Pages

Thursday 29 December 2011

తుపాన్ ముందటి ప్రశాంతత!

                                              
"థానే" తుపాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే సగం చచ్చిన రైతుల్ని ఈ తుపాన్ మరింతగా నష్టపరచనుంది.  తీవ్ర కరవుతో అల్లాడుతున్న ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాల్లో పంటల్ని తుపాన్ ప్రభావితం చేయనుంది. ఇది ప్రధానంగా చెన్నైని దేబ్బతీయనున్నప్పటికీ రాష్ట్ర రైతులకు సైతం తీవ్ర నష్టం కలుగుతుంది. తుపాన్ల కాలం పూర్తయ్యాక వస్తున్న ఇటువంటి వైపరీత్యాలు రైతుల తలరాతల్ని మార్చేస్తున్నాయి.  నష్ట తీవ్రతను బాగా పెంచే అవకాశం
ఉన్నదిగా భావిస్తున్న "థానే" తుపాన్ తీసుకురానున్న కష్టాల గురించి తలచుకుని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఒక సీజన్ నష్టపోతే మరో సీజన్ కాపాడుతుందనుకుని రబీ పంటలు వేసుకున్న రైతుల ఆశల్ని ఈ తుపాన్ ఆవిరి చేయనుంది. సాగు వ్యయం పెరిగి, గిట్టుబాటు ధరల్లేక, వరుస నష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గత వంద రోజుల్లోనే దాదాపు 163 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాచారం. కనీసం వారికి కరవు సహాయక చర్యలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం చేసిన అలక్ష్యం అందరికీ తెలిసిందే. కరవుపై నేటికీ కార్యాచరణను ప్రకటించకుండా తాత్సారం చేసిన పాలకులు కనీసం రైతుల్ని ఈ తుపాన్ నుంచయినా కాపాడాలి. తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కల్పించాలి.  

2 comments:

పూర్ణప్రజ్ఞాభారతి said...

ధర ఖర్వాటుండొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై అనేది పూర్వం ఓ సుభాషితం. బట్టతలవాడు ఒకడు ఎండలో పోతూ ఉంటే తల వేడిక్కిందిట. కాస్తోకూస్తో అయినా సరే నీడ లభిస్తుందిలే అని తాటి చెట్టు క్రింద నిలబడ్డాడట. వాడి ఖర్మకాలి అప్పుడే తాటిపండు తెగి వాడి తలపై పడి చచ్చాట్ట.

ప్రస్తుతం మన రైతుల పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది. ముందే మంచి విత్తు, ఎరువు దొరకడం లేదు. అప్పుల్లో సేద్యం మునిగి ఉంది. మద్దతు ధర లేదు.అన్ని వైపులా కష్టాలే అనుకుంటే ఇప్పుడీ తుఫాను ఒకటి.

ఏదేమైనా ప్రకృతి ప్రకోపం అధికారుల నిర్లక్ష్యం ముందు పెద్ద ప్రభావవంతమైనది కాదని నా అభిప్రాయం.

హరికృష్ణగారు... నేను ముందే తెలుసు. గుర్తు పట్టగలరా చూడండి

అమిర్నేని హరికృష్ణ said...

ప్రజ్ఞాభారతి గారు ఒకసారి పరిచయమైన తరువాత నేను ఎవరినీ మర్చిపోలేను. ఎలా ఉన్నారు..? ఈ మధ్య పూర్తిగా నల్లపూస అయ్యారు. ఇదివరకు తరచుగానైనా ఈటీవీకి వచ్చేవారు. వీలుచూసుకుని రండి. మీ స్పందనకు ధన్యవాదాలు.