Pages

Thursday 8 December 2011

కౌలు రైతుకు రుణాలివ్వరా..?

                                                                
రాష్ట్రంలో కోటీ 35 లక్షల మంది రైతుల్లో దాదాపు 40 లక్షల మంది కౌలుదార్లు ఉన్నారు. నిజానికి వీరి సంఖ్య
మరింత ఎక్కువే. వీరంతా నోటిమాటతో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నవారే. తమ భూములు కౌలుకు ఇచ్చినట్టు ఈ యజమానీ అంగీకరించడు. ఫలితంగా ఏ రైతుకూ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇన్నాళ్లుగా ఈ సమస్య కారణంగానే కౌలుదార్లకు అప్పులివ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్- 2011 ను తీసుకు వచ్చింది. గ్రామ సభలో కౌలు రైతుల్ని గుర్తించి వారికి గుర్తింపు కార్డుకు ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్రంలో  నేటి వరకు సుమారు 5 . 85 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేయించుకోగా వారిలో దాదాపు      5 . ౭౬  లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీరందరికీ పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను కోరినా అవి లక్ష్య పెట్టడంలేదు. నిన్నటిదాకా ఖరీఫ్ లో కౌలు దార్లకు మొండిచేయి చూపిన బ్యాంకులు వారు కరవు కారణంగా తీవ్రంగా నష్టపోయినా నేడు రుణాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా కౌలుదార్ల పరిస్థితి మరీ ఘోరం. నేడు రబీ లోనూ కౌలు దార్లకు పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు విసిగిస్తున్నాయి. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా బ్యాంకులు లక్ష్య పెట్టడం లేదు. ఫలితంగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సేద్యం చేయాలంటే కౌలుదార్లు మరోసారి నష్టాలకు సిద్దపడక తప్పదు. అసలే కష్టాల్లో ఉన్నరైతులు, కౌలుదార్లకు విరివిగా పంట రుణాలు ఇచ్చేలా పాలకులు శ్రద్ధ చూపాలి. శాసన సభలో మీ కంటే తామే బెటరని గొంతు చించుకున్న పాలక ప్రభుత్వం ఇప్పుడు రైతు కష్టాల్లో ఉన్నాడన్న స్పృహ ఎరిగి తక్షణ కర్తవ్యాన్ని గుర్తెరగటం మంచిది. ఎన్ని చట్టాలు చేసినా వాటిని అమలు చేయించలేని తన చేతకానితనమే రైతు సమస్యలకు మూలకారణమని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో మరి!

14 comments:

Saahitya Abhimaani said...

బాంకులు మనదగ్గర తీసుకున్న డిపాజిట్లలోంచి మాత్రమే అప్పులు ఇవ్వగలవు కాని, వాళ్ళకి వేరే విధమైన వనరులు ఏమీ లేవు, ప్రభుత్వం నుంచి బడ్జెటరీ సపోర్ట్ ఎమీ ఉండదు. ప్రబుత్వం బాంకులకు సూచించగలదే కాని, తప్పనిసరిగా ఇమ్మని అదేసించే స్థితి ఇంకా లేదు. ఆ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమంలో అవకతవకలు జరగలేదని ఏమిటి. దొడ్డిదారిలో లైసెన్సుడ్ కల్టివేటర్ గా గ్రామ సభలో ఇడెంటిఫై జరిగి ఉంటే?? ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, బాంకులకు ఒక గ్యారంటీ ఇవ్వాలి, ఇలాంటి ౠణాలు వసూలు కాకపోతే, ప్రభుత్వం కడుతుంది అని. అంతెకాని, ప్రతి దానికీ బాంకులు అంటే, ప్రజల డిపాజిట్లు గోవిందా అయిపోయి, 2008 లో అమెరికాలో వచ్చిన బాంకు ఋణాల సంక్షోభం మనకీ వస్తుంది.

అమిర్నేని హరికృష్ణ said...

ప్రసాద్ గారు
మీరు చెపింది అక్షర సత్యం. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి..? కానీ రాయలసీమ వంటి ప్రాంతాల్లో నేను కొన్నేళ్ళ క్రితం స్వయంగా తిరిగి రుణాల పరిస్థితిని సమీక్షించాను. కొందరు బ్యాంకు మేనేజర్లు రిజర్వు బ్యాంకు పేర్కొన్న నిబందనల్ని కూడా పాటించడం లేదు. రైతుల్ని కుక్కల్ని తరిమినట్టు తరుముతున్నారు. వారికి కనీసం 10 వేల రుణం కూడా ఇవ్వడం లేదు. దీనికి భిన్నంగా రైతుల్ని పాడి దిశగా ప్రోత్సహించి వారికి విరివిగా రుణాలిచ్చి రైతుల మనసుల్లో చోటు సంపాదించిన రామచంద్రరావు (చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి, కరీంనగర్ జిల్లాలో మేనేజర్ గా పనిచేశారు) వంటి కొందరు అధికారుల్నీ చూశాను. ప్రభుత్వం తోడ్పాటును అందించడంతో పాటు బ్యాంకులు కూడా తమ వంతు పాత్ర పోషించడం తప్పదంటాను. ఏమంటారు..?
కృతజ్ఞతలతో...
మీ
హరికృష్ణ

Praveen Mandangi said...

కౌలు రైతులకి ఋణాలు ఇస్తారు. వాళ్ళు పది వేలు అడిగితే మూడు వేలు ఋణం ఇస్తారు. వాళ్ళు మిగితా ఏడు వేలు ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అటు ప్రైవేట్ అప్పు తీర్చలేరు, ఇటు బ్యాంక్ అప్పు తీర్చలేరు. ఇది మన దేశంలో కౌలు రైతుల పరిస్థితి.

Praveen Mandangi said...

మా అమ్మగారు పనిచేసేది ఆంధ్రా బ్యాంక్‌లో. ఆంధ్రా బ్యాంక్ కూడా కొంత కాలం వ్యవసాయ ఋణాలపై దృష్టి తగ్గించి రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకి ఋణాలు ఇవ్వడం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి క్రెడిట్ కార్డ్‌లు ఇవ్వడంపై దృష్టి పెంచింది. ఆర్థిక సంక్షోభం వచ్చిన తరువాత సాఫ్ట్‌వేర్ రంగానికి పెద్ద మార్కెట్ లేదని అర్థమైపోయి క్రెడిట్ కార్డ్ బకాయిలు వసూలు చెయ్యడంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ప్రభుత్వ పథకాలకి ఋణాలు ఇస్తోంది కానీ ఏ బ్యాంకైనా గ్యారంటర్లు లేకుండా ఋణాలు ఇవ్వదు అని గుర్తుంచుకోవాలి.

Praveen Mandangi said...

హరికృష్ణ గారు, ఇక్కడ నిబంధనలు పాటించకపోవడం జరగదు. వ్యవసాయం ఏ దేశంలోనూ అంత లాభదాయకం కాదు కాబట్టి బ్యాంక్‌లు వ్యవసాయానికి ఋణాలు ఎక్కువగా ఇవ్వవు. మొన్నటి వరకు ఆంధ్రా బ్యాంక్‌లో వ్యవసాయ ఋణం ఎకరానికి ఆరు వేలు కంటే ఎక్కువ వచ్చేది కాదు. వ్యాపారానికి లోన్‌లు ఎక్కువ ఇస్తారు కానీ అవి కూడా గ్యారంటర్లు లేకుండా ఇవ్వరు. హైదరాబాద్‌లో చార్మినార్ బ్యాంక్ అనే బ్యాంక్ ఉండేది. రిజర్వ్ బ్యాంక్‌వాళ్ళు నియమాలకి విరుద్ధంగా ఆ బ్యాంక్‌కి మల్టీ స్టేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఆ బ్యాంక్ నుంచి యాభై మంది కస్టమర్లు 240 కోట్లు ఋణం ఎగ్గొట్టారు. వాళ్ళ నుంచి బకాయీలు వసూలు చేస్తే పది బ్రాంచ్‌లు నడపడానికి డబ్బులు సరిపోతాయి. కానీ ఆ బ్యాంక్ నష్టాలలో ఉందని విని ఫిక్సెడ్ డిపాజిటర్లు తమ డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు. చార్మినార్ బ్యాంక్‌కి చెందిన 22 బ్రాంచ్‌లు మూతపడ్డాయి. ఫిక్సెడ్ డిపాజిటర్లు ఆ బ్యాంక్ మీద నాంపల్లి కోర్ట్‌లో కేస్ వేశారు, ఆ బ్యాంక్‌వాళ్ళు లోన్‌లు ఎగ్గొట్టినవాళ్ళ మీద అదే కోర్ట్‌లో కేస్ వేశారు. కొందరు డిపాజిటర్లకి డబ్బులు తిరిగిచ్చారు, మిగిలిన డిపాజిటర్లు కోర్ట్ చుట్టు తిరుగుతున్నారు. ప్రభుత్వం చెప్పింది కదా అని అన్ని పథకాలకి ఋణాలు ఇచ్చేస్తే ఇలాగే అవుతుంది.

అమిర్నేని హరికృష్ణ said...

సర్
దేశంలో 18 శాతం రుణాలు వ్యవసాయరంగానికి ఇవ్వాలని రిజర్వు బ్యాంకు ఆదేశించిన సంగతి మీకు తెలుసు. ఈ ఆదేశాల్ని ఏ బ్యాంకు అమలు చేయటం లేదు. ఈ ఉల్లంఘన గురించే నేను ప్రస్తావించాను. అంతే. చార్మినార్ వంటి బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని కట్టకుండా కోట్లు నొక్కేసిన వారితో పోల్చితే పాపం బక్క రైతుల పరిస్థితి ఏమిటి? కట్టలేని స్థితి అయితే ప్రభుత్వాలు రైతుల తరపున బ్యాంకులకు భరోసా ఇవ్వాలి.

Praveen Mandangi said...

ప్రభుత్వాలు ఆ విశ్వాసం ఇవ్వవు. నాకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ ఆటోమొబైల్ లోన్ కోసం బ్యాంక్ చుట్టు తిరిగి లోన్ రాలేదని ప్రైవేట్ వ్యక్తి దగ్గర లోన్ తీసుకున్నాడు. ఒక నెల డబ్బులు కట్టకపోయినా ప్రైవేట్ వ్యాపారి ఆటో తీసుకెళ్ళిపోతాడు అని అతను భయంతో ఆటో నడుపుతున్నాడు. ప్రభుత్వం చెప్పిన తరువాత బ్యాంక్‌లు లోన్ ఇవ్వక చస్తాయా అని అనుకున్నాడు కానీ గ్యారంటర్లు లేకుండా బ్యాంక్‌లు లోన్‌లు ఇవ్వవు అని అతనికి తరువాత తెలిసింది. బ్యాంక్ మేనేజర్ లక్ష రూపాయలు దాటితే ప్రొపోజల్‌ని రీజనల్ ఆఫీస్‌కి పంపుతాడు. రీజనల్ ఆఫీస్‌వాళ్ళు ఒప్పుకుంటే లోన్ ఇస్తాడు. అంత వరకు అప్లికేషన్ పెట్టినవాళ్ళు బ్యాంక్ చుట్టు తిరగాలి. వ్యవసాయ ఋణాలంటారా? అది ఎలాగూ లాభదాయకమైన వృత్తి కానప్పుడు దానికి ఎంత వరకు ఋణాలు ఇవ్వగలరు?

Praveen Mandangi said...

ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల POలకి జాయిన్ అయిన కొత్తలోనే ఇరవై వేల జీతం, ఆ తరువాత పెరుగుతూ ఉంటుంది. రికవర్ చెయ్యలేని లోన్‌లు ఇచ్చేస్తే తమ ఉద్యోగులకి జీతాలు ఎలా ఇస్తారు? ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో సర్వీస్ చార్జెస్ తక్కువ. యూకో బ్యాంక్‌లో మినిమమ్ బాలెన్స్ లేకపోతే అకౌంట్ హోల్డర్‌కి నూట యాభై రూపాయలు చార్జ్ పడుతుంది, అదే ఆంధ్రా బ్యాంక్‌లో అయితే కేవలం యాభై రూపాయలు చార్జ్ పడుతుంది. ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో మాత్రం 250 రూపాయల నుంచి 750 రూపాయల వరకు చార్జెస్ పడతాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సర్వీస్ చార్జెస్ ఇంత తక్కువ వసూలు చేస్తున్నా కూడా అవి జీతాలు ఎక్కువ ఇవ్వగలుగుతున్నాయి. అటువంటప్పుడు రికవర్ చెయ్యలేని లోన్‌లు ఇచ్చేస్తే ఉద్యోగులకి జీతాలివ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?

Praveen Mandangi said...

బ్యాంక్‌లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టాల ప్రకారం ఎలా పని చేస్తాయి? కనుక కౌలు రైతులకి అప్పులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టం చెల్లదు.

Saahitya Abhimaani said...

హరి కృష్ణ గారూ, మీరు విలేఖరులు మీకు తెలియనిది కాదు. బాంకులను అనే ముందు, గ్రామాల్లో ఉన్న అసలు విషయాలు సమీక్షించాలి. కౌలుకు ఇవ్వటం అధికారికంగా ఎందుకు చేయించలేకపోతున్నారు? ప్రతివాడూ సోషలిజం అంటూ శోష వచ్చేవరకూ వాగటమే కాని ఇటువంటి చిన్న విషయాలు కూడా చేయించలేని "ఆర్మ్ చైర్" సోషలిస్టులతో నిండిన దేశం మనది. గ్రామాల్లో కౌలు రైతులకు తప్పనిసరి గుర్తింపు, ఆ కౌలు రైతుకు ఉన్న హక్కులు సవ్యంగా అనుభవించే ఏర్పాట్లు సామాజికపరంగా తేవాలి, దీనికి ప్రభుత్వం పూర్తి నిబధ్ధతో ప్రయత్నించాలి. వీటికి బాంకులు ఏమీ చెయ్యలేవు. కౌలు రైతుకు రికార్డు ప్రకారం గుర్తింపు ఉండి, పంటలో అతని భాగం ఎంతో పక్కాగా అందరికీ తెలిసేట్టుగా ఉంటే బాంకులు ఋణాలు ఎందుకు ఇవ్వవు! ఇప్పటి పరిస్థితి ఏమిటి, ఎవరు ఏమిటో తెలియదు, ఎవరో గ్రామ సభలో చెప్పెయ్యగానే బాంకులు ఆ వ్యక్తిని కౌలుదారు అనుకుని ఋణాలు ఇచ్చెయ్యాలా? అప్పుడు ఎన్నెన్ని అవకతవకలు జరుగుతాయి? చివరకు ఋణాలు కట్టకపొతే నష్టపొయ్యేది ఎవరు?? బాంకులు. బాంకులు నష్టపోతే పొయ్యేది ఎవరి డబ్బు? మీది, నాది, సమాజంలో కష్టపడి దాచుకున్న మన డబ్బు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు బాంకు ఋణాలు మాఫీ చేశాయి. కాని ఆ డబ్బుల్ని బాంకులకు అణా పైసలతో సహా ఇచ్చేసినాయి. ఎక్కడనుంచి?? మనం కట్టిన పన్నుల నుంచి, మనకు వెయ్యవలసిన రోడ్లు వెయ్యకుండా, రైతుకు కావలిసిన కరెంటు తయారీ/సరఫరా కు ఖర్చు పెట్టకుండా, ఇలా ఇంకా అనేక ప్రజా సంక్షేమాలకు ఖర్చు చెయ్యకుండా ఋణ మాఫీ జరిగింది. మొత్తం మీద చూస్తె ఈ ఋణ మాఫీ సమాజానికి ఉపయోగమా, నష్టమా అన్న విషయం పత్రికా రంగంలో ఉన్న మీ లాంటివారు విశ్లేషించి అందరికీ తెలియ చెప్పాలి.

బాంకులు ఎవడు చెపితే వాడికల్లా ఋణాలు ఇచ్చెయ్యాలి అంటె, ప్రజలందరూ, డబ్బులు దాచుకోవటానికి మరింకేమన్నా మార్గాలు వెతుక్కోవాలి.

Praveen Mandangi said...

డబ్బులు ఇచ్చి వడ్డీలు వసూలు చెయ్యడం ఏ రకంగానూ సోషలిజం కాదు. అది పెట్టుబడిదారీ విధానాలలో ఒకటి. సోషలిజం సంగతి తరువాత, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంలో ఏమి జరుగుతోందో చూద్దాం. పట్టాదార్ పాస్ పుస్తకాలు గానీ గ్యారంటర్ల స్యూరిటీ గానీ లేకుండా బ్యాంక్‌లు అప్పులు ఎలా ఇస్తాయి? ఇస్తే అవి కూడా చార్మినార్ బ్యాంక్‌లాగ బ్యాంక్రప్ట్ అవుతాయి. బ్యాంక్‌లు బ్యాంక్రప్ట్ అయితే అందులో ఫిక్సెడ్ డిపాజిట్లు వేసినవాళ్ళు కూడా నష్టపోతారు కదా. ఇరవై వేలు ఫిక్సెడ్ డిపాజిట్ వేసినవాడు తన డబ్బులు తిరిగి తెచ్చుకోవడానికి కోర్ట్ చుట్టూ తిరిగితే పది వేలు రూపాయలు ఖర్చవుతాయి. పది శాతం వడ్డీ వస్తుందనుకుంటే పది వేలు రూపాయలు ఖర్చైపోతాయి.

Praveen Mandangi said...

ప్రభుత్వ లెక్కల ప్రకారమే మా జిల్లాలో per capita bank balance కేవలం 1500 రూపాయలు. పావలా వడ్డీ ఋణాల పేరుతో ప్రతివాడు బ్యాంక్‌కి పది వేలు రూపాయలు ఋణం అడిగితే బ్యాంక్‌లు ఎక్కడ దొంగ నోట్లు ప్రింట్ చేసి ఋణాలు ఇస్తాయి? ఋణ గ్రహీతల దగ్గర 7% వడ్డీ వసూలు చేసి ఫిక్సెడ్ డిపాజిటర్లకి 10% వడ్డీ ఇచ్చే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్‌లైతే ఈ సర్వీస్ కూడా చెయ్యవు.

Praveen Mandangi said...

ఇంకో జోకేమిటంటే బ్యాంక్‌లు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకి ఇస్తున్న 3.5 శాతం వడ్డీని 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఋణ గ్రహీతల నుంచి కనిష్టంగా వసూలు చేసేదే 7% వడ్డీ. అటువంటప్పుడు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకి 10% వడ్డీ ఎలా ఇచ్చేస్తారు? ఫిక్సెడ్ డిపాజిటర్లకి 10% వడ్డీ ఇస్తున్నారు. అయినా బ్యాంక్‌లలో ఫిక్సెడ్ డిపాజిట్లు వేసేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఎక్కువ వడ్డీలు ఇస్తామని చెప్పే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలని మాత్రం నమ్ముతారు, అవి ఎన్ని సార్లు బోర్డులు తిప్పేసి మోసం చేసినా సరే. వీళ్ళకి లోన్‌ల కోసం బ్యాంక్‌లు కావాలి కానీ డిపాజిట్ల కోసం మాత్రం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు కావాలి. వీళ్ళు అప్పులు తీర్చలేకపోతే బ్యాంక్‌లు నష్టపోతాయనే జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఎవడేమైపోతే నాకేమిటి, నాకు కావలసినది నాకొస్తే చాలు అనుకునే వైయుక్తికవాదం ఉంటే ఇలాగే ఉంటుంది.

Praveen Mandangi said...

ఉత్పాదక పరిశ్రమలు ఎక్కువగా లేని దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడతారు. దేశంలో ఉత్పాదక పరిశ్రమలు పెట్టకుండా విదేశాల నుంచి కంప్యూటర్లు, ఎసిలు దిగుమతి చేసుకోవడం మన పాలక వర్గంవాళ్ళ తప్పే కానీ రైతుల తప్పు కాదు. ఈ పరిస్థితి నుంచి రైతులు ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అంతే కానీ లాభదాయకం కాని వ్యవసాయానికి లోన్‌లు ఇవ్వమంటే బ్యాంక్‌లు ఇవ్వలేవు.