Pages

Thursday 29 September 2011

ఈ దోపిడీ ఎన్నాళ్ళు!

                                                        
రేపటి నుంచి మళ్ళీ ఎరువుల ధరలు పెరుగుతున్నాయనే విషయం రైతుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తి వేశాక ఈ ఏడాది ఇప్పటికి ఎరువుల ధరలు పైకి ఎగబాకటం ఇది పదమూడోసారి. తాజాగా డి.ఏ.పి., కాంప్లెక్స్ ధరలు బస్తాకు వంద నుంచి రూ.250 దాకా పెరగటం రైతుల్ని మరింత కుంగదీసింది. తాజా పెంపుతో రైతులపై సుమారు రూ. 500 కోట్ల భారం పడుతోంది. కేవలం వారం రోజుల్లోనే కంపెనీలు ఇలా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం నోరు మెదపకపోవడం పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ధరల పెంపుదలకు రూపాయి విలువ పెరగటమే కారణమని కంపెనీలు చెప్తున్నాయి. ఖరీఫ్ లో రైతులు గొడవ చేసినా పట్టించుకోని పాలకులు నేడు తీరికగా రబీ ప్రారంభమయ్యే నాటికి పోటాష్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి ఆనాడే దిగుమతి చేసుకుని ఉంటే నేడు ధరలు అదుపులో ఉండేవి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు అధిక ధరల భారం మోయాల్సి వస్తోంది.                                                  
                                                  
ఏది ఏమైనా చితికిన రైతుల్ని ఇంకా ఇంకా నష్ట పరిచే విధానాల వల్ల సేద్యం మరింత దిగజారుతుందని పాలకులు గ్రహించాలి. పండించిన పంటకు ధరల్ని నిర్ణయించుకునే స్వేచ్చ రైతుకు లేకుండా జాగ్రత్త పడుతున్న పాలకులు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి.. ఈ దేశంలో రైతులు ఆగ్రహిస్తే మీకు మింగ మెతుకుండదని గ్రహించి మెలగండి. వ్యవసాయ ప్రధాన దేశంలో మునుముందు రైతులు తిరగబడే పరిస్థితి తెచ్చు కోవద్దనేది పాలకులకు మరోసారి హితవు. నా పిచ్చి గాని ఈ చెవిటి పాలకులు తమ తప్పుల్ని గుర్తిస్తారంటారా....?  ప్చ్...! 

Wednesday 28 September 2011

రైతు నేత నాగేంద్రనాథ్ నిరాహారదీక్ష

          శరద్ పవార్ కి వినతి పత్రం ఇస్తున్న శ్రీ యెర్నేని                             
రైతు సంక్షేమానికి నిరంతర పోరాటం చేస్తూ రైతాంగ సమాఖ్య అధ్యక్షులుగా ఉన్న యెర్నేని నాగేంద్రనాథ్ 100  గంటల నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఎన్నో రైతు సేవా కార్యక్రమాలతో రైతు సమస్యలు తెలుసుకుని రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్న కృషీవలుడు, నిరాడంబరుడు యెర్నేని కొంత కాలంగా పంట విరామంపై ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. పంట విరామం ప్రకటించిన రైతులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ ఖర్చులకు అదనంగా 50  శాతం చేర్చి మద్దతు ధర నిర్ణయించాలని, 60 ఏళ్ళు నిండిన రైతులకు రెండు వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, ఎగుమతి, దిగుమతి విధానాల విషయంలో రైతుకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని.... ఇలా రైతు శ్రేయం కోరే పలు డిమాండ్లతో నాగేంద్రనాథ్ దీక్షకు దిగుతున్నారు. 
ధరల విషయంలో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే విధానంలో రైతుకు స్వాతంత్ర్యం లేనందున మరో రైతు స్వాతంత్ర్య పోరాటానికి నాందిగా ఈ దీక్ష చేస్తున్నానని యెర్నేని గారు బుధవారం అమలాపురం వెళ్లబోయే ముందు  ఈనాడు ఆఫీసులో నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. తన పోరాటానికి మీడియా మద్దతు కోరారు. యెర్నేని గారు అక్టోబర్ 2  గాంధి జయంతి రోజు అమలాపురంలో దీక్ష ప్రారంబించి 100  గంటల పాటు కొనసాగిస్తానని అక్టోబర్ 6 వ తేదీన దీక్ష ముగుస్తుందని తెలిపారు. ఆరుగాలం కృషికి తగిన ప్రతిఫలం కోరుతూ రైతులు దీక్షలకు దిగాల్సిన పరిస్థితి రావడం శోచనీయం. రైతులు సంఘటితమైతే ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించకపోవడం సిగ్గుచేటు. కళ్ళున్నా రైతుల కష్టాలు చూడలేని పాలకులు, నేతలు ఉన్న ఈ పరిస్థితుల్లో యెర్నేని తన ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాను. రైతుల దయనీయ పరిస్థితిని గమనించి వారికి మేలుచేసే సంస్కరణలు తీసుకురావాలని మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. యెర్నేని గారు  అల్ ది బెస్ట్.

Thursday 22 September 2011

ఎరువుల ధరలు ఎన్ని సార్లు పెంచుతారు?

                                                            
కష్టాల్లో ఉన్న రైతుల్ని గట్టెక్కించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కందా కమిటీ వేసింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్లనే రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదని ఇలాంటి కమిటీలెన్నో చెప్పాయి. పంటలు సాగు చేసిన రైతుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడ్డారు. రైతుకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచడంలో సర్కారు చేతులెత్తేసింది. మరోవైపు కంపెనీలు ఎరువుల ధరల్ని పెంచేసి రైతుకు పెద్ద షాక్ ఇచ్చాయి. తాను పండించిన పంటను ఎంత ధరకు విక్రయించుకోవాలో స్వేచ్చలేని రైతులు విత్తనాల నుంచి ఎరువుల వరకు ఇష్టానుసారం ధరలు పెంచుతున్న కంపెనీల తీరుతో నేడు తల్లడిల్లిపోతున్నాడు. కాంప్లెక్స్ బస్తాపై రూ.188 , పోటాష్ పై రూ. 192 వరకు గరిష్టంగా పెంచారు. ఫలితంగా రైతులపై సుమారు రూ. 350  కోట్ల మేర అదనపు భారం పడనుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ  ఏడాది ఎరువుల ధరలు ఇప్పటికే ఐదు సార్లు పెరగటం గమనార్హం. సేద్యం గిట్టుబాటు కాక రైతులు నష్టపోతుంటే ఇష్టానుసారం కంపెనీలు పెంచుతున్న ధరలను ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోతుండటం శోచనీయం. రాష్ట్ర సర్కారు పెంచిన వ్యాట్ తో ఇప్పటికే ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు  ఈ పరిణామం మరింత నిరాశ కలిగించింది. కష్టాల కడగండ్లతో ఖరీఫ్ ను ఆరంభించిన అన్నదాతలకు తాజాగా పెరిగిన ధరలతో రబీ సీజన్ పెను భారం కానుండటం విషాదం.

Wednesday 21 September 2011

కాలయాపనకే రైతు కమిటీలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి కమిటీలు వేసి చేతులు దులిపేసుకుంటున్నాయి.  స్వామినాథన్ కమిటీ సిఫార్సులనే నేటికీ అమలు చేయని కేంద్రం, జయతిఘోష్ సహా పలు కమిటీల సూచనలను పట్టించుకోకుండా మన పాలకులు ఆడుతున్న దొంగాటకాన్ని ఈ రోజు ఈనాడు  ఎడిటోరియల్  పేజిలో ప్రచురితమైన నా వ్యాసం లో ఎండగట్టటం జరిగింది. స్కాన్ చేసిన ఆర్టికల్ ఇక్కడ లింక్ చేస్తున్నాను. చూడగలరు.


                                                                              

Tuesday 13 September 2011

కందా కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందా...?

                                                

                             
 పంటల సాగుకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగి పోతుండటం వల్లనే రైతులు నష్టాల పాలవుతున్నారని, అటువంటి రైతుల్ని ఆదుకోవాలని మోహన్ కందా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ తన నివేదికను నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. అధికారికంగా ప్రభుత్వం ఈ నివేదికను వెల్లడించకపోయినా కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతులు చేస్తున్న కొన్ని డిమాండ్లను తమ నివేదికలో ప్రస్తావించారు. ముఖ్యంగా మే 15 వ తేదీ నాటికి కాలువలకు నీరు వదలాలని., జూన్ లోనే నాట్లు వేయడం ద్వారా రైతుకు నష్టాలు తగ్గించవచ్చని సూచించారు. అలానే ప్రస్తుతమున్న 75 శాతం లెవీని 50 శాతానికి తగ్గించాలని కూడా కమిటీ  సూచించింది. కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరల విషయంలో రైతుల వాస్తవ ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని కమిటీ భావించింది. మద్దతు ధరకు తక్కువగా ఉండటం వల్లనే రైతులు ఏటా నష్టాలను భరించాల్సి వస్తోందని కమిటీ అభిప్రాయపడింది. గత ఏడాది నుంచి ఇబ్బంది పెడుతున్న గోదాముల సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరింది. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడే మంచి ధరలు అందేలా చూడాలని, దీనికి తగ్గట్టుగానే ఎగుమతులపై నిర్ణయం తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సేద్యంలో ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, అందుకు తగ్గట్టు సాగు విధానాలను నిర్వచించుకోవడం, మార్కెటింగ్ ను పటిష్టపరచడం ద్వారా రైతుకు లాభసాటి సేద్యంపై ఆసక్తి పెరిగేలా చూడాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.
                                                              
అయితే పంట విరామం పాటించిన రైతులకు ఆర్ధిక సహాయం ఇవ్వటానికి కమిటీ నిరాకరించినట్టు తెలుస్తోంది. పంట విరామం విషయంలో రైతులు తాము పడుతున్న సమస్యలను, ప్రభుత్వం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని కూడా ఇప్పటికే పాలకులకు వివరించారు. కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్న విషయంపై పెద్ద ఎత్తున విమర్శలూ చెలరేగాయి. జయతీఘోష్ సహా ప్రభుత్వం పలు కమిటీలు వేసినా రైతులకు ఏం ఒరిగింది పాపం..? ఈ సూచనలన్నీ పాలకులకు తెలియనివా..?  ఈ కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశించడం గతానుభవాలను పరిశీలిస్తే సందేహమే.

Friday 9 September 2011

అమెరికాలో తెలుగు అంతర్జాల సదస్సు

                                                         
తెలుగును అంతర్జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు ఈ నెల 28 నుంచి ౩౦వ తేది వరకు కాలిఫోర్నియా (అమెరికా)లోని మిల్పీటాస్ లో తెలుగు అంతర్జాల సదస్సును నిర్వహించనున్నారు. గురువారం హైదరాబాద్ లో సిలికానాంద్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఉమామహేశ్వర రావు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి భూమయ్య, ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, ఐ.టి. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఐ.టి. శాఖ, సిలికానాంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనికోడ్ ప్రతినిధులతో పాటు అమెరికా, జపాన్, మలేసియా,బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలకు చెందిన ప్రతినిధులు, పూణే, కోల్ కతా, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు నగరాల నుంచి  200 మంది సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. ఇంటర్ నెట్ తెలుగులో తీసుకురావాల్సిన మార్పులపై ఈ ప్రతినిధులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఒక కార్యాచరణను రూపొందించనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.మొత్తంమీద అక్టోబర్ 17 న జరిగే యూనికోడ్ సమావేశంలో తెలుగు యూనికోడ్ కు తుది రూపం ఇవ్వనుండటం విశేషం.

Thursday 1 September 2011

నెటిజిన్లకు శుభవార్త-యూనికోడ్ లో తెలుగుభాషకు సభ్యత్వం

  
                                                                             
ఇప్పటి వరకు నెట్లో తెలుగు కీబోర్డ్ కోసం నానా తంటాలు పడుతున్న వారికి ఒక శుభవార్త. యూనికోడ్ లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న భాషగా తెలుగు సంచలనం సృష్టించింది. ఇకపై తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ సైతం అందుబాటులోకి రానుంది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్ల తెలుగు భాషకు ఈ గౌరవం దక్కింది.అలానే యూనికోడ్ లో శాశ్వత సభ్యత్వం పొందిన తొలి ప్రభుత్వంగా రాష్ట్ర సర్కారు నిలిచింది.పూర్తిస్థాయి సభ్యత్వం రావడంతో అడోబ్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్,యాహూ, తదితర పారిశ్రామిక ఐ.టి. దిగ్గజాల సరసన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేరు నిలిచింది. దీనివల్ల ఇంటర్నెట్ తెలుగు లిపిలో ఉన్న పొరపాట్లను సరిదిద్ది మంచి ప్రమాణాలకు అనుగుణంగా కొత్తగా 6  ఇంటర్నెట్ అక్షర లిపిలను రూపొందిస్తారు.ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ఐ.టి.శాఖ రూ.61 లక్షలు ఖర్చు చేయనుంది. శాశ్వత సభ్యత్వం కోసం ఏటా 15 వేల డాలర్లు చెల్లించనున్నారని వార్త. కొత్తగా ఇంటర్నెట్ లో రూపొందించనున్న ఫాంట్లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలానే తెలుగులో వెబ్ సైట్లు వెతకడానికి ఓ ప్రత్యేక బౌజర్ ను కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది.తెలుగు కీబోర్డ్ లో స్పెల్ చెక్ కూడా పెట్టనున్నారు.మొత్తానికి ఇంటర్నెట్ లోతెలుగు వినియోగంలో మంచి రోజులు రానుండటం నిజంగా మనకు శుభవార్తే.