Pages

Friday 20 March 2015

తెలుగుదనం పల్లవించే పండుగ

                                                                           

తెలుగుదనం నిండుగా మెండుగా పల్లవించే పండుగ ఉగాది. తెలుగుదనపు మాధుర్య సొగసులు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిఫలించే పండుగ యుగాది. కల్పాదిలొ బ్రహ్మ సృష్టిని ఆరంభించినదీ., వనవాసం తర్వాత
శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్నది ఉగాదినాడే. ఆందుకే పండుగలన్నింటిలోకి ఉగాది ప్రత్యేకతే వేరు. మామిడి తోరణాలతో, మల్లెల గుబాళింపులతో, కోయిల కుహూ రావాలతో, వసంత సౌకుమార్యంతో శ్రీమన్మధ నామ సంవత్సర ఉగాది నేడు తరలి వచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నా శుభాకాంక్షలు- అమిర్నేని హరికృష్ణ 

నాకు ఉగాది మీడియా పురస్కారం

                                                               
      
హైదరాబాద్ కు చెందిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ ఏడాది  "ఉగాది మీడియా పురస్కారం" కు నాతోపాటు మరికొందరు సీనియర్ జర్నలిస్టులను ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి చెప్పారు. ఆహ్వానం పంపించారు. సుదీర్ఘకాలం మీడియా లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఎడిటర్లకు ఈ అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. నాతొ పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైయెస్సార్ శర్మ, సూర్య ఎడిటర్ సత్యమూర్తి, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్. వీరయ్య, కళ పత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీ, అంకం రవి (వీ6 ఛానల్ ) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ టీవీ ), హరిప్రసాద్ (టీవీ9), ఈశ్వర్ (6టీవీ), సాయి (జెమిని న్యూస్)లు  కూడా ఉగాది మీడియా పురస్కారాలు అందుకోనున్నారు.
అయితే  రవీంద్రభారతి లో  అవార్డు తీసుకోవాల్సిన 23వ తేదీన  నేను తిరుమలలో ఉండాల్సిన కారణంగా ఈ అవార్డును నేను స్వయంగా స్వీకరించలేకపోతున్నట్టు  నిర్వాహకులకు తెలిపాను. నా తరపున సహచరుడు మధుసూధనాచారి ఈ అవార్డును స్వీకరిస్తారు. నా మిత్రులు, మరికొందరు సీనియర్ జర్నలిస్టు మిత్రులను ఈ సందర్భంగా కలుసుకోలేక పోతున్నందుకు కొంత బాధగానూ ఉంది.  నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు.

Monday 2 March 2015

రైతులంటే అందరికీ చులకనే!

వ్యవసాయంలో 4 శాతం వృద్ధి రేటు సాధించాలంటే ఆందుకు అనుసరించే వ్యూహం సరైనదై ఉండాలి. నిర్దిష్ట వ్యుహాలేమీ లేకుండా సేద్యానికి మొండిచేయి చూపించింది కేంద్ర బడ్జెట్. దిశ దశ లేకుండా వ్యవసాయంలో ఏదో సాధించేస్తామంటే అది ఒట్టిమాటే. జైట్లీ బడ్జెట్ లో ఇటువంటి కమ్మని కబుర్ల్లెన్నో ఉన్నాయి. ''దేశంలో రైతు జేబు నింపడానికి వ్యవసాయరంగానికి తగిన సామర్ధ్యం ఉంది అన్న ప్రభుత్వానికి, రైతు శ్రేయం పట్ల మాత్రం నిజమైన చిత్తశుద్ధి లేకపోయింది.'' కేంద్రబడ్జెట్ లో వ్యవసాయరంగాన్ని విస్మరించిన తీరుపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.