Pages

Sunday 29 January 2012

"శ్రీ" వరి సాగులో బీహార్ రైతుల ప్రపంచ రికార్డ్

                                                     
బీహార్ కు చెందిన ఐదుగురు రైతులు సాధించిన అపూర్వ విజయమిది. వీరంతా చైనాకు చెందిన ఒక రైస్ బ్రీడర్ సాధించిన ప్రపంచ రికార్డును తిరగ రాశారు. వరి సాగులో ఈ రైతులు సాధించిన విజయం వెనుక అక్కడి వ్యవసాయ అధికారుల కృషి ఎంతో ఉంది. బీహార్లోని నలంద జిల్లా కత్రిసరాయ్ బ్లాక్ లోని దార్వేష్ పురా అనే ఓ మారుమూల గ్రామం ఈ ప్రపంచ రికార్డ్ కు వేదిక కావడం విశేషం. ఈ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు " శ్రీ "  సాగు పద్ధతిలో (సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్)  వరి సాగు చేసి హెక్టారుకు 224 క్వింటాళ్ళ (22 .4 టన్నులు) ధాన్యం దిగుబడిని సాధించారు. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన యువ రైతు సుమంత్ కుమార్ ఈ రికార్డ్ ను సాధించిన రైతుగా ప్రపంచ ఖ్యాతిని అందుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ అనే రైతు 220  క్వింటాళ్ళు., నితీష్ కుమార్ అనే రైతు 196 క్వింటాళ్ళు.,  రామానంద్ సింగ్ 192  క్వింటాళ్ళు.,  సంజయ్ కుమార్ 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించడం అపూర్వం. వీరిలో ఒకరు మాత్రం గతంలో చైనా నెలకొల్పిన రికార్డును సమం చేయగా మిగిలిన నలుగురూ దాన్ని బ్రేక్ చేశారు. చైనాకు చెందిన యాన్ లాంగ్ పింగ్ అనే రైస్ బ్రీడర్ 2004 లో DH-2525 అనే వరి వంగడాన్ని వాడి హెక్టారుకు 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి రికార్డ్ ను నెలకొల్పాడు. ఇతన్ని చైనాలో " ఫాదర్ అఫ్ హైబ్రిడ్ రైస్ " గా పిలుస్తారు. 
                                 

బీహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ అరవింద్ సింగ్., జిల్లా వ్యవసాయాధికారి సుధామ మహతో తదితరులు సుమంత్ అతని సహచరుల పొలాలకు వెళ్లి స్వయంగా ఈ రికార్డ్ దిగుబడికి నెలవైన పంట పొలాలను పరిశీలించి వచ్చారు. నలంద జిల్లాలో 2008 లో మొదలైన " శ్రీ " సాగు విధానం వల్ల దాదాపు 25 వేల మంది రైతులు నేడు ఈ పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. తమ రైతులు సాధించిన ఈ విజయాలతో పొంగిపోయిన బీహార్ డైనమిక్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలో రెండో హరిత విప్లవం బీహార్ నుంచే ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

      నిజానికి బీహార్ లో "శ్రీ " వరి సాగులో ఇంత విప్లవం రావడం వెనుక మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన సహకారం కొంత ఉంది. 2003 లో ఒక రకంగా దేశంలో తొలిసారిగా మన రాష్ట్రం "శ్రీ " వరి సాగుకు శ్రీకారం చుట్టింది. 1983 లో మడగాస్కర్లో  ప్రపంచంలో తొలిసారి "శ్రీ " సాగు పద్దతి మొదలయ్యాక నేడు విశ్వ వ్యాప్తమైంది. మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ పద్ధతిని పాటించాక దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నుంచి స్పూర్తిని పొందాయనే చెప్పాలి. అప్పట్లో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా ఉన్న డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ  అప్పటికే శ్రీలంక లో సాగులో ఉన్న "శ్రీ" సాగు విధానాన్ని పరిశీలించి వచ్చి మన రాష్ట్రంలో ఈ పద్దతిని ప్రోత్సహించారు. వారి కృషి వల్ల " శ్రీ" సాగు అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 2004 లో రాష్ట్రానికి చెందిన గుడివాడ నాగరత్నం నాయుడు అనే రైతు హెక్టారుకు సుమారు 17 . 25 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి జాతీయ స్థాయిలో ఆదర్శ రైతుగా నిలిచారు. 
                                                              
అదే కాలంలో బీహార్ రాజధాని పాట్నా లో ఉన్న  Directorate of rice Developement  డైరెక్టర్ గా ఉన్న దివాకర్ మన విశ్వవిద్యాలయానికి వచ్చి " శ్రీ " సాగులో శిక్షణ పొంది, మెలకువలు తెలుసుకుని తన రాష్ట్రంలో ఈ పధ్ధతి వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. దీని ఫలితంగా నేడు బీహార్లోని ఒక్క నలందా జిల్లాలోనే 90 శాతం మంది రైతులు   "శ్రీ " పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 2005 లో సత్యనారాయణ గారు పదవీ విరమణ చేశాక " శ్రీ " సాగు వ్యాప్తి గురించి విశ్వవిద్యాలయంలో ఆశించిన మేరకు కృషి జరగలేదు. వ్యవసాయ శాఖతో సహా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా మన రాష్ట్రంలో ఈ పద్దతిని పరిశీలించిన బీహార్, బంగ్లాదేశ్, అస్సాం, బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు " శ్రీ " సాగుతో  విప్లవాత్మక మార్పులు  తీసుకు వస్తే.,  మన రైతులు మాత్రం ఆరేళ్ళు  గడిచినా "శ్రీ" వ్యాప్తికి ముందుకు సాగలేక పోయారు. సత్యనారాయణ గారు అందించిన సహకారంతో పాటు స్వయం కృషితోనే నాగరత్నం నాయుడు వరి సాగులో అధిక దిగుబడులు సాధించగలిగారు.  నేడు ఆయన ఒక్కరే "శ్రీ " పద్దతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా తోటి రైతులకు సేవలందిస్తున్నారు. 
సుమంత్ అనే యువ రైతు సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని  కోరుకుందాం.

Friday 27 January 2012

ఇన్నాళ్ళకు కరవు బృందం వస్తుందట!

                                                              
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సుమారు 34 .24 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ లో మొదలైన కరవు నేటికీ రబీ లోనూ కొనసాగుతుండటం రైతుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రైతుకు అంతకు మించిన విచారం ప్రభుత్వ సహాయ నిరాకరణ రూపంలోనూ ఎదురైంది. ఖరీఫ్ కరవు పరిస్థితులపై కేంద్రానికి నివేదించిన రాష్ట్రం తగిన సహాయాన్ని పొందటంలోనూ, స్వయంగా రైతులకు తానూ సహాయం చేయడంలోనూ విఫలమైంది. కరవు తీవ్రతను తెలుసుకునేందుకు, రైతులకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఫిబ్రవరి 5 న రాష్ట్రంలో పర్యటించనుంది. కరువొచ్చిన ఆర్నెల్లకు కేంద్ర బృందం ఏం చూసి రైతుకు సహాయ పడుతుందో ఏలిన వారికే తెలియాలి. 
                                                                
గత కొన్నేళ్లుగా రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం మాని చేష్టలుడిగి చూస్తున్నాయి. కేంద్రం సైతం ఆంధ్ర ప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపుతోంది. ఇటీవల "థానే" తుపాన్ దెబ్బ తగిలిన తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయంగా రూ. 600 కోట్లు ప్రకటించింది. అటువంటి భారీ నష్టాలను ఇటీవలి  కాలంలో తరచుగా చవిచూసిన ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోంది. కోరిన సాయంతో పోల్చితే ముష్టి విదిల్చినట్టు నామమాత్రపు సాయం ప్రకటిస్తున్న కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రైతుల జీవితాలతో ఆటలాడుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతు శ్రేయాన్ని గాలికి వదిలేసింది. రైతాంగం ఇంత తీవ్ర కరవు కష్టాల్లో ఉండగా వారిని ఆదుకునేందుకు నోరు మెదపని మన ఎంపీలను ఏం చేయాలి...? రాజకీయాలు లేదా వారి సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప  వీరు ప్రజలకు చేస్తున్నదేమిటి..? వీరి నిర్లక్ష్యానికి తగిన జవాబు చెప్పేందుకు రైతులు సంసిద్ధం కావాలి. రైతులకు ఇచ్చే పరిహారంలోనూ వాటాలు పంచుకునే నీతిలేని నాయకులకు పార్టీలకు అతీతంగా రైతులు గట్టి జవాబు చెప్పాలి.
 

Monday 16 January 2012

"ఉచిత" డ్రామాలొద్దు

                                                            
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కూడా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్, రుణాల మాఫీతో రైతుల్ని, చేనేత వర్గాలను బుట్టలో వేసుకోవాలని తపిస్తున్నారు. భారతీయ రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదిస్తారే తప్ప రాజకీయ నాయకుల్లా తేరగా వచ్చే వాటికి ఆశపడరు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డీ కరిచే నేతలు రైతుల కోసం ఉచిత వాగ్దానాలను ఇవ్వటం కంటే రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావడం లేదు..? పంట పండించేందుకు అవసరమయ్యే ఉత్పాదకాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి..? అసలవి అందుబాటులో ఉన్నాయా..? గిరాకీ సరఫరాకు తగిన రీతిలో ఉత్పత్తి వస్తోందా.. లేక ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారా.. అటువంటి సందర్భాల్లో మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని ఏ మేరకు ఆదుకుంటోంది  ..? అలానే ఉత్పత్తికి విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఏ మేరకు కల్పిస్తోంది..?  దేశంలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న వ్యవసాయ దిగుమతుల పై సుంకాలు విధించి దేశీయ రైతులకు తగిన రక్షణలు కల్పిస్తోందా...?  తద్వారా మన రైతులకు మంచి ధరలు వచ్చేలా చూస్తోందా... ?  ఇక్కడ ఒక్క ములాయం గురించే కాదు ఉచిత వాగ్దానాలతో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వారి పరిస్థితిని దిగజార్చే ప్రతి పార్టీకీ., ప్రతి నాయకునికీ ఈ విమర్శ వర్తిస్తుంది. నేతలూ గుర్తుంచుకోండి... మీ ఉచిత వాగ్దానాలతో ప్రజల్ని సోమరుల్లాగా మార్చకండి. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయకండి. మన నేతలు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు పైన పేర్కొన్న వన్నీ చేస్తే ఉచిత వాగ్దానాలు ఇచ్చి రైతుల్ని మోసగించాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఫలితాన్నివ్వండి చాలు. రైతుకు అదే పదివేలు.   

Saturday 14 January 2012

ఈటీవీ- 2 లో నేటి రాత్రి 9 గంటలకు సంక్రాంతిపై ప్రత్యేక చర్చ

                                                                                                                                    సమ్యక్ క్రాంతి  సంక్రాంతి. సంప్రదాయాలలోని సౌందర్యాన్ని, అంతర్లీన సందేశాన్ని ., ఒక తరం నుంచి మరో తరానికి అందించే పెద్ద పండుగ సంక్రాంతి. నేటి భోగి రోజు రాత్రి 9 గంటలకు ఈటీవీ- 2 ప్రతిధ్వని కార్యక్రమంలో "సంక్రాంతి శోభ" పేరిట పండుగ విశిష్టతపై ఒక చర్చా కార్యక్రమం నిర్వహించాము.  ఈ చర్చలో సాహితీవేత్త, అవధాని డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, పరిశోధకులు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీతా రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. సంక్రాంతి గొప్పదనాన్ని తెలియజేసే సంగతులెన్నో ఈ చర్చలో చోటు చేసుకున్నాయి.
                                                          
సంక్రాంతి అంటే పవిత్ర దివ్యకాంతి. హృదయానికి శాంతిని ప్రసాదించేదే సంక్రాంతి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పాడిపంటలు, పిండి వంటలు, కొత్త దుస్తులు, బందుమిత్రులతో సంక్రాంతి సందడి గ్రామ గ్రామానా వెల్లివిరుస్తోంది.  భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువులతో నేడు భోగి కనువిందు చేస్తుంటే., రేపటి మకర సంక్రాంతి ఎల్లుండి కనుమ పండుగ సంబరాలను పతాక స్థాయికి తీసుకువెళతాయి. ఎటొచ్చీ రైతుల పండుగ నాడు అన్నదాతలే ఆనందంగా లేరు. ఈ పండుగ అందరికీ సకల శుభాలను అందించాలని కోరుకుంటూ బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
                                  మీ
                         అమిర్నేని హరికృష్ణ

Wednesday 11 January 2012

రైతు మళ్ళీ ఓడిపోయాడు!

                                           
 అవును. మరోసారి ప్రకృతి చేతిలో కోస్తా రైతు చావుదెబ్బ తిన్నాడు. పట్టించుకోని పాలకులు రైతుల్ని పదే పదే దేబ్బతీస్తుంటే., ప్రకృతి సైతం అన్నదాతల సహనాన్ని పరీక్షిస్తోంది. గత కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలంగాని కాలంలో వర్షాలు కురుస్తూ రైతుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. పంటకు అవసరమైనప్పుడు వర్షాలు కురవటంలేదు. అవసరం లేని సమయాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు అపార పంట నష్టాలకు కారణమవుతున్నాయి. సాధారణంగా నవంబర్ తర్వాత తుపాన్లు రావు. కానీ సీజన్లు గతి తప్పడంతో డిసెంబర్ లోనూ జనవరి లోనూ తుపాన్లు, అల్ప పీడన ద్రొణులూ  ఏర్పడుతూ  పంట పూత, కాత
 దశల్లో తీవ్ర నష్టం కలిగించి రైతుల్ని అప్పులపాల్జేస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతి చేస్తున్న గాయాలైతే., ఆ నష్టాల నుంచి రైతుకు ఉపశమనం కల్గించాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో అన్నదాతకు గుండెకు అంతకు మించిన గాయమవుతోంది. తాజా భారీ వర్షాలతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు ఇతర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ రైతుల్ని కలవరపరుస్తున్నాయి. ఫలితంగా వరి, పొగాకు, మిర్చి, మినుము, పెసర, సెనగ పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేలో కోసిన వరి పనలు వశాలకు తడిసి గింజలు మొలకెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు.
                                                           
ఈ సీజన్లో ఇప్పటికే ఖరీఫ్ పంటలు కోల్పోయి రైతులు అప్పుల పాలయ్యారు. రబీ పంటలు వేయగానే థానే తుపాన్ కొంత ప్రభావం చూపింది. తాజాగా కోస్తాపై నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలు రైతుకు కంట నీరు తెప్పిస్తున్నాయి. అకాల వర్షాలతో ఆశలు ఆవిరి చేసుకున్న రైతులు తమ దురదృష్టానికి నేడు చింతిస్తునారు. కాలం కలసి రాక ప్రభుత్వం పట్టించుకోక ఏకాకిగా మిగిలిన రైతులు,  ఈసారి సంక్రాంతి పండుగను కూడా ఉత్సాహంగా  చేసుకోలేని స్థితిలో ఉన్నారు. తమ లక్ష్యాల సాధన కోసం ఉద్యమాలు, సమ్మెలు చేసి ప్రభుత్వాలను అదిలించి కదిలించే వర్రితో పోల్చితే అన్నదాతలెంత అమాయకులు. ఒకవైపు చుట్టుముట్టిన కరవు, మరోచోట భారీ వర్షాలతో పంట నష్టాలు... కరవుపై కార్యాచరణ ప్రకటించని సర్కారు... రాష్ట్రంలో అసలు వ్యవసాయాన్నే పట్టించుకోని పరిస్థితులుంటే అన్నదాతలు ఒంటరిగా మిగలక ఏం చేస్తారు..?

Thursday 5 January 2012

రైతుల ఆత్మహత్యల్ని ఆపలేరా...?

                                         
రాష్ట్రంలో తూర్పు గోదావరి సహా పలు జిల్లాల రైతులు గత ఖరీఫ్ లో పంట విరామం ప్రకటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసినా పాలకులు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. గత సెప్టెంబరు 17 వ తేదీన మోహన్ కందా కమిటీ నివేదికపై చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కమిటీ సూచనల్లో చాలా వాటికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఇవి అమలుకు నోచుకోకపోవడం రైతు శ్రేయం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న సంగతిని స్పష్టం చేస్తోంది. వీటికి తోడు దాదాపు 772 కి పైగా  కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన కార్యాచరణను మాత్రం నేటికి ప్రకటించి అమలు చేయలేకపోయింది.  వ్యవసాయ వ్యవస్థ నాశన మవుతున్నా కొద్ది రోజులు గడిస్తే రైతులే ఆ విషయం పట్టించు కోరులే అన్న దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుంది. కనీసం తాను హామీ ఇచ్చిన వాటిని సైతం అమలు చేయకుండా పంట విరామం ప్రకటించిన రైతుల్ని ప్రభుత్వం అవమానపరుస్తోంది. తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకొకపోవటాన్ని రైతులోకం తప్పుబడుతోంది.
                                                           
వరుసగా సీజన్ల తరబడి రైతులు నష్టాల పాలవుతున్నారు., ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదు. గత మూడు నెలల్లో రాష్ట్రంలో వందకి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా  థానే తుపాన్ వచ్చి దక్షిణ కోస్తా జిల్లాల రైతుల ఆశల్ని దెబ్బతీసింది. ప్రతి సీజన్లో ఏదో ఒక భారీ నష్టం రైతుల ఆశల్ని ఆవిరి చేస్తుంటే ఏ ధీమాతో రైతులు మరో పంట సాగుకు వెళ్ళే అవకాశముంది..? వరుస నష్టాలు రైతుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. అప్పులు పెరిగి వ్యవసాయంపై విరక్తిని పెంచుతాయి. అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పురికొల్పుతాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే పట్టించుకోకపోతే రైతులు ఎవరిని ఆశ్రయిస్తారు...? రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దేనికి సంకేతం..? వ్యవసాయం కునారిల్లితే ఆర్ధిక ప్రగతి కుంటుపడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేని నేతల పాలనలో పాపం రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇప్పటికైనా సేద్యరంగ మూలాలకు చికిత్స చేసి వ్యవసాయదారుల్ని కాపాడలేరా...?  పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల్ని ఆపలేరా...? రాష్ట్రంలో కొంతకాలంగా రాజకీయాలు తప్ప మరో వ్యాపకం పట్టించుకోని నేతలు  తమను ఎన్నుకున్న ప్రజల గోడును ఇకనైనా పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న!

Wednesday 4 January 2012

రేపటి నుంచి ఒంగోలులో ప్రపంచ తెలుగు మహోత్సవం

                                                                   
ప్రపంచ తెలుగు మహోత్సవం రేపటి నుంచి ఒంగోలులో ప్రారంభం కానుంది. ఒంగోలులోని  పీ.వీ.ఆర్. పురపాలక ఉన్నత పాటశాలలో తెలుగు మహోత్సవాలు నిర్వహించనున్నారు. రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడెమి, న్యూడిల్లీ, ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈమహోత్సవంలో రాష్ట్రానికి చెందిన కళారూపాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం పాల్గొంటున్నారు. రాంకీ ఫౌండేషన్ హెడ్ ఎంవీ రామిరెడ్డి ఈనాడు ఆఫీసుకు వచ్చి ఈ ఉత్సవాల్లో వ్యవసాయంపై ఉపన్యసించాలని కోరారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ఛానల్ సమావేశాలు ఉన్నందున బిజీ గా ఉండటంవల్ల సాధ్యపడదని చెప్పి కృతఙ్ఞతలు తెలిపాను. తీవ్రమైన  పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది.
                                      
ఈ మహోత్సవంలో స్త్రీ చైతన్యం., వ్యవసాయం., ప్రచార ప్రసార సాధనాలు., సాంస్కృతిక ప్రదర్శనలు., సాహిత్యం., ఉపాధి కల్పనా., విదేశీ స్వదేశీ ప్రతినిధుల చర్చ., ప్రజా ప్రతినిధుల గళం., అష్టావధానం., భాష., పర్యావరణం., విద్య., చరిత్ర సంస్కృతీ., తదితర అంశాలపై చర్చలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు., జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అన్ని రంగాల ప్రముఖులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు.