Pages

Tuesday 18 September 2012

గణనాధా నమోస్తుతే!

                                                           
తొలి పూజలందుకునే శ్రీ మహా గణపతి ఓంకార స్వరూపుడు.  మన విజ్ఞానమే  వినాయకుడు, మన  బుద్దే వినాయకుడు., మన తెలివితేటలే వినాయకుడు.... వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకోగలిగిననాడు మన అభీష్టాలు సిద్దిస్తాయంటారు మహర్షులు.  ఇంకేం... ఈర్ష్యా ద్వేషాలను విడనాడి స్వశక్తిని నమ్ముకుంటే అందరికీ కార్యసిద్ధి లభిస్తుంది. వినాయక చవితి సందర్భంగా బ్లాగు మిత్రులకు, facebook మిత్రులకు శుభాకాంక్షలు.  

Monday 10 September 2012

హైబ్రిడ్ పరిశోధనలలో లోపించిన పురోగతి!

                                                             
మన దేశంలో హైబ్రిడ్ వరి వంగడాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను సోమవారం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వరి సదస్సు నొక్కి చెప్పింది. దశాబ్దాలు గడుస్తున్నా మన పరిశోధనలు ముందుకు సాగటం లేదు. ఆహార భద్రత అంటూ గొంతు చించుకుంటున్న కేంద్ర సర్కారు... ఆ దిశగా పరిశోధనలకు పెద్ద పీట వేయడంలో ఘోరంగా విఫలమైంది. మన రాష్ట్రం విషయానికి వస్తే., రెండు దశాభ్దాల క్రితం రూపొందించిన చైతన్య, కృష్ణవేణి, ఐ.ఆర్ రకాలనే రైతులు నేటికీ వాడుతున్నారు. దిగుబడులు పెరగకపోవడం వల్ల రైతుకు నికరాదాయం తగ్గి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పరిశోధనలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ దుస్థితి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా ఈ దిశగా దూసుకుపోతుంటే., మనం ఎక్కడో ఉన్నాం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తోంటే., మన రైతులు సేద్యంలో నిలదొక్కుకునే పరిస్థితులు కూడా కల్పించలేకపోతున్నాం. "శ్రీ" వరి సాగు విధానంతో హెక్టారుకు 224 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డ్ సాధించిన రైతులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రభుత్వాలు కనీసం ఇటువంటి విదానాలనైనా ప్రోత్సహిస్తే అన్నదాతకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు ఉంటేనే వ్యవసాయం  మనుగడ సాగిస్తుంది.