Pages

Saturday 29 April 2017

జలరంగ మేధావి విద్యాసాగరరావు

                                                                               


                                                                        
నీటిపారుదల రంగంలో ఎందరో ఇంజనీర్లు పనిచేశారు., పదవీ విరమణ చేశారు. కొద్ది మంది మాత్రం ఆ రంగంపై ఎనలేని ముద్ర వేశారు. ఇప్పటికే నీటిపారుదలరంగ దిగ్గజం టి. హనుమంతరావు గారి మరణంతో కోలుకోలేని స్థితిలో ఉన్న తెలుగు రాష్ట్రాలు విద్యాసాగరరావు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయి. సాగరన్న మరణంతో తెలుగు రాష్ట్రాలే కాదు యావత్‌ దేశం ఒక గొప్ప ఇంజనీరింగ్‌ మేధావిని కోల్పోయింది. ఈనాడు లో పనిచేస్తున్న కాలం నుంచి నేటి నా ఈటీవీ ప్రస్థానం వరకు ఈ మేధావులతో ఏర్పడ్డ పరిచయం నాకు నీటిపారుదల రంగంపై ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసింది. ముఖ్యంగా హనుమంతరావు, విద్యాసాగరరావు, చెరుకూరి వీరయ్యలతో ఏర్పడిన అనుబంధం ఆ రంగంపై నాకు ఎంతో పట్టు వచ్చేలా చేసింది.
2009 ఎన్నికలప్పుడు వైవెస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో సాగిస్తున్న ధనయజ్ఞాన్ని విద్యాసాగరరావు గారు నాకు ఒక రెండు గంటల పాటు చెప్పుకుంటూ పోయారు. అవన్నీ వాయిస్‌ రికార్డు చేసి వాటిని టైప్‌ చేస్తే అదొక పెద్ద పుస్తకం అయింది. ఇప్పటికీ అది నా వద్ద భద్రంగా ఉంది. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి లోటుపాట్లను సరిచేయడం ద్వారా నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి మలికిలేని వ్యవస్థ కోసం ఆయన తపించిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. అప్పటి నుంచి వారితో ఏర్పడ్డ సాన్నిహిత్యం ప్రతిధ్వని చర్చలకు వారిని ఆహ్వానిస్తూ ఇటీవలి వరకూ కొనసాగింది.

సాగరన్నా నువ్వు లేని తెలంగాణ చిన్నబోయింది. తెలంగాణ ఉద్యమానికి నువ్వు అందించిన చేయూత ఈ జాతి ఎప్పటికీ మర్చిపోదు. నీటిపారుదల రంగానికి నువ్వందించిన సేవల్ని తెలుగు జాతితో సహా ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.భౌతికంగా మమ్మల్ని వదిలి మీరు వెళ్లిపోయినా మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను.