Pages

Saturday 31 March 2012

రైతులకు కరెంటు వాతలు

                                                                
అధికారికంగా ఇచ్చేది ఏడు గంటల కరెంటు. అమలులో రైతులకు అందుతున్నది నాలుగు గంటలు కూడా లేదు. ఇప్పటికే సక్రమంగా విధ్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడుతున్న రైతులపై  ప్రభుత్వం నేడు చార్జీల భారం మోపి వారిని మరింతగా కుంగదీసింది.  పంటల సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్ కు 3 రూపాయల 20 పైసలు వసూలు చేస్తామనడం రైతులకు నిజంగా పెద్ద షాక్! 2014 దాకా కరెంటు చార్జీలు పెంచబోమని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ సర్కారు నేడు దాన్ని విస్మరించిన తీరు శోచనీయం. తాను బకాయి పడ్డం వల్లనే విధ్యుత్ సంస్థల్ని సంక్షోభంలోకి నెత్తిన సర్కారు  ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దటం ఘోరం. ఎవరి గొడవలు వాళ్ళు చూసుకుంటున్న రాష్ట్రంలో అసలు ప్రజా సంక్షేమం విస్మరిస్తుండటం అసలైన విషాదం.

Thursday 29 March 2012

ఇక వీకే సింగ్ కు వీడ్కోలు!

                                                       
సైన్యంలో మందుగుండు కొరత తీవ్రంగా ఉందని., వైమానిక రక్షణ వ్యవస్థకు కాలం చెల్లి పోయిందని, కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదంటూ ప్రధాని మన్మోహన్ కు ఆర్మీ జనరల్ వీకే సింగ్ రాసిన లేఖ దేశం పరువును బజారుకు ఈడ్చినట్లయ్యింది. పదవీ విరమణ విషయంలో మాట నెగ్గించుకోలేకపోయిన సింగ్, చివరికి రక్షణ వ్యవస్థను వీధిన పడేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నేట్టారనే చెప్పాలి.   అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో జనరల్ సింగ్ తలకాయ తెగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ భద్రతకు కీలకమైన రక్షణ వ్యవస్థ నేడు వివాదాలకు కేంద్ర బిందువవడం మనం చేసుకున్న దురదృష్టం.

Thursday 22 March 2012

కొత్త ఆశలతో ఉగాదిని స్వాగతిద్దాం!

                                                                    
బ్లాగు మిత్రులందరికీ మన తెలుగు సంవత్సరం  " శ్రీ నందన నామ" ఉగాది శుభాకాంక్షలు. శిశిరంలో ఎండిన చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుని ఈ వసంతాగమన వేళ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయడం సౌందర్యారాధకులకు కన్నుల పండుగే. కొత్త పంటలు చేతికందే ఈ సమయంలో నైవేద్యంగా పెట్టే షడ్రుచుల వేప పచ్చడి అనుభూతే వేరు. షడ్రుచులూ సమపాళ్ళలో కలగలిసిన వేప పచ్చడిని తీసుకోవడం ద్వారా ఈ  వత్సర కాలంలో  ఏదీ ఎక్కువా తక్కువా కాకుండా  మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టసుఖాలకు ఉగాది పచ్చడి ప్రతీకగా నిలుస్తుంది.  వసంత ఋతువు ఆగమన వేళ వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయి. తెలుగు పండుగలలో తోలి పండుగగా నిలిచే ఉగాది సకల జీవరాసులకు మనస్సులను రంజింప చేస్తూ., ప్రకృతిని సైతం మనోహరంగా తీర్చిదిద్దగలుగుతుంది. నిన్నటి పాత వాసనల్ని వదిలి సరికొత్త ఆశలతో నందన ఉగాదిని స్వాగతిద్దాం. మరోసారి మీ అందరికీ నందన నామ ఉగాది శుభాకాంక్షలు.
                                                               

600 రైతు క్లబ్బులకు "నాబార్డు" చేయూత


రాష్ట్రంలో కొత్తగా మరో 600  రైతు క్లబ్బులకు చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు "నాబార్డు" నేడు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఆఖరికి దేశం మొత్తంలో 91675 క్లబ్బులు ఉండగా., వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లోనే 6594 క్లబ్బులు (7 . 2 శాతం ) ఉన్నాయి. రైతు క్లబ్బుల ఏర్పాటుకు, మూడేళ్ళ పాటు నిర్వహణ ఖర్చులు, నిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించడానికి., కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , ఆదర్శ రైతుల పొలాలను పరిశీలించడం వంటి ప్రయోజనకరమైన పనులకు నాబార్డు ఆర్ధిక సహకారం అందిస్తూ ఉంటుంది.
  సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి, రుణాలు, మార్కెట్ పట్ల అవగాహన పెంచడం, వ్యవసాయదారుల సామర్ధ్యం పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల సత్వర అభివృద్ధికి కృషి చేయడమే ఈ రైతు క్లబ్బుల ప్రదాన ఉద్దేశం. అందరూ కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రైతు క్లబ్బులు ఉత్తమ వేదికలుగా పని చేస్తున్నాయి. అయితే వీటి పనితీరును మెరుగు పరచడం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు  మరింతగా ఉపకరించేలా తీర్చిదిద్దటం నేడెంతో అవసరమని నా భావన. 

Tuesday 20 March 2012

ఓటి బతుకులు

                                                               
మొక్క మొలిచిననాడే...
మళ్ళీ కధ మొదలయ్యింది..
పైరు విత్తుతున్న ప్రతిసారీ...
రైతు గుండెలో విచ్చుకత్తులు దిగుతున్నాయి...
మొక్క ఎదుగుతున్న కొద్దీ..
రైతు బతుకు  గొడ్డుమోతుదవుతోంది...
కాయకష్టం కొండేక్కుతుంటే..
ఊతమిచ్చినవాడే ఊరేగుతున్నాడు..
కర్రు కదిలించినవాడు..
కర్పూరంలా కరుగుతున్నాడు...!
పాదు  ఫలమిచ్చినా ఊతకర్రదే పెత్తనమంతా...
ఏళ్ళు గడుస్తున్నా ఓటి బతుకే రైతులదంతా..!!
ప్రతి తిండి గింజ పై తినేవారి పేరు రాసుంటే...
రైతు నాలుకలపై ఆ బీజాక్షరాలు ఎందుకు లేవు?
కాలం కరుగుతున్నప్పుడల్లా...
కొత్త అప్పులు పెరుగుతున్నాయి....
పంట పండుతున్న ప్రతిసారీ...
రైతు డొక్కలు ఎండుతున్నాయి...!
జీవనసారాన్ని ఔపోసన పట్టిన రైతుకు...
మార్కెట్ మాయలు అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే..!
పదే పదే పడి లేస్తున్న ప్రయాసలో...
పాపం..
రైతు బతుకంతా ఓ జూదమే!!       

Friday 16 March 2012

సబ్సిడీల కోత - పన్నుల మోత

                                                                
కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేడు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ సబ్సిడీల కోత పనుల మోత చందంగా ఉంది. ఆహార భద్రతకు పూర్తీ రాయితీలంటూనే ఇతర సబ్సిడీలకు కోత పెట్టారు. వ్యవసాయ సంస్కరణల ఊసే లేకుండా ఉన్న ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. రైతులకు ఎరువుల సబ్సిడీని సైతం నగదు రూపంలో అందజేయనున్నట్టు స్పష్టం చేసారు. వ్యవసాయ ఉత్పతుల మద్దతు ధరల స్థిరీకరణ నిధికి నిధులు కేటాయించడాన్ని విస్మరించారు. లక్ష కోట్ల పంట రుణాలను పెంచినప్పటికీ, నేటికీ రైతులకు ఇస్తున్నరుణాలు నూటికి  30 శాతానికి దాటలేదన్న సంగతిని సర్కారు గుర్తించాలి. అలానే మార్కెట్ సంస్కరణలు, పరిశోధనా, విస్తరణకు ఆశించిన రీతిలో పెట్టుబడులు కేటాయించలేదు. మెత్తంగా అన్ని వర్గాలపై పన్నుల భారం మోపిన ప్రణబ్ బడ్జెట్ కీలకమైన వ్యవసాయాన్ని విస్మరించి రైతులోకానికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

Wednesday 14 March 2012

చెరకు రసం తీసే ఆధునిక యంత్రంతో యవతకు ఉపాధి

                                                               
చెరకు సాగు రాష్ట్ర రైతులకు చేదునే మిగుల్చుతోంది. చక్కెర మిల్లులు సైతం పర్మిట్లు ఇవ్వకుండా రైతుల  సహనాన్నిపరీక్షిస్తున్నాయి. టన్ను చెరకుకు కేవలం రెండు వేల ధర మాత్రమే ఇస్తూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇస్తున్న స్థాయిలొనూ  రాష్ట్ర సలహా ధరను ఇవ్వకుండా సర్కారు రైతుల్ని మోసగిస్తోంది. ఏటా ఎదురవుతున్న  ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో చెరకును మిల్లులకు తరలించలేని రైతులు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న వారు స్వయం ఉపాధిగా చెరకు రసం తీసే యంత్రాలను ఏర్పాటుచేసుకుని లాభాపడవచ్చు. ముఖ్యంగా యువతకు ఈ ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయి. నేడు మనం రోడ్లపై చూస్తున్న చేతితో నడిపే లాంటివి కాకుండా ఇన్ స్టంట్ కూలింగ్ సదుపాయమున్న ఈ యంత్రాలు నేడు హైదరాబాద్లో ( 93944 93944 - రాంగోపాల్ )తయారుచేస్తున్నారు. ఆ వివరాలతో రాసిన నా వ్యాసం మార్చి నెల "అన్నదాత" లో ప్రచురితమైంది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ లింక్ చేస్తున్నాను. మీ కోసం.
                                                           

Saturday 10 March 2012

కేంద్రం అనాలోచిత నిర్ణయంతో పత్తి రైతుకు కష్టాలు!

                                                                                                                     
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చేసిన ఒక చెత్త పని వల్ల దేశంలో పత్తి ధరలు పడిపోయాయి. క్షేత్ర స్థాయిలో రైతుల స్థితిగతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. అంతర్జాతీయంగా గిరాకి కొనసాగుతున్నా పత్తి నిల్వలు పుష్కలంగా ఉన్నా ఇవేమీ పట్టించుకోకుండా ఆనంద్ శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. ఒక వ్యూహం లేకుండా ఎగుమతి దిగుమతి విధానాలను రచిస్తున్న కేంద్రం దేశంలో కోట్లాది పత్తి రైతుల ఆశలపై నీళ్ళు చల్లింది. జరిగిన పొరపాటును గ్రహించి నేడు దిద్దుబాటు చర్యల గురించి ఆలోచించమని ది గ్రేట్ మన్మోహన్ గారు ప్రణభ్ ను పురమాయించారు. ధరల పతనానికి దారితీస్తున్న జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ కాపీ ని మీ కోసం ఇక్కడ 
జతచేస్తున్నాను.

Wednesday 7 March 2012

మహిళా నీకు నీవే సాటి

                                                              
నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెండేళ్ళ కిందట నూరు వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మర్నాడు మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. మహిళాలోకానికి కొత్తగా సంక్రమించే మూడోవంతు రాజకీయ సాధికారిత కొత్త ఉత్సాహం నింపింది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న స్త్రీలకు చట్ట సభల్లో 33 . 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు చట్టం కావాలని నారీలోకం ఎదురు చూస్తోంది. 189 దేశాలకు సంబంధించి చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య పరిశీలించినప్పుడు భారత్ 108 వ  స్థానంలో ఉంది. అన్నింటికీ మించి దేశంలోని రాజకీయ పార్టీల స్థానాల్లో కనీసం 40  శాతం మహిళలకు కేటాయించే విధంగా చట్టం తేవాలన్న వాదన గట్టిగానే ఉంది. పురుషుల ధోరణిలోనూ ఎంతో మార్పు రావాలి. గృహహింస, దోపిడీ, అసమానతలకు ఇకనైనా తెరపడాలని ఆశిద్దాం. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ మహిళాలోకానికి మరోసారి శుభాకాంక్షలు.

Monday 5 March 2012

వరల్డ్ రికార్డ్ ఎలా సాధించానంటే.... బీహార్ రైతు సుమంత్ అనుభవాలు

                                                                                                                              
 "శ్రీ" వరి సాగులో ప్రపంచ రికార్డు సృష్టించిన బీహార్ రైతుల గురించి గతంలో ఒక పోస్టు రాసిన సంగతి మీకు తెలుసు. మార్చి నెల "అన్నదాత" వ్యవసాయ పత్రికలో ఈ వ్యాసం ప్రచురితమైంది. అయితే ఈ వ్యాసంలో "శ్రీ" వరి సాగుకు సంబంధించి మరిన్ని సంగతులు వివరంగా ఇవ్వడం జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టించిన సుమంత్ కుమార్ తో నేను మాట్లాడాను. అతను వాడిన విత్తనం, అనుసరించిన పద్దతులు తదితర వివరాలను ఈ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ జత చేస్తున్నాను. సుమంత్ సెల్ నెంబర్: 07250946233 .
                                      
                                                                   
                                                              

Thursday 1 March 2012

యాపిల్ సాగులో రాణిస్తున్న తెలుగు రైతు పురుషోత్తమరావు

జనవరి 'అన్నదాత' మాసపత్రికలో యాపిల్ సాగులో రాణిస్తున్న తెలుగు రైతు పురుషోత్తమరావు గురించి ఒక వ్యాసం రాశాను. త్వరలో వీరు సిమ్లా నుంచి హైదరాబాద్ కు ఆర్గానిక్ యాపిల్స్ ను తీసుకువచ్చి విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యాసం చదివిన ఎందరో పురుషోత్తమరావు సెల్ నెంబర్ కావాలని నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇటీవల వారు ఇటలీ వెళ్లి రావడం వల్ల నేను ఇచ్చిన నెంబరు కలవకపోవడం జరిగింది. ప్రస్తుతం వారు హైదరాబాద్ లోనే ఉన్నారు. అలానే పలువురు ఈ వ్యాసం క్లిప్పింగ్ కావాలని కోరారు. వారి సౌకర్యార్ధం అన్నదాతలో ప్రచురితమైన వ్యాసం స్కానింగ్ కాపీని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.