Pages

Friday 16 December 2011

కరెంటు కష్టాలు....


                                                      
ఓ వైపు మంచు దుప్పట్లు రాష్ట్రాన్ని కప్పేస్తుంటే., నడి శీతాకాలంలోనే కారు చీకట్లు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా కరెంటు కష్టాలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కరవు దెబ్బతో ఇప్పటికే రాష్ట్ర రైతులు అల్లాడుతుంటే, కరెంటు సరఫరా సక్రమంగా లేక వేసిన పంటలు సైతం ఎండుముఖం పడుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన విద్యుత్  డిమాండ్,   సరఫరా పడిపోవడం వ్యవసాయానికి ఏడు గంటలు అందించాల్సిన పరిస్థితుల్లో గృహాలకు కోతలు తప్పడం లేదని కొందరు అధికారులు బాహాటంగానే ఆంగీకరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ల నీటి మట్టాలు తగ్గటంతో జల విద్యుత్ 1500 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఫలితంగా శీతాకాలం మధ్యలోనే దినసరి విద్యుత్ వాడకం 250 మిలియన్ యూనిట్లకు చేరువైంది. వేసవి సమీపించేకొద్దీ ఇది మరింత పెరుగుతుందన్న ఆందోళన విద్యుత్ శాఖను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇపుడు పంటలకు కరెంటు సరఫరాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరవు దెబ్బతో నష్ట పోయిన రైతులు చేనుకు నీరందించే మార్గం లేక వారు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోని  చాలా ప్రాంతాల్లో రబీ పంటలు ఎండుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాకతీయ ధర్మల్ ప్రాజెక్ట్ లో 70 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడం జెన్ కోకు మరో దెబ్బ.  
                                                           
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాపం రాష్ట్ర  సర్కారు వినతుల్ని కేంద్రం పెడచెవిన పెట్టడంతో  ఏం చేయాలో పాలుపోక కిరణ్ సర్కారు తలపట్టుకుంటోంది. మరో వైపు పరిశ్రమలకు చాలినంత సరఫరా లేక వారు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గిన కారణంగా ఇప్పటికే పరిశ్రమలకు 42 శాతం మేర ట్రాన్స్ కో కోత పెడుతోంది. ఈ నేపధ్యంలో  కరెంటు కోతలకు స్వస్తి చెబుతామని పైకి గంభీరంగా చెబుతున్నా సమస్యను ఎలా అధిగమించాలో అర్ధం కాక సర్కారు గుంజాటన పడుతోంది.  అటు రైతులు ఇటు పరిశ్రమలు మధ్యలో గృహ వినియోగదార్లు పడుతున్న అగచాట్లతో ఆంధ్ర ప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు దోమలతో మరో నెల తర్వాత వేసవిని తలపించే వాతావరణంతో ఉక్కపోతను భరించటానికి ప్రజలు సిద్దం కావాలి మరి!     

No comments: