Pages

Wednesday 31 August 2011

వినాయకచవితి నాడు బాల్యంలో నా జ్ఞాపకాలు

                                                                
వినాయక చవితి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి పత్రి కోసం మిత్రులతో కలిసి పొలాలకు వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మా వూర్లో వినాయకుడికే ఉత్సవాలు బాగా జరుగుతాయి. గణపతి నవరాత్రుల కాలంలో గ్రామంలో హరికధ, బుర్రకధ, తదితర పురాణ కాలక్షేపాలతో ఉత్సవ వాతావరణం ఉండేది. మరే పండగకు అలాంటి శోభ కనిపించదు. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ నా చిన్నతనంలో అదే ప్రత్యేక ఆకర్షణ. గ్రామం సెంటర్లో ఉండే వినాయక గుడిలో భారీ మట్టి వినాయకుడిని పెట్టి భక్తి శ్రద్దలతో పూజించేవారు. నిమజ్జనం రోజు ఆ విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి పంట కాలువలో కలిపేసేవారు. 
                   ఇది అన్ని ఊళ్లలో చేస్తారు వింతేముంది అని మీకు అనిపించవచ్చు., కానీ ఇప్పుడంటే ఆఫీస్ నుంచి వెళుతూ పత్రి పట్టుకు వెళుతున్నాం. మా  వూర్లో  పత్రి కొనటం కంటే ధనిక, పేద, చిన్న, పెద్ద రైతులు, కూలీలు ఈ తేడాలేమీ లేకుండా ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒక్కరు (మరీ ఆరోగ్యం బాగోని పక్షంలో తప్ప) పత్రి సేకరించేందుకు వచ్చేవారు. మేమంతా ఉదయం 5 గంటలకే నిద్ర లేచి  కనీసం రెండు కిలోమీటర్లు వెళ్లి పొలాల వెంట తిరిగి అన్ని రకాల పత్రాలను సేకరించి వస్తూ వస్తూ పెద్ద కాలువలో స్నానం చేసి 7 గంటల కల్లా తిరిగి వచ్చేవారం. ఈ క్రమంలో మా మిత్ర బృందమంతా కలిసి ఒక్కటిగానే వెళ్ళేవారం. పెద్ద కాలువలో దిగాలంటే మొదట్లో భయం వేసేది. రైతు బిడ్డను కదా చిన్నప్పుడే ఓ ఏడాది నాన్న ఈత నేర్పించడంతో ఆ భయమూ పోయింది. పత్రి సేకరణ, కాలువ స్నానం... స్నేహితులతో నిజంగా అదొక గొప్ప అనుభూతి. ముందు రోజు తెచ్చిన మట్టి విగ్రహం పెట్టి ఆ రోజు పూజ పూర్తి చేసేవారం.  ఏటా వినాయకచవితి అంటే గుర్తుకువచ్చే ఈ జ్ఞాపకాలను తడిమి తడిమి చూసుకోవడం అదొక అనిర్వచనీయమైన అనుభూతి. 
   మీకూ ఇటువంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా..? ఇంకేం ఎంచక్కా బాల్యంలోకి వెళ్లి ఆ జ్ఞాపకాలను ఒక్కసారి ఆస్వాదించి రండి. మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                          
అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. గత ఏడాది కంటే ఈసారి పర్యావరణం పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో పెట్టిన మట్టి విగ్రహాలే ఇందుకు సాక్ష్యం. ప్రజల్లో ఈ అంశంపై మంచి అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు. ఇదే స్పూర్తిని ఇక ముందూ కొనసాగించి మన పర్యావరణాన్ని  కాపాడే క్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం.

Sunday 28 August 2011

మట్టి వినాయకుడికీ జై!

                                                              
వినాయక చవితి సమీపించింది. రెండు రోజుల్లో తమ తమ ఇళ్ళలో పూజించే ప్రతి ఒక్కరూ చిన్న చిన్నవిగ్రహాలను కొనుగోలు చేయడం మొదలుపెడతారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాదన్నా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. పక్కింటి వారిని చూసి పోటీ పడకుండా., పొరుగు కాలనీ వారికంటే పెద్ద విగ్రహం పెట్టాలనుకోకుండా, భారీ విగ్రహం పెట్టి మన అపార్టుమెంటులో ఇతరుల కంటే ఘనంగా చేయాలనే గొప్పలకు పోకుండా మట్టి విగ్రహాలను పెట్టి మన పరిసరాలను కాపాడుకుందాం. ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. ఈ రోజు మిత్రుడు వాసిరెడ్డి అమరనాధ్ గారు తన స్లేట్ స్కూల్ లో 2000 మట్టివిగ్రహాలను తన విద్యార్ధులకు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. పర్యావరణంపై విద్యార్ధుల్లో చైతన్యం తీసుకు రావాలనే వారి తపనను అభినందిస్తూ, గత ఏడాది కంటే మరింత మంది మట్టి విగ్రహాలు పెట్టి పూజించాలని కోరుకుంటూ సకల జనావళికి రంజాన్, వినాయక చవితి శుభాకాంక్షలు.

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం!

                                                                          
చాప కిందకి నీళ్ళు వస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్.ఎల్.డి.అధ్యక్షుడు అజిత్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదట సారిగా ఆంధ్రాలో రైతులు సమ్మె చేయడం చూశామని, ఇది జాతీయ స్థాయి ఉద్యమానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. పంట విరామం ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చిన ఆయన తర్వాత డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో రైతుల పరిస్థితి  దారుణంగా ఉందన్నారు. గత ఏడాది కాలంలో డీజిల్ ధర 40 శాతం, కూలి ఖర్చులు 35  శాతం, ఎరువుల ధరలు 30 శాతం వరకు పెరిగాయని గుర్తు చేస్తూ, అదే స్థాయిలో పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ప్రకటించడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని  "హూడా" కమిటీ సూచించినా  ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చెల్లిస్తుండటం బాధాకరమన్నారు. జనతాదళ్ (ఎస్) ప్రధాన కార్యదర్శిడానిష్ అలీ, ఆరేస్పీ నేత అబనీరాయ్, సి.పి.ఎం.ఎంపీ రామచంద్ర డొమ్, బీ.జే.డి నేత సిద్దార్ధ మహాపాత్రో, తెలుగుదేశం నేత  మైసూరా రెడ్డి లు ఈ అఖిలపక్ష పర్యటనలో పాల్గొన్నారు. రైతుల  జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు తెలుగుదేశం సహా తొమ్మిది పార్టీలు కలసికట్టుగా జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని  అజిత్ సింగ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ పెంచి పోషించిన రైతు వ్యతిరేక ధోరణి వల్ల వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యింది. దీనిపై పార్టీలకు అతీతంగా రైతులు సంఘటితంగా పోరాడితే తప్ప పాలకులు కళ్ళు తెరవరు. అది సాధించాలంటే రైతులు ఒక్కటిగా ముందుకు కదలాలి.

Friday 26 August 2011

ఆంధ్రప్రదేశ్ లోయూరియా కొరత-రోడ్డెక్కిన రైతులు

                                                           
ఎరువుల కొరతతో రాష్ట్ర రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెలలో వర్షాలు బాగా కురవడంతో నాట్లు పూర్తి స్థాయిలో పడటం వల్ల యూరియా అందుబాటులో లేక రైతుకు దిక్కుతోచడం లేదు. దేశీయంగా యూరియా గిరాకీ ౩ కోట్ల టన్నులైతే ఉత్పత్తి 210 లక్షల టన్నులు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్ లో రాష్ట్రానికి సుమారు 17 లక్షల  టన్నుల యూరియా అవసరమైతే అందులో కేవలం 13 శాతం అంటే 2 .22 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి దక్కాయి. అన్ని రకాల ఎరువులూ కలిపి 44 లక్షల టన్నుల దాకా కావాలన్న వ్యవసాయాధికారుల లెక్కలను ఎవరూ పట్టించుకోలేదు. అత్యవసర నిల్వల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కనీసం ఇవి కూడా లేకపోవడంతో రైతులకు యూరియా అస్సలు అందటంలేదు. కేంద్రం కేటాయించే అన్ని రకాల ఎరువుల్లో ౩౦ శాతాన్ని మార్క్ ఫెడ్ కు ఇచ్చి నిల్వ చేయాలన్న ఉత్తర్వులను ఈ సీజన్లో తుంగలో తొక్కారు. ఈ నేపధ్యంలో ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలకు దిగుతున్నారు. 
                                                           
  ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో రైతుకు సేద్యం గిట్టుబాటు కాక అవస్థ పడుతుంటే వాటి అందుబాటు కూడా ప్రశ్నార్ధకం కావడం దారుణం. లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరిన ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పోషకాధార రాయితీ ఎరువుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి యూరియా మినహా ఇతర ఎరువులు అన్నింటిపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసినట్లయింది. ఫలితంగా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి ఎరువుల కంపెనీల మధ్య పోటీ పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయని కేంద్రం నమ్మబలికింది. దీనికి భిన్నంగా ధరలు పెరగటంతోపాటు ఎరువులను అందుబాటులో ఉంచలేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంగా నిలిచింది. రైతుల కోసం ఇన్ని నీతులు చెబుతున్న పాలకులు ఇప్పుడేమంటారు..?

Wednesday 24 August 2011

ఆహారశుద్ధి రంగంలో భారత్ వెనుకంజ!


                                                                      
ఆహారశుద్ధి రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చితే చాలా వెనుకబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తును అంచనా వేయగలుగుతున్న మన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోతోంది. ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న మన దేశం, వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విషయంలో మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది.ఒక అంచనా ప్రకారం ప్రపంచ ఆహారశుద్ధి ఉత్పత్తులలో మన దేశ వాటా 2 శాతానికి మించ లేదు. ఒక్క పామాయిల్ నుంచే మలేసియా దాదాపు 40 రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రపంచ పామాయిల్ విస్తీర్ణంలో ప్రముఖ స్థానంలో ఉన్న మనదేశం మాత్రం ఇంకా స్వయం సమృద్ధిని సాధించలేకపోయింది. 
తాజాగా దేశంలో ఆహారశుద్ధి రంగం ఆశించిన రీతిలో వృద్ధి చెందలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యవసాయంపై పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. శుద్ధి, నిల్వ సదుపాయాలూ సక్రమంగా లేకపోవడంతో దేశంలో సాలుసరి మొత్తం ఉత్పత్తిలో 50 శాతంగా  ఉన్న దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన పండ్లు, కూరగాయలు వృధా అవుతున్నాయని కమిటీ తెలిపింది. దేశంలో రెండు దశాబ్దాల నుంచే ఆహార శుద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ, ఈ రంగంలో ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. 
                                                                              
మన రాష్ట్రంలో కిలో టమాటోలు పావలాకి పడిపోవడం, ఒక్కోసారి పాతిక రూపాయల ధర పలకడం తెలిసిందే. ఆహార శుద్ధి పరిశ్రమలు తగినంతగా ఏర్పడితే రైతులకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ రంగంలో అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగు పడతాయి. రైతులకు సైతం మంచి ధరలు దక్కుతాయి.

Sunday 21 August 2011

అప్పుల్లో రాష్ట్ర రైతు!

                                                            
ఇతర రాష్ట్రాలతో పోల్చితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. వ్యవసాయరంగానికి ఇస్తున్న పంట రుణాల్లో సంస్థాగత రుణాల వాటా తక్కువగా ఉండి., వడ్డీ వ్యాపారులు ఇచ్చే రుణాల శాతం అధికంగా ఉండటాన్ని ప్రణాళికా సంఘం ఈ సందర్భంగా ప్రస్తావించింది. రుణ మాఫీతో రైతుల అప్పులు గణనీయంగా తగ్గాయని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం. బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వకపోవడం, పుస్తక సర్దుబాట్లతో రైతులకు రుణాలు ఇస్తున్నట్టు బ్యాంకులు చెబుతున్న లెక్కలనే విశ్వసించి, రైతులకు విరివిగా పంట రుణాలు అందిస్తున్నామంటున్న రాష్ట్ర సర్కారు వాదనల్ని ప్రణాళికా సంఘం నమ్మటం లేదు. ఈ కారణాల వల్లనే ఆంధ్ర ప్రదేశ్ రైతులు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతుల కంటే అప్పుల పాలయ్యారని ప్రణాళికా సంఘం బలంగా నమ్ముతోంది. వీటికి తోడు పంటల బీమా ప్రయోజనాలు అతి తక్కువ మంది రైతులకే  అందుతుండటాన్నిప్రస్తావిస్తూ, ఎక్కువ మంది రైతులకు వర్తింప చేయడంలో ఎదురవుతున్న లోపాలను ప్రభుత్వం సరిదిద్దటంలో విఫలమైందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. 
వ్యవసాయానికి ఇస్తున్న రుణాల్లో 53 శాతం వడ్డీవ్యాపారుల నుంచే రైతులకు అందుతున్నట్టు నాబార్డ్ 
టాస్క్ ఫోర్సు ఇటీవలే తన అధ్యయనంలో తేల్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు జాతీయ స్థాయిలో 48 .5 శాతం మంది ఉంటే, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 82 శాతంగా ఉందని ప్రణాళికా సంఘం ప్రస్తావించింది. పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చినా ఇతర అవసరాలకు పంట రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా కౌలు రైతుకు అప్పులు దొరక్క అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి నష్టపోతున్నారు. పంట సాగు చేయని భూయజమానులను గుర్తించి వారికి రుణాలు నిలిపివేయాల్సిన అవసరాన్ని విధాన నిర్ణేతలు పట్టించుకోవటం లేదు. ఇదే రుణ సమస్యలకు హేతువవుతోంది.
ఇన్నాళ్ళూ పంట రుణాలు అందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా తామే రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రణాళికా సంఘం చెబుతున్న వాస్తవాలపై ఏమంటారో..! రైతుల కష్టాలన్నింటికీ రుణాలు దొరక్కపోవడమే ప్రధాన కారణమని తెలిసినా పదే పదే అవే తప్పులు చేస్తున్న విధాన నిర్ణేతలు వ్యవస్థాగతంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరముంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వానికే రైతుల బాగోగులు పట్టకపోతే బడుగు రైతుకు ఇంకెవరు దిక్కు..?

Saturday 20 August 2011

సేద్యం గిట్టుబాటు కాకే పంటవిరామం: శాస్త్రవేత్తలు

                                                                                                       
వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఇన్నాళ్ళూ రైతులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్న విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. గడచిన నాలుగేళ్ళలో సాగు వ్యయం రెట్టింపైన ఫలితంగా రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం గగనమవుతోందని వారి అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వరి పరిశోధనా సంచలనాలయం (డి.ఆర్.ఆర్), మెట్ట పంటల వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రీడా)కు చెందిన కొందరు ముఖ్య శాస్త్రవేత్తలు ఒక బృందంగా తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి రైతులతో మాట్లాడి వాస్తవాలను సేకరించారు. నీటి విడుదలలో ఆలస్యం కారణంగా వరి నాట్లు తీవ్ర జాప్యమై దిగుబడులు పడిపోతుండటం, ధాన్యం కొనుగోలు విధానాలు సక్రమంగా లేకపోవడం, ఖర్చులకు తగ్గ గిట్టుబాటు ధరలు లబించకపోవడం, గోదాముల సదుపాయం లోపించడం, తుపాన్లు వచ్చిన సందర్భాల్లో సకాలంలో రైతులకు బీమా పరిహారం అందించకపోవడం, కూలీల కొరత, ఎరువుల ధరలు భారీగా పెరగడం.... ఇత్యాది కారణాలతో రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను ప్రభుత్వం చూపించగలిగితే రైతుల పరిస్థితి మెరుగు పడుతుందని వారు చెప్పారు. ఈ కారణంగానే కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని ఈ అధ్యయనంలో తేలింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతులు దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కావున పాలకులు వాస్తవాలు గుర్తెరిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా నా మనవి.

Friday 19 August 2011

పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు అవార్డ్ అందుకున్నాను

                                                              
గురువారం సాయంత్రం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని FAAPCCI భవన్ లోని కే.ఎల్ .ఎన్. ప్రసాద్ ఆడిటోరియంలో రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా  పద్మశ్రీ  ఐ.వి.సుబ్బారావు పురస్కారాలను ప్రదానం  చేశారు. వ్యవసాయ జర్నలిజం విభాగంలో అయిదుగురు జర్నలిస్టులను ఎంపిక చేశారు. వారిలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో నన్ను ఎంపిక చేసి అవార్డును అందించారు. రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కే. రోశయ్య చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. పద్మశ్రీ డాక్టర్ ఎం.వి. రావు,  హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ భవానిప్రసాద్, మాజీ ఎం.ఎల్.ఏ, రైతు నాయకుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి బుద్ధప్రసాద్, రైతు నాయకుడు అక్కినేని భవానిప్రసాద్, రైతునేస్తం ఎడిటర్ వై.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయిస్తున్న వ్యవసాయ మద్దతు ధరలు రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రోశయ్య గారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు రైతు సమస్యల్ని గుర్తించకపోవడం దురదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రైతు నాయకుడు భవానిప్రసాద్ పార్టీలకు అతీతంగా నేతల తీరును కడిగి పారేశారు. ఈ  కార్యక్రమానికి సంబంధించిన వార్త 19 న  ఈనాడులో ప్రచురితమైంది. ఈ క్లిప్పింగ్ ఇక్కడ జత చేస్తున్నాను. 
                                                      

Thursday 18 August 2011

రైతులు బిచ్చగాళ్లా....?

                                                    
పంటవిరామం పై చర్చిద్దాం రమ్మని రైతుల్ని హైదరాబాద్ కు పిలిపించి ఎలాంటి హామీలు ఇవ్వని ప్రభుత్వ తీరును కోనసీమ అన్నదాతలు తీవ్రంగా నిరసించారు. రైతులతో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించిన తీరు సరిగా లేదని, మే లో పంట విరామం ప్రకటిస్తే సర్కారు ఇప్పుడు స్పందించి చర్చల పేరిట పిలిపించి ఎలాంటి హామీలు ఇవ్వకపోవటం బాధించిందన్నారు.  పైగా వరి పంట ఎలా పండించాలో తమకు శాస్త్రవేత్తలతో  సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నించటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యానికి తక్షణం రూ.400 ప్రకటించాలన్న రైతుల వినతిపై ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదు. మోహన్ కందా కమిటీ నివేదిక వచ్చాక అంటే నెల రోజుల తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని రైతులు ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు కళ్ళకు కడుతుంటే ఇలా కాలయాపన చేయడం పట్ల రైతాంగం ఆగ్రహించింది. పంట విరామానికి దారితీసిన పరిస్థితులు, అందులో ధాన్యం కొనుగోళ్ళు, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరూ ఇందులో పాల్గొనకపోవడంలోనే ప్రభుత్వ చిత్తశుద్ది ఏపాటిదో తెలుస్తున్నదని రైతులు ఆరోపించారు. పంట విరామం ప్రకటించిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఎదురు చూసిన రైతులకు తీవ నిరాశ తప్పలేదు. ముఖ్యమంత్రి తో చర్చల అనంతరం నాతో మాట్లాడిన పలువురు రైతు నేతలు రైతుల్ని బిచ్చగాళ్ళుగా భావిస్తున్న పాలకుల కళ్ళు తెరిపిస్తామన్నారు. ఇదిలా ఉండగా పంట విరామం రాష్ట్రంలోని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా కర్నూల్ జిల్లాలోనూ పలు మండలాల రైతులు వరి పంటకు విరామం ప్రకటించడం గమనార్హం. ఉద్యమం మరింతగా ముదరక ముందే సర్కారు కళ్ళు తెరవటం ముఖ్యం.

Wednesday 17 August 2011

కౌలు రైతుకు కముకు దెబ్బలు

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సగం గడిచినా నేటికి 50 శాతం మంది రైతులు, 90 శాతం మంది కౌలుదార్లకు పంట రుణాలు అందలేదు.రుణ అర్హత కార్డులు ఉన్నా రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు రైతుల్ని విసిగిస్తున్నాయి. సేద్యానికి ఇవ్వాల్సిన 18  శాతం రుణాల్ని కూడా ఇవ్వడంలో బ్యాంకులు విఫలమవుతుంటే అటు రిజర్వుబ్యాంకు ఇటు కేంద్రం చేతులేత్తేస్తుండటం విషాదం.  రైతులు పంట రుణాలు అందక అప్పుల సేద్యం చేస్తున్న తీరును వివరిస్తూ, బ్యాంకులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాసిన వ్యాసాన్ని 18 వ తేదీన ఈనాడు ప్రచురించింది.  ఆ క్లిప్పింగ్ ను ఇక్కడ ఇస్తున్నాను.

Saturday 13 August 2011

నేడు పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు వర్ధంతి


                                                                         
భవిష్యత్తులో మంచి వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగి పేరు తెచ్చుకుంటావని నన్ను మనస్పూర్తిగా ఆశీర్వదించిన ఆ ఆత్మీయుడు గతించి నేటికి ఏడాది. ప్రముఖ వ్యవసాయ  శాస్రవేత్తగా దేశ ప్రజలకు, రైతు సోదరులకు సుపరిచితుడైన పద్మశ్రీ ఈడ్పుగంటి వెంకట సుబ్బారావు (ఐ.వి. సుబ్బారావు) గతేడాది ఆగష్టు 14 న పరమపదించిన సంగతి తెలిసిందే. నిరాడంబరుడు, సహృదయుడు, సౌమ్యుడు అయిన శ్రీ సుబ్బారావు  గారు ఆచార్య ఎన్.జి. రంగా  వ్యవసాయ  విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆ  పదవికే వన్నె తెచ్చారు. నేను ఆయన శిష్యుడిని కాకపోయినా వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగేందుకు నాకెంతో తోడ్పడ్డారు. వారు  అభిమానించే తెలుగు జర్నలిస్టుల్లో నేనొకరిని కావడం నా అదృష్టం. వారి అభిమానం నాపై అంతగా ఉండేది మరి. వ్యవసాయ జర్నలిస్టుగా నన్ను తీర్చిదిద్దిన వారిలో శ్రీసుబ్బారావు,  శ్రీఆలపాటి సత్యనారాయణలు ముఖ్యులు.  అంతిమ ఘడియల్లో పరామర్సించేందుకు వెళ్ళినప్పుడు వారు నాతొ మాట్లాడిన జ్ఞాపకాలింకా నా స్మృతి  పథంలో పదిలంగా ఉన్నాయి.  పశ్చిమ గోదావరి జిల్లా పసలపూడిలో రైతు కుటుంబంలో జన్మించిన శ్రీసుబ్బారావు గారి కృషి వల్ల  రంగా వర్సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి లబించింది. అఖిల భారత సైన్సు కాంగ్రెస్ అధ్యక్షులుగా వారందించిన సేవలు నిరుపమానం. 
          వారి వర్ధంతిని పురస్కరించుకుని శ్రీఐ.వి. సుబ్బారావు స్మారక కమిటీ వారి సహకారంతో రైతునేస్తం వ్యవసాయ మాస పత్రిక తన 7వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ  జర్నలిస్టులు,  శాస్రవేత్తలు, ఉత్తమ రైతులకు అవార్డులు ప్రకటించింది. రైతుల  సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ఆర్టికల్స్ రాస్తూ వాటి పరిష్కారానికి నా వంతు చిరు ప్రయత్నం చేస్తున్నందుకు గుర్తింపుగా ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో నాకు అవార్డు ప్రకటించినందుకు రైతునేస్తం పత్రిక వారికి నా ధన్యవాదములు. ఇది నాకొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 18 న హైదరాబాద్  రెడ్ హిల్స్ లోని  FAAPCCI  లో అవార్డుల బహుకరణ సభ ఉంటుందని రైతునేస్తం ఎడిటర్ శ్రీ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. గురుతుల్యులు శ్రీ సుబ్బారావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  వారే లోకంలో ఉన్నా మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.

Friday 12 August 2011

"అగ్రి ఇండియా" రైతుల కన్నీళ్ళు తుడుస్తుందా..?

                                                            
 వ్యవసాయరంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం "అగ్రి ఇండియా" పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుందట..! ఇందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగాలకు కేంద్ర కేబినేట్ అనుమతి లభించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి రూపొందించే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విత్తనాలు, పనిముట్లు, పశువుల టీకాలు... వగైరా అంశాల్లో మేధో హక్కుల పరిరక్షణతో  పాటు వాటిని వాణిజ్యపరంగా అమల్లోకి తేవడం, సాంకేతికతను మార్కెటింగ్ చేయడం, రైతులకు అవగాహన కల్పించడం ఈ కంపెనీ ఉద్దేశం. 
                                                               
            రైతులకు ఏం చేయాలో ఎటువంటి చర్యలు తీసుకుంటే వారి పరిస్థితి  మెరుగు పడుతుందో డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ ఏనాడో సూచించింది. మన రాష్ట్రంలో వై.ఎస్. జమానాలో అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ సంగతిని ఆయనే మర్చిపోయిన విషయం ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తోంది. వ్యవసాయ సంస్కరణలు అమలుతో రైతుల పరిస్థితిలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు నిపుణుల సిఫార్సులు ఎన్నో అందుబాటులో ఉండగా కోట్లు ఖర్చు పెట్టి కమిటీల పేరిట ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం ప్రభుత్వానికే చెల్లింది. 2003 లో ఆమోదించిన విత్తన చట్టాన్నే ఇంకా పార్లమెంటులో చట్ట రూపంలోకి తెచ్చుకోలేకపోయాం. ఈలోగా ఆ చట్టం సైతం మరెన్నో మార్పులు సంతరించుకోవాల్సి ఉంది. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని పాలకులు, పవార్ లాంటి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి ఉన్నంత కాలం వారి బతుకులు బాగుపడతాయనుకోవడం భ్రమే.

Thursday 11 August 2011

పంట విరామంపై కందా నేతృత్వంలో కమిటీ

                                                                                                                                                          
పంట విరామం ప్రకటించి  ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేసిన రైతుల్ని ఊరడిన్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం మోహన్ కందా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. వ్యవసాయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కందా గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవజ్ఞులు. పంట విరామానికి దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను ఈ స్వతంత్ర కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ కమిటీలో ప్రముఖ వ్యవసాయ శాస్రవేత్త పద్మశ్రీ ఎం.వి. రావు, రంగా వర్సిటి డి.ఆర్.  సుధాకర రావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ కే. సుదీర్, కే. ప్రతాపరెడ్డి లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా ఉంటారు. 4 వారాల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది. కొనసీమతో పాటు పలు జిల్లాల్లో 1 .35 లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం పాటిస్తున్న సంగతి తెలిసిందే. సమస్య గురించి తెలిసినా కమిటీల పేరుతొ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటాన్ని రైతు నేతలు విమర్శిస్తున్నారు. పంట విరామం పాటించి ఈ సీజన్లో ఉపాధి కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన అవసరముంది. 

Saturday 6 August 2011

యూరియాపై నియంత్రణ ఎత్తివేత?

                                                                                   
దేశంలో పెట్రోలు ధరలు పెరిగిన వెంటనే తమ ఉత్పత్తుల ధరల్ని ఇష్టానుసారం పెంచే కంపెనీల కున్న  స్వేచ్చ రైతులకు లేదు. ఉత్పత్తి చేసే వారికే ధర నిర్ణయించే అధికారం పారిశ్రామికులకు ఉన్నట్టే రైతులకు ఆ హక్కు లేకపోవడం వల్ల అన్నదాతలు కుదేలవుతున్నారు. తాజాగా కేంద్రం యూరియా ఎరువులపై ఇన్నాళ్ళుగా ఉన్న నియంత్రణను ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రైతులపై దాదాపు 250 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇప్పటికే డి.ఎ.పి., కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలకు ఈ నిర్ణయంతో అడ్డూ అదుపూ ఉండదు. ఒక వైపు అన్ని రకాల సేద్య ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాకా రైతులు తల్లడిల్లుతుంటే కేంద్రం రైతులపై ఎప్పటికప్పుడు మోయలేని భారం మోపుతూ రైతుల పరిస్థితిని అంతకంతకూ దిగజారుస్తోంది. యూరియా ధర తక్కువగా ఉండటం వాళ్ళ రైతులు ఎక్కువగా వాడేస్తున్నారని, ధరలు పెంచుతామని కంపెనీలు కేంద్రానికి పదే పదే చేసిన వినతులకు కేంద్రం వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరలు పెంచాలని కేంద్రాన్ని రైతులు వేడుకుంటున్నా కనికరించని పాలకులు పరిశ్రమలపై మాత్రం దయ చూపించడం గమనార్హం. కంపెనీల వినతికి తోడు  యూరియాపై  ఇస్తున్న  రాయితీని తగ్గించుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయానికి తెగబడినట్టు తెలుస్తోంది.
                                                                         
ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో యూరియా ధరలు పెరగటం వల్ల రైతులకు రాయితీ పెంచాల్సిన కేంద్రం ఇలా రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదే పదే అవే తప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుండటం దేశ భవిష్యత్ రీత్యా క్షేమకరం కాదని గుర్తించాలి.

Friday 5 August 2011

భూసేకరణ-సుప్రీంకోర్టు చివాట్లు

                                                        
పరిశ్రమలు, పట్టణీకరణ, గృహసముదాయాలు తదితరాల పేరిట బడుగుల భూముల్ని హస్తగతం చేసుకునే కుట్రల్ని నిన్న అత్యున్నత నాయస్థానం కడిగి వేయటం ఒక శుభపరిణామం. సెజ్ ల పేరిట అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దురాగతాలకు ఇది చెంప పెట్టు. ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో  సెజ్ ల  కోసం అక్రమంగా నోటీసులు ఇచ్చి పేదల జీవనాధారమైన పంట భూముల్ని లాగేసుకునే ఇటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణలు చేయడంపై సుప్రీంకోర్ట్ ప్రభుత్వ చర్యను తూర్పార పట్టింది. "సామాన్యుల  సంక్షేమం పట్టని కొందరు బుర్ర లేని వ్యక్తులు భూసేకరణ చట్టాన్ని రూపొందించారని, అది మోసకారి చట్టమని, కండబలం కలిగిన వ్యక్తులే ప్రైవేటు భూముల్ని స్వాధీనం చేసుకుంటారని, దీనివల్ల భూముల ధరలకు రెక్కలోస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. పోలేపల్లి, సోంపేట, కాకరాపల్లి, సత్యవీడు .... ఇలా మన రాష్ట్రంలో పచ్చని భూముల్లో సెజ్ ల మంటలు ఎగసిపడినా పాలకులు కరుణించలేదు. 
ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పేరిట లక్షలాది హెక్టార్లలో పంట భూములు సాగుకు నోచుకోక వృధాగా ఉండటంవల్ల దేశంలో ఆహారోత్పత్తి ఆశించిన రీతిలో పెరగటం లేదు. ఆహార భద్రత అంశాన్ని పక్కన పెడితే పేదల భూములతో స్వార్ధ రాజకీయం ఎలా ఆటలు ఆడుతుందో ఆంధ్ర ప్రదేశ్ లో మనం స్వయంగా చూశాం. తమకు జీవనాధారమైన భూముల విషయంలో ప్రభుత్వాలే భూసేకరణల పేరిట మోసం చేస్తాయని ఊహించని నిరుపేదలు ఎందరో నేడు రోడ్డున పడుతున్నారు. వీటి వెనుక ఉన్న కుట్రలు తెలియక సర్వస్వం కోల్పోయిన నిర్భాగ్యులు చివరికి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండటం విషాదం. అక్రమార్కుల కుట్రల్ని వెలికి తీస్తున్న మీడియా కధనాలనే సుమోటో గా తీసుకుని కనీసం కోర్టులైనా ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుందాం.

Thursday 4 August 2011

పంట విరామంపై రైతుల "ప్రతిధ్వని"

                                                                            
రాష్ట్రంలోని తూర్పు గోదావరి సహా పలు జిల్లాల రైతులు పంట విరామం దిశగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఖరీఫ్ లో పంట విరామం పాటించాలని రైతులు  తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. రాత్రి 9 గంటలకు ఈటీవి 2 ప్రతిధ్వనిలో పంట విరామం పై మంచి చర్చ వచ్చింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోళ్ళు సాగినా ప్రతి క్వింటా పైనా రైతుకు 700 రూపాయలు నష్టపోతున్నారని చర్చలో పాల్గొన్న రైతు నేత చెంగల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళకు రైతు చేతికి ఒక ఆయుధం దొరికిందని, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని వారన్నారు. రైతుల స్థితిగతులపై  నియమించిన పలు కమిషన్లు చేసిన విలువైన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తుండటం వల్లనే ఈ  దుస్థితి దాపురించినదని వక్తలు  అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు సూచించిన వర్కింగ్ గ్రూప్ నివేదికను ప్రభుత్వం గుర్తించి అమలు  చేయాలని నిపుణులు కోరారు. 
                                                            
            ఇదిలా ఉండగా ఆహార భద్రతపై పంట విరామం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న 90 శాతం చిన్న, సన్నకారు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సాగుదార్ల ప్రాధాన్యం గుర్తించి ప్రభుత్వాలే రైతుల కాళ్ళ వద్దకు వచ్చే పరిస్థితి తీసుకొస్తామని, ఈ దిశగా దేశంలో బలమైన రైతు ఉద్యమం నిర్మిస్తామని రైతు నేతలు వక్కాణించారు. జాతీయ రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడు చెంగల్ రెడ్డి, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు, రంగా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్త్రార్ జలపతిరావు, పి.సి.సి. కిసాన్ సెల్ నేత కోదండ రెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉండి కుడా కోదండ రెడ్డి గారు రైతుల పట్ల సానుభూతితో మాట్లాడడం బాగుంది. 
             రైతులు పంట విరామం విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవించి వారిని అన్ని  విధాలా ఆదుకుంటుందని ఆశిద్దాం.

Monday 1 August 2011

మట్టి వినాయక విగ్రహాలు పెట్టి పూజించండి

                                                 
ఈ రోజు అనుకోకుండా పర్యావరణ ప్రేమికుడు విజయ్ రామ్ ను కలవడం జరిగింది. గత ఏడాది లాగా ఈసారి కూడామట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలనే ఉద్యమాన్ని ఆయన భుజాలకు ఎత్తుకున్నారు. గత ఏడాది వీరు హైదరాబాద్ సిటీలో దాదాపు 500 కు పైగా విగ్రహాలను అందించడం జరిగింది. ఈసారి వినాయక విగ్రహాలకు పంచెకట్టు కూడా కట్టి ఆకర్షణీయంగా రూపొందించారు. ఇటీవలే అక్కినేని అమల గారు కూడా ఎర్రగడ్డ అర్బన్ ఫారెస్ట్ నర్సరీలో ఉన్న వీరి విగ్రహాల తయారీ కేంద్రానికి వెళ్లి గణపతిని పూజించి రెండు విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మొదలైన ప్లాస్టర్ అఫ్ పారిస్ భారీ విగ్రహాల పిచ్చి ఇంతకు ముందు అలవాటు లేని కోస్తా, సీమల్లోని గ్రామాలకు సైతం పాకింది. ఇక్కడ హుస్సేన్ సాగర్ పాడైనట్లే రాష్ట్రంలోని లక్షలాది గ్రామాల్లో పంట కాలువలు, చెరువులు నాశనమయ్యే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున కాసేపు నుంచుంటే రోగాలు రావటం ఖాయమని డాక్టర్లు ఇప్పటికే చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజలు ఈ కాలుష్యానికి కొంత అలవాటు పడినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు మాత్రం ఈ చెరువులో బోటు షికారుకు వెళ్ళవద్దని వారు సూచిస్తున్నారు. 
                                                        ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ రామ్ తన 'సేవ్' సంస్థ ద్వారా చేస్తున్న ఈ కృషిని  అభినందిస్తూ పర్యావరణంతో సహా చెరువుల ఇతర జలవనరుల పరిరక్షణకు పాటుపడుతున్న అతనికి మనవంతుగా తోడ్పడదాం. అందుకు మనం చేయాల్సిందల్లా.. మరో నెల రోజుల్లో జరగనున్న వినాయక చవితికి మట్టి వినాయకులను తెచ్చి పూజించడమే. ఎవరికీ ఇబ్బంది కలగని, పెద్దగా ఖర్చు కూడా లేని వీటితో పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.  ఇది విజయ్ రామ్ ఒక్కడి బాధ్యత కాదు, మనందరి బాధ్యత కూడా.