Pages

Thursday 15 December 2011

రూపాయి బియ్యంలో పురుగులు ఇందుకే వస్తున్నాయ్..!

                                                              
ఉద్యోగుల కొరత కారణంగా నిల్వ చేసిన ఆహార ధాన్యాల నాణ్యతకు సంబంధించి తనిఖీలు చేపట్టడం లేదని భారత ఆహార సంస్థ చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత ఆహార సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగులు గత తొమ్మిదేళ్ళలో సుమారు వెయ్యి మంది తగ్గిపోవడంతో సాధారణ తనిఖీలు కూడా చేపట్టలేని స్థితిలో ఎఫ్.సి.ఐ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు కొనుగోలు చేసి నిల్వ చేసే ఆహార ధాన్యాల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వికేంద్రీకరణ కొనుగోళ్ళ పధకం (డి.సి.పి) ప్రకారం ఆహార ధాన్యాల కొనుగోళ్ళు, జాగ్రత్తగా నిల్వ చేయడం రాష్ట్రాల బాధ్యత. ఎఫ్.సి.ఐ నుంచి నాణ్యమైన ఆహార ధాన్యాలను తీసుకుని చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించడం కూడా రాష్ట్రాలే చూసుకోవాలి. ఎఫ్.సి.ఐ డిపోల నుంచి ఆహార ధాన్యాలు పంపిణీ కేంద్రాలకు వెళ్ళే ముందు కల్లెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు నాణ్యతను పరిశీలించుకోవాలి ఇప్పటికే ఎఫ్.సి.ఐ పౌరసరఫరాల శాఖను కోరింది. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి వాటిని తగిన ప్రమాణాలతో నిల్వ చేయాలని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన నేపధ్యంలో ఆహారోత్పతుల నిల్వలో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
                                                         
ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో రూపాయికే కిలో బియ్యం పధకాన్ని ప్రవేశపెట్టడం ఆ బియ్యాన్ని అందుకున్న వారెందరికో బియ్యంలో పురుగులు కనిపించడం తెలిసిందే. ఆహార ధాన్యాల నిల్వల నాణ్యతా తనిఖీలు లోపించడం వల్లనే ఈ తరహా సమస్యలు తలెత్తి ఉంటాయని మనం  ఊహించవచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం వల్లనే ఆహార ధాన్యాలు ముక్కి పోతున్నాయని గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని పలుమార్లు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా జాగ్రత్త పడి పేద ప్రజలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాలను సక్రమంగా నిల్వ చేయడంపై ఎఫ్.సి.ఐ తో పాటు కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి.

No comments: