Pages

Saturday 18 February 2012

జేపీ పాదయాత్ర -ప్రభుత్వం నేర్వాల్సిన గుణపాఠం

                                                             
రాష్ట్రంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను కూడా మిల్లర్లు అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బోనస్ సైతం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. "అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు" చందంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మంచి రేటు వచ్చే ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా రైతుల్ని అడ్డుకుంటోంది. రైతులు స్వేచ్చగా ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సిగ్గుచేటు. దీన్ని నిరసిస్తూ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఈ రోజు ఉదయం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్ణాటకలోని గిల్కసూగుర్ వరకు "రైతు సత్యాగ్రహ పాదయాత్ర" చేపట్టారు. వ్యవసాయానికి అయ్యే ఖర్చు 40 నుంచి 50 శాతం పెరిగితే ప్రభుత్వాల విధానాల వల్ల రైతుకు లభించే రేటు 30 - 40 శాతానికి పడిపోయిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించి కర్ణాటకలో ధాన్యాన్ని విక్రయిస్తామని చేతనైతే దీన్ని అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చట్ట విరుద్ద ఆంక్షల్నిఉల్లంఘించడం వినా రైతులకు మరో మార్గం లేదంటున్న జేపీ, తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు మేలు చేస్తే చాలంటున్నారు. జేపీ నిబంధనల్ని ఉల్లంఘించడం అటుంచి కేంద్రం ఆదేశాల్ని అమలు చేయకుండా రైతుల్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శిక్ష వేయాలి..? ఈ పాలకుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షించాలి..?ప్రభుత్వం జేపీ పాదయాత్ర తర్వాతైనా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

No comments: