Pages

Sunday 30 June 2013

"శివగీతార్చన"

నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన"  పాటల సీడీని విడుదల చేశాక రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో, మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన "శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని మిగిల్చాయి. 




Friday 14 June 2013

సీజన్ ముంగిట రైతులు చిత్తుచిత్తు!

సకాలంలో వర్షాలు కురిసినా విత్తనాలు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు . సర్వం సిద్ధం చేశామంటున్నవ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులు ఏటా ఎదుర్కొంటున్న సమస్యలకు  తగిన పరిష్కారాన్ని చూపలేక పోతోంది. సీజన్ ముంగిట రైతుకు విత్తన సమస్యలు మామూలు  అవుతున్నా  సర్కారులో సర్కారులో చలనం లేదు. పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలోనూ రైతుకు పంట ఉత్పాదకాలను సకాలంలో అందించడం ద్వారా వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించటం లేదు.   ఈ  ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసి చెప్పినా రైతులు దుక్కులు దున్నే నాటికి విత్తనాలు సిద్దం చేయాల్సిన సర్కారు యెంత సన్నద్ధంగా ఉందో.,  నేడు రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడుతున్న పాట్లను చూస్తే తెలుస్తుంది. రైతు శ్రేయం విషయంలో ఎప్పుడూ మొద్దు నిద్ర పోయే ప్రభుత్వాలకు అన్నదాతల కష్టాలు కనిపిస్తున్నాయా...?