్టీలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించి  బిల్లును శక్తిహీనం చేశాయి. పార్టీలన్నీ అవినీతి బురదలోనే తాము పోర్లాడతామని మరోసారి రుజువు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. స్కాంలతోనే సహవాసం చేస్తామని నిరూపించాయి. హజారేలు ఎందరు వచ్చినా, నిజంగా ఆ గాంధీయే తిరిగి జన్మించినా నేటి రాజకీయ నేతల బుద్దిని మార్చలేం. ఏమంటారు?

తుపాన్ ముందటి ప్రశాంతత!

                                              
"థానే" తుపాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే సగం చచ్చిన రైతుల్ని ఈ తుపాన్ మరింతగా నష్టపరచనుంది.  తీవ్ర కరవుతో అల్లాడుతున్న ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాల్లో పంటల్ని తుపాన్ ప్రభావితం చేయనుంది. ఇది ప్రధానంగా చెన్నైని దేబ్బతీయనున్నప్పటికీ రాష్ట్ర రైతులకు సైతం తీవ్ర నష్టం కలుగుతుంది. తుపాన్ల కాలం పూర్తయ్యాక వస్తున్న ఇటువంటి వైపరీత్యాలు రైతుల తలరాతల్ని మార్చేస్తున్నాయి.  నష్ట తీవ్రతను బాగా పెంచే అవకాశం
ఉన్నదిగా భావిస్తున్న "థానే" తుపాన్ తీసుకురానున్న కష్టాల గురించి తలచుకుని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఒక సీజన్ నష్టపోతే మరో సీజన్ కాపాడుతుందనుకుని రబీ పంటలు వేసుకున్న రైతుల ఆశల్ని ఈ తుపాన్ ఆవిరి చేయనుంది. సాగు వ్యయం పెరిగి, గిట్టుబాటు ధరల్లేక, వరుస నష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గత వంద రోజుల్లోనే దాదాపు 163 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాచారం. కనీసం వారికి కరవు సహాయక చర్యలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం చేసిన అలక్ష్యం అందరికీ తెలిసిందే. కరవుపై నేటికీ కార్యాచరణను ప్రకటించకుండా తాత్సారం చేసిన పాలకులు కనీసం రైతుల్ని ఈ తుపాన్ నుంచయినా కాపాడాలి. తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కల్పించాలి.  

Saturday 24 December 2011

క్రిస్మస్ శుభాకాంక్షలు


                                                                              
ప్రపంచానికి శాంతిమార్గం చూపిన ఆ మహానీయిని జన్మదినం విశ్వ మానవాళికి పండుగ దినం. మంచిని  పెంచి, చెడును వదిలివేయాలని  ప్రభోదించిన ఏసుక్రీస్తు పుట్టిన రోజును  "క్రిస్మస్ పండుగ"గా  జరుపుకోవడం మనందరి ఆనవాయితీ. పాపులు, దీనుల కోసం పరితపించి వాళ్ళను జీవోన్ముక్తుల్ని చేసిన లోక రక్షకుడాయన. మానవాళికి ఆ మహనీయుడు అందించిన విలువల్ని కాపాడుకోవడం, ఆచరించడమూ మనందరి బాధ్యత. ఆ పవిత్ర కర్తవ్యాన్ని గుర్తెరిగి మసలాలని కోరుకుంటూ యావత్ మానవాళికి క్రిస్మస్ శుభాకాంక్షలు.

Wednesday 21 December 2011

స్వతంత్ర భారతంలో చెత్త వ్యవసాయ మంత్రి ఎవరు ?

                                                     
కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చెంప చెళ్ళుమని పించినా ఆయనకు బుద్ధి రావటం లేదు.  స్వతంత్ర భారతంలో అత్యంత పనికిమాలిన వ్యవసాయ మంత్రిగా కీర్తిని సంపాదించుకున్న పవార్ రైతాంగ సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ మనుగడ కోసం కాంగ్రెస్ పవార్ తప్పిదాలను వెనకేసుకు వస్తూ పెద్ద తప్పే చేస్తోంది. పార్లమెంటులో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా అటు ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ సభ్యులు ఆయన తీరును కడిగేసినా సిగ్గు రావటం లేదు. దేశంలో పామాయిల్ రైతులకు కిలోకు రూ. 15 సబ్సిడీ ఇవ్వమంటే కుదరదన్న మంత్రి., విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలపై 20 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని  స్వయంగా కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. నిజంగా ప్రపంచంలో ఆ మాటకొస్తే పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మలేసియా కంటే  ఆయిల్ పామ్ సాగుకు మంచి భూములున్న ఆంధ్ర ప్రదేశ్లో ఈ పంట సాగుకు ఆశించిన ప్రోత్సాహాలు అందటం లేదు. దేశంలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వారి సంక్షేమాన్ని  విస్మరిస్తున్న పవార్ వంటి మిత్రపక్ష మంత్రుల్ని సరిచేయాల్సిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేక పోవడం వల్లనే. పవార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రైతాంగ శ్రేయం కోసం దృష్టి పెట్టు.
                                                           

Friday 16 December 2011

కరెంటు కష్టాలు....


                                                      
ఓ వైపు మంచు దుప్పట్లు రాష్ట్రాన్ని కప్పేస్తుంటే., నడి శీతాకాలంలోనే కారు చీకట్లు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా కరెంటు కష్టాలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కరవు దెబ్బతో ఇప్పటికే రాష్ట్ర రైతులు అల్లాడుతుంటే, కరెంటు సరఫరా సక్రమంగా లేక వేసిన పంటలు సైతం ఎండుముఖం పడుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన విద్యుత్  డిమాండ్,   సరఫరా పడిపోవడం వ్యవసాయానికి ఏడు గంటలు అందించాల్సిన పరిస్థితుల్లో గృహాలకు కోతలు తప్పడం లేదని కొందరు అధికారులు బాహాటంగానే ఆంగీకరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ల నీటి మట్టాలు తగ్గటంతో జల విద్యుత్ 1500 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఫలితంగా శీతాకాలం మధ్యలోనే దినసరి విద్యుత్ వాడకం 250 మిలియన్ యూనిట్లకు చేరువైంది. వేసవి సమీపించేకొద్దీ ఇది మరింత పెరుగుతుందన్న ఆందోళన విద్యుత్ శాఖను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇపుడు పంటలకు కరెంటు సరఫరాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరవు దెబ్బతో నష్ట పోయిన రైతులు చేనుకు నీరందించే మార్గం లేక వారు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోని  చాలా ప్రాంతాల్లో రబీ పంటలు ఎండుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాకతీయ ధర్మల్ ప్రాజెక్ట్ లో 70 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడం జెన్ కోకు మరో దెబ్బ.  
                                                           
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాపం రాష్ట్ర  సర్కారు వినతుల్ని కేంద్రం పెడచెవిన పెట్టడంతో  ఏం చేయాలో పాలుపోక కిరణ్ సర్కారు తలపట్టుకుంటోంది. మరో వైపు పరిశ్రమలకు చాలినంత సరఫరా లేక వారు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గిన కారణంగా ఇప్పటికే పరిశ్రమలకు 42 శాతం మేర ట్రాన్స్ కో కోత పెడుతోంది. ఈ నేపధ్యంలో  కరెంటు కోతలకు స్వస్తి చెబుతామని పైకి గంభీరంగా చెబుతున్నా సమస్యను ఎలా అధిగమించాలో అర్ధం కాక సర్కారు గుంజాటన పడుతోంది.  అటు రైతులు ఇటు పరిశ్రమలు మధ్యలో గృహ వినియోగదార్లు పడుతున్న అగచాట్లతో ఆంధ్ర ప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు దోమలతో మరో నెల తర్వాత వేసవిని తలపించే వాతావరణంతో ఉక్కపోతను భరించటానికి ప్రజలు సిద్దం కావాలి మరి!     

Thursday 15 December 2011

రూపాయి బియ్యంలో పురుగులు ఇందుకే వస్తున్నాయ్..!

                                                              
ఉద్యోగుల కొరత కారణంగా నిల్వ చేసిన ఆహార ధాన్యాల నాణ్యతకు సంబంధించి తనిఖీలు చేపట్టడం లేదని భారత ఆహార సంస్థ చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత ఆహార సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగులు గత తొమ్మిదేళ్ళలో సుమారు వెయ్యి మంది తగ్గిపోవడంతో సాధారణ తనిఖీలు కూడా చేపట్టలేని స్థితిలో ఎఫ్.సి.ఐ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు కొనుగోలు చేసి నిల్వ చేసే ఆహార ధాన్యాల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వికేంద్రీకరణ కొనుగోళ్ళ పధకం (డి.సి.పి) ప్రకారం ఆహార ధాన్యాల కొనుగోళ్ళు, జాగ్రత్తగా నిల్వ చేయడం రాష్ట్రాల బాధ్యత. ఎఫ్.సి.ఐ నుంచి నాణ్యమైన ఆహార ధాన్యాలను తీసుకుని చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించడం కూడా రాష్ట్రాలే చూసుకోవాలి. ఎఫ్.సి.ఐ డిపోల నుంచి ఆహార ధాన్యాలు పంపిణీ కేంద్రాలకు వెళ్ళే ముందు కల్లెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు నాణ్యతను పరిశీలించుకోవాలి ఇప్పటికే ఎఫ్.సి.ఐ పౌరసరఫరాల శాఖను కోరింది. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి వాటిని తగిన ప్రమాణాలతో నిల్వ చేయాలని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన నేపధ్యంలో ఆహారోత్పతుల నిల్వలో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
                                                         
ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో రూపాయికే కిలో బియ్యం పధకాన్ని ప్రవేశపెట్టడం ఆ బియ్యాన్ని అందుకున్న వారెందరికో బియ్యంలో పురుగులు కనిపించడం తెలిసిందే. ఆహార ధాన్యాల నిల్వల నాణ్యతా తనిఖీలు లోపించడం వల్లనే ఈ తరహా సమస్యలు తలెత్తి ఉంటాయని మనం  ఊహించవచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం వల్లనే ఆహార ధాన్యాలు ముక్కి పోతున్నాయని గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని పలుమార్లు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా జాగ్రత్త పడి పేద ప్రజలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాలను సక్రమంగా నిల్వ చేయడంపై ఎఫ్.సి.ఐ తో పాటు కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి.

Monday 12 December 2011

వ్యవ'సాయం' పెంచండి..!

                                                             
వ్యవసాయం పూర్తిగా చతికిలపడింది. శక్తి లేక రైతులు బాగా నీరసించారు. వారికి శక్తియుక్తులు కల్పించడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో వచ్చే ఫలితాల గురించి ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం కంటే తక్షణం నిర్వర్తించాల్సిన కర్తవ్యం గురించి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడటం లేదు. బ్యాంకర్ల సమావేశంలో రైతులు కరవుతో సతమతమవుతున్నందువల్ల వారికి విరివిగా రుణాలందించి ఆదుకోవాలని కోరారే తప్ప కరవును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించలేదు. వచ్చే రెండేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు సుమారు ఆరువేల కోట్లు ఖర్చు పెడతామన్న ముఖ్యమంత్రి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడితే బాగుండేది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం చేయూతనిస్తే రైతులు నిలదోక్కుకోగలుగుతారు. క్షేత్ర స్థాయిలో రైతుల వాస్తవ సమస్యలను తెలుసుకొని వాటిని చక్కదిద్దాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు ఓదార్పు నిచ్చేలా ప్రభుత్వం కరవు సహాయ చర్యలు చేపట్టాలి. రైతుకు కావలసిన ఉత్పాదకాలను సకాలంలో గ్రామస్థాయిలోనే అందించాలి. దళారుల బెడద లేకుండా చేసి మంచి ధరలిస్తే అన్నదాతల పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రభుత్వం ఈ మాత్రం చర్యలు చేపట్టినా రైతులకు చాలా వరకు మేలు జరుగుతుంది. కనీసం వీటిని చేయడానికైనా పాలకులు సిద్ధంగా ఉన్నారా...?

Thursday 8 December 2011

పాల ఉత్పత్తి పెంపునకు మిల్క్ మిషన్

       రాష్ట్రంలో త్వరలో మిల్క్ మిషన్ ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 22 వేల గ్రామాల్లో తోలి విడతగా సుమారు 3766 గ్రామాల్లో స్వయం సహాయక బృందాల ద్వారా మిల్క్ మిషన్ పధకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రూ.5138 కోట్లు ఖర్చయ్యే ఈ పధకం కింద తొలిదశలో దాదాపు పదిహేనువేల పాల ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో రూ. 491 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం 2 . 98 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. దీన్ని 4 . 96 కోట్ల లీటర్లకు పెంచటం మిల్క్ మిషన్ లక్ష్యం. దీనిలో భాగంగా పాల సేకరణ, మార్కెటింగ్ కోసం తగిన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. వీటికి తోడు ఒక్కో మండలంలో మినీ డెయిరీలు, నాలుగేసి పాల ప్రగతి కేంద్రాలు  ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తారు. తద్వారా రాష్ట్రంలో 67 శాతం పాల ఉత్పత్తిని పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
                                                         
కరవుతో అల్లాడుతున్న రైతుల్ని ఆదుకునేది పాడి పరిశ్రమే. వ్యవసాయానికి పాడి పంట రెండు కళ్ళు లాంటివి. పంట నష్టపోతే పాడి రైతుల్ని ఆడుకుంటుంది. పశుపోషణ పై రైతులకు శ్రద్ధ తగ్గుతున్నందువల్లనే కరవు కాటకాలు వచ్చిన ప్రతిసారి రైతులు తట్టుకోలేకపోతున్నారు. స్థిరమైన ఆదాయాన్ని అందించే పాడిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రభుత్వం పధకాలను ప్రకటిస్తోందే తప్ప వాటి అమలును పట్టించుకోవడం లేదు. ఫలితంగా మంచి పధకాలు కూడా పనికిరానివిగా మారుతున్నాయి. పశుక్రాంతి పధకమే దీనికి ఒక ఉదాహరణ. ఇప్పటికైనా పాలకులు రైతులకు పశుపోషణ పట్ల ఆసక్తి పెరిగేలా తోడ్పాటును అందించాలి. సబ్సిడీపై దాణాలను అందించి మంచి ధర ఇచ్చి రైతుల్నిప్రోత్సహించాలి. పధకాల అమలులో లోటుపాట్లను సరిద్దుకుంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. పాలకులకు కావలసిందల్లా చిత్తశుద్ది మాత్రమే.

కౌలు రైతుకు రుణాలివ్వరా..?

                                                                
రాష్ట్రంలో కోటీ 35 లక్షల మంది రైతుల్లో దాదాపు 40 లక్షల మంది కౌలుదార్లు ఉన్నారు. నిజానికి వీరి సంఖ్య
మరింత ఎక్కువే. వీరంతా నోటిమాటతో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నవారే. తమ భూములు కౌలుకు ఇచ్చినట్టు ఈ యజమానీ అంగీకరించడు. ఫలితంగా ఏ రైతుకూ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇన్నాళ్లుగా ఈ సమస్య కారణంగానే కౌలుదార్లకు అప్పులివ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్- 2011 ను తీసుకు వచ్చింది. గ్రామ సభలో కౌలు రైతుల్ని గుర్తించి వారికి గుర్తింపు కార్డుకు ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్రంలో  నేటి వరకు సుమారు 5 . 85 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేయించుకోగా వారిలో దాదాపు      5 . ౭౬  లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీరందరికీ పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను కోరినా అవి లక్ష్య పెట్టడంలేదు. నిన్నటిదాకా ఖరీఫ్ లో కౌలు దార్లకు మొండిచేయి చూపిన బ్యాంకులు వారు కరవు కారణంగా తీవ్రంగా నష్టపోయినా నేడు రుణాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా కౌలుదార్ల పరిస్థితి మరీ ఘోరం. నేడు రబీ లోనూ కౌలు దార్లకు పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు విసిగిస్తున్నాయి. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా బ్యాంకులు లక్ష్య పెట్టడం లేదు. ఫలితంగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సేద్యం చేయాలంటే కౌలుదార్లు మరోసారి నష్టాలకు సిద్దపడక తప్పదు. అసలే కష్టాల్లో ఉన్నరైతులు, కౌలుదార్లకు విరివిగా పంట రుణాలు ఇచ్చేలా పాలకులు శ్రద్ధ చూపాలి. శాసన సభలో మీ కంటే తామే బెటరని గొంతు చించుకున్న పాలక ప్రభుత్వం ఇప్పుడు రైతు కష్టాల్లో ఉన్నాడన్న స్పృహ ఎరిగి తక్షణ కర్తవ్యాన్ని గుర్తెరగటం మంచిది. ఎన్ని చట్టాలు చేసినా వాటిని అమలు చేయించలేని తన చేతకానితనమే రైతు సమస్యలకు మూలకారణమని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో మరి!

Wednesday 7 December 2011

విషాద పర్వంలో చెరకు రైతు

ఎరువులు, డీజిల్ ధరలతో పాటు బహిరంగ మార్కెట్లో అన్ని రకాల ధరలు పెరిగి ఇప్పటికే సగం చచ్చిన చెరకు రైతుల్ని అటు మిల్లులు ఇటు ప్రభుత్వం బంతాడుకుంటున్నాయి. పెట్టుబడులు రెట్టింపైన తరుణంలో రైతుకు మంచి ధర ఇవ్వాల్సిన వారు చేతులెత్తేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర కూడా ప్రకటించకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లులకు సలహాలిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండీ లేనట్టు వ్యవహరిస్తుండటం చూస్తుంటే రైతుల్ని పట్టించుకునే తీరిక ఈ సర్కారుకు లేదన్న సంగతి స్పష్టమవుతోంది. చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అంతర్జాతీయంగా పంచదార ధరలు, ఎగుమతులు, కేంద్ర, రాష్ట్ర సర్కార్ల స్పందనల పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు గురువారం  'ఈనాడు'  ప్రచురించింది. స్కాన్ చేసిన ఈ కాపీని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను. కృతఙ్ఞతలు.