Pages

Friday 18 May 2012

మేలుకొలుపు పాడాల్సిందేవరికి?

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిన పరిస్థితుల్లో కిరణ్ సర్కారు రైతు చైతన్య యాత్రలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో పంటల సాగు విధానాల పట్ల రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు  ఈ యాత్రలని అంటున్న సర్కారు సీజన్ ముంగిట రైతులపై మోయలేని భారం పడుతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోతోంది. పంటల సాగుకు  ఏం చేయాలో రైతుకు తెలిసిన పరిస్థితుల్లో వారికి కావలసింది ఆర్ధిక తోడ్పాటు మాత్రమె. వరుస నష్టాలతో ఇప్పటికే చితికిన రైతు బతుకులకు ఓదార్పు లభించాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు రైతుకు కల్పించాలి. దీనికి బిన్నంగా ఎరువులతో సహా అన్ని ఉత్పాదకాల ఖర్చులు లు పెరుగుతుంటే., ఉత్పత్తుల ధరలు పదే పదే పతనమై రైతుల్ని కలవరపెడుతున్నాయి. వీటిని సరిదిద్దాల్సిన పాలకుల్లో చైతన్యం లోపించినదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేసాను. 
                                                               

Thursday 17 May 2012

రైతుకు శాపంగా మారిన రూపాయి క్షీణత!

                                                                  
డాలరుతో బక్క చిక్కిన రూపాయి రైతుకు మరింత భారాన్ని పెంచింది. రాయితీ భారాన్ని మోసేందుకు కేంద్రం 
నిరాకరించడాన్ని సాకుగా చూపి  ఎరువుల కంపెనీలు ధరల్ని ఇష్టానుసారం పెంచేశాయి. గత నెలలో ఐపీఎల్ కంపెనీ పోటాష్ ధరల్నిభారీగా పెంచితే., నేడు కోరమాండల్ కంపెనీ పోటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచుతున్నట్టు వ్యవసాయశాఖకు తెలిపింది. మరి కొద్ది రోజుల్లో సీజన్ కు సన్నద్దమవుతున్న రైతుకు ఇది నిజంగా పిడుగుపాటే.  తాజాగా పెరిగిన ధరలతో రైతులపై రూ. 436 కోట్ల దాకా అదనపు భారం పడుతుంది. గత ఏడాది కాలంలో 17 సార్లు ఎరువుల ధరలు పెంచిన కంపెనీలను ప్రభుత్వం నియంత్రించ లేకపోవడంతో రైతుకు పెట్టుబడులు మరింత భారంగా పరిణమించాయి. ఇప్పటికే వరుస నష్టాలతో సేద్యాన్ని అప్పులమయం చేసుకున్న రైతుల పరిస్థితిని మరింత దిగజార్చేలా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఎరువుల ధరలపై నియంత్రణలను ఎత్తివేసాక  కంపెనీలు ఎడాపెడా ధరలు పెంచుతున్నా  కేంద్రం చోద్యం చూస్తోందే తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. రైతు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే కొద్దీ వ్యవసాయం దిగజారి., అంతిమంగా ఆర్ధిక వ్యవస్థనే దెబ్బ తీస్తుందని తెలిసిన "ప్రపంచ ప్రముఖ ఆర్ధికవేత్త" మన్మోహన్ ఎన్నేళ్ళు ఇలా మౌనవ్రతం పాటిస్తారో కానీ అన్నదాతల్లో సహనం నశిస్తోంది.

Tuesday 15 May 2012

మే 15న రైతు విత్తన హక్కుల దినోత్సవం

                                                                
ఏటా మే 15 వ తేదీని రైతుల హక్కుల దినోత్సవం గా పాటించాలని రైతు విత్తన హక్కుల పరిరక్షణ వేదిక, రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్తంగా పిలుపునిచ్చాయి. రైతులు, రైతు సంఘాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వం దీన్ని పాటించాలని అవి కోరాయి. రైతులు పూర్తిగా హక్కులు కోల్పోతున్న నేపధ్యంలో సేద్యంలో రైతులు తీసుకునే అన్ని నిర్నయాలకూ మూలమైన విత్తన హక్కులు కీలకమని భావించి రైతు విత్తన హక్కుల వేదికను  yఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు, డాక్టర్ కే.ఆర్. చౌదరి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల సేద్య హక్కుల పరిరక్షణ., ముఖ్యంగా పంట, విత్తన రకాల ఎంపిక., కలిసి వచ్చే సంస్థలు, వర్గాలు, నిపుణుల మధ్య సమన్వయంతో హక్కుల పరిరక్షణకు కృషి చేయడం., ఇందుకు అవసరమైన ప్రచురణలు, చర్చలు నిర్వహించడం.,  లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం., రైతులు, సమాజం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని వారంటున్నారు. వీరి కృషి ఫలించాలని కోరుకుందాం. గురువారం ఈనాడులో నన్ను కలిసిన ప్రసాదరావు గారికి  పూర్తి స్థాయిలో నా సహకారం అందిస్తానని  హామీ ఇచ్చాను. మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.

Friday 4 May 2012

పాడి పరిశ్రమకు కేంద్రం చేయూత!

                                                                 
భారత్ వ్యాప్తంగా పాడి పశువులకు బీమా పధకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2006లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పధకం నేడు దేశంలో 300 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి పది లక్షల పశువులకు  బీమా సదుపాయం కల్పించనున్నారు. బీమా ప్రీమియంలో సగం రైతులు భరించాల్సి ఉండగా., మిగిలింది ప్రభుత్వం భరిస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల  అభివృద్దికి సంబంధించి ఏర్పాటైన పార్లమెంటరి స్థాయి సంఘం అధ్యయనం చేసిన నివేదిక నిన్న పార్లమెంటు ఉభయ సభలకు అందింది. నివేదికలోని అంశాల ప్రకారం దేశంలో పాడి పురోగతికి కేంద్రం ఇతోధికంగా సాయపడనుంది. దేశంలో పాల ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి, నాణ్యమైన పశువుల పెంపకానికి కేంద్రం రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు అందించనుంది. అలానే పశువులకు కావలసిన వైద్య సదుపాయాలను మెరుగుపరచేందుకు గ్రామాల్లో వైద్యశాలలను ఏర్పాటుచేయనున్నారు. తరచుగా వైపరీత్యాల బారిన పడుతున్న రైతులకు  పాడి నిజంగా కలిసివచ్చేదే. ఈ పధకాల గురించి రైతుల్లో మంచి అవగాహన కల్పిస్తే అన్నదాతలు వీటి ప్రయోజనాలు పొందగలుగుతారని కేంద్రం గుర్తించాలి.

Tuesday 1 May 2012

రైతుకు చెక్కుల ద్వారా చెల్లింపులు సాధ్యమా..?

                                                                                            
దేశంలో జరుగుతున్న బియ్యం సేకరణలు, ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను ఆధునికీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.  దీనిలో భాగంగా కొనుగోళ్ళ వివరాలను అత్యంత పారదర్శకంగా అన్ లైన్ లో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో జరిపే చెల్లింపులు అక్కౌంట్ పేయి చెక్కుల ద్వారా జరపాలని, రైతుల నుంచి జరిపే కొనుగోళ్ళ వివరాలను కంప్యుటరీకరించి ఆన్ లైన్ లో  అందుబాటులో ఉంచాలని కూడా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. వీటికి తోడూ ఇదే పద్దతిని మిల్లర్లు జరిపే లావాదేవీలకు కూడా  వర్తింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కోస్తా, రాయల సీమల్లో బ్రోకర్ల ద్వారా జరిపే క్రయ విక్రయాల విషయంలో ఈ చెక్కుల పెమెంట్లు జరపడం 
 సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పద్దతిద్వారా కేవలం చెక్కుల తో చెల్లింపులే కాకుండా రైతుల నుంచి మిల్లర్లు యెంత ధాన్యం కొన్నారు..? ఏ వెరైటీని ఏ ధరకు కొన్నారు వంటి వివరాలు ఆన్ లైన్ లో ఉంచాలనేది కేంద్ర ప్రణాళికలో భాగం. ఒక రకంగా రైతుకు మద్దతు ధరను అందించాలనే కేంద్ర ప్రయత్నంలో ఇదొక భాగంగా చెప్పవచ్చు. 
దీనివల్ల....
ధాన్యం సేకరణ తేలిక అవుతుంది. మెరుగైన మిల్లింగ్ మేనేజ్ మెంట్ సాధ్యపడుతుంది. అలానే కష్టం మిల్లింగ్ కోసం మిల్లుల నమోదు, మిల్లుల వారి జరుగుతున్నా ధాన్యం పంపిణీ సమాచారం క్షణాల్లో పొందటం ద్వారా సమయం ఆదా అవుతుంది. 
అయితే...,
ధాన్యం సేకరణ, ఎఫ్ సి ఐ డెలివరి, గోదాముల్లో నిల్వ, రవాణా, చలామణి వంటి నిత్యం ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరించటంలో   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు విఫలమవుతున్న తరుణంలో ఈ కొత్త విధానాల అమలు పెద్ద సవాలు కానుంది. రైతుకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఈ తరహ సమస్యలని పరిస్కరిస్తే కొత్త విధానం ద్వారా మంచి ఫలితాలు పొందే వీలుంటుంది.