Pages

Thursday 30 January 2014

తెలుగు యువకుల సత్తా

ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టి పెరిగిన ఊరిని, కన్నవారిని మర్చిపోకూడదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తహ తహ లాడుతున్న ఎందరో ఎన్నారైలు ఇప్పటికే తమవంతుగా తమ తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో సాయపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి ఆలోచనతోనే ముందు తరాలకు మన గ్రామం చరిత్ర,, సంస్కృతి, గ్రామం లోని విశేషాలు, ప్రసిద్ధ వ్యక్తుల గురించిన సమాచారంతో పాటు ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో ఉన్న మన వూరి వారందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చి ప్రస్తుతం గ్రామాభివృద్ధికి ఏమేం చేయవచ్చో నిర్ణయించే ఒక సదవకాశం  swagraam.com ద్వారా కలగనుంది.
ప్రకాశం జిల్లాకు అద్దంకికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోదరులు బాచిన రాహుల్, అనిల్ లు దేశంలో తొలిసారిగా గ్రామాల అనుసంధానానికి, గ్రామాభ్యుదయానికి  swagraam.com కు రూపకల్పన చేయటం ద్వారా శ్రీకారం చుట్టారు. తెలుగు వారైన ఈ సోదరుల కృషి వల్ల మన స్వగ్రామానికి ఒక పేజి రూపొందించి దేశ విదేశాల్లో గ్రామానికి చెందిన వారిని ఆహ్వానించి గ్రామం అభివృద్ధికి పాటు పడవచ్చు. గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన చిత్రాలకు తోడు మన కుటుంబ సభ్యుల ఫొటోలనూ పేజీలో పెట్టుకోవచ్చు. కొన్ని ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వెబ్ సైట్ల తో పోల్చితే ఎంతో ఉపకరించే ఇటువంటి సైట్ రూపొందించిన ఈ సోదరులు అభినందనీయులు.
మరో విశేషం ఏమంటే ఎన్నో e-books రైట్స్ తీసుకుని మన విద్యార్ధుల కోసం ఉచితంగా అందిచేందుకు ఈ సైట్ ద్వారా వీరు కృషి చేస్తున్నారు. ఈ సోదరుల కృషిపై ఈ నెల 15వ తేదీన ఈటీవీ-2 లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే "యువ" లో ఒక ప్రత్యేక కధనాన్ని ప్రసారం చేశాం.  మీ కోసం ఆ వీడియో క్లిప్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                                  

Tuesday 21 January 2014

వెండితెర దిగ్గజం అక్కినేని

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీయార్, ఏఎన్నార్ లు రెండు కళ్ళు.  అన్నగారు వెళ్ళిపోయిన 19 ఏళ్ళకు అదే జనవరి మూడో వారంలో తానూ స్వర్గానికి తరలిపోవటం చిత్ర పరిశ్రమకు తీవ్ర లోటు. ఆ మేటి నటుని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. యునిసెఫ్ అవార్డుల సందర్భంగా  వారి నుంచి నేను అవార్డ్ తీసుకుంటున్న ఓ జ్ఞాపకం నాకు మిగిలింది.  
                                                            

Sunday 12 January 2014

సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రకృతి తో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ సంక్రాంతి. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....  ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి. కష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో  ప్రసరించాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.