Pages

Wednesday 30 November 2011

రైతు ఖర్చుకు తగ్గ ధరల్లేవు- సి.ఏ.సి.పి

                                                           
రైతులకు అవుతున్న వాస్తవ సాగు ఖర్చులకు ప్రభుత్వం ప్రకటిస్తున్న ధరలకు ఏంటో వ్యత్యాసం ఉందని వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం (సి.ఏ.సి.పి) కేంద్రానికి చురకలు వేసింది. కేంద్ర విధానాల వల్ల వరి రైతులు తమకు న్యాయంగా రావాల్సిన మొత్తాన్ని కూడా దక్కించుకోలేక పోతున్నారని సి.ఏ.సి.పి అభిప్రాయపడింది. ముఖ్యంగా వరి రైతులు   16  నుంచి 25  శాతం ఆదాయం కోల్పోతున్నారని నివేదికలో పేర్కొంది. రైతులు పెడుతున్న ఖర్చులు, వారికి దక్కుతున్న ధరలపై లోతుగా అధ్యయనం చేసిన సి.ఏ.సి.పి, ఈ మేరకు ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేసింది.  పలు పంటలకు ధరలను నిర్ణయించేటప్పుడు దేశంలో ఆయా ఉత్పత్తుల గిరాకి, సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కూడా కమిషన్ సూచించింది. ఇకపై బియ్యం లెవీ 25 శాతానికి మించకుండా చూడాలని సి.ఏ.సి.పి ప్రభుత్వాన్ని కోరింది. గత ఏడాది  రైతులు సాగు చేసిన వరి వంటి కొన్ని పంటల్లో వారికి లాభసాటి ధరలు దక్కలేదని తేల్చింది. నిల్వ పద్ధతులు సక్రమంగా లేకపోవడం వల్ల ఏట పదిస్తున్న ఆహార ధాన్యాలను భారీగా నష్టపోతున్నామని, ఇందుకు ఆహార ధాన్యాలను అధికంగా నిల్వ చేయవద్దని, అదనపు నిల్వలను స్వేచ్చా మార్కెట్లో విక్రయించాలని కోరింది. ఆహారధాన్యాలను టోకుగా విక్రయించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని సూచించింది. ప్రైవేటు రిటైల్ చైన్లను ప్రోత్సహించాలని మండీ వ్యవస్థను సంస్కరించాలని కూడా సూచించింది. మొత్తంగా కేంద్ర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు రైతుల వాస్తవ సాగు వ్యయాలను మదింపు చేసి వారికి లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు పాటించాలని సి.ఏ.సి.పి కేంద్రాన్ని   కోరింది. కళ్ళుండీ రైతు కష్టాలను చూడలేకపోతున్న పాలకులకు ఇవి కనువిప్పు కావాలి.

Monday 28 November 2011

కరవుపై కార్యాచరణ ఏదీ?

                                                                        
వ్యవసాయంతో బతుకు ఆట ఆడేదీ ఓడేదీ రైతే! రాష్ట్ర రైతాంగానికి ఖరీఫ్ కలసిరాని కడగండ్ల సేద్యమే అయ్యింది. మరికొన్ని కరవు మండలాలను గుర్తించి మొత్తం సంఖ్యను 772 కు పెంచేసిన ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటిదాకా ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో మొదలు పెట్టి ధాన్యం కొనుగోలు, మద్దతు ధర చెల్లింపు .. ఇలా అన్నింటా ప్రభుత్వ ప్రణాళికా రాహిత్యం రైతు బతుకును కన్నీటిమయం చేస్తోంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే, కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక సహకార సంఘాలు, కొనుగోలు సంస్థలు  పెద్ద ఎత్తున రంగంలోకి దిగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు నమ్మబలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పూర్తి విరుద్దమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కరవు రైతుల్ని ఆదుకుని రబీ పంటలు వేసుకునేలా వారికి తోడ్పడాల్సిన పాలకులు కరవు మండలాలు ప్రకటించి నెల గడుస్తున్నా తగిన కార్యాచరణను ప్రకటించక పోవడాన్ని ఏమనాలి?   రాష్ట్రంలో రైతుల్ని పట్టించుకునేవారు లేరు., అసలు వ్యవసాయానికి ఒక మంత్రే లేడు., ఇంతకీ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా....?

Sunday 27 November 2011

ఆహార భద్రత బిల్లు - రాజకీయ పాచిక!

                                                        
రానున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహ తంత్రంగా ఆహార భద్రతను కేంద్రం అడ్డం పెట్టుకోవడం లేదు కదా అన్న అనుమానం కలుగుతోంది. 2009 ఎన్నికల్లో యుపీఏను  ఉపాధిహామీ ఆడుకున్నట్టుగానే, 2014లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆహార భద్రత కాపాడుతుందన్న వాదన వినిపిస్తోంది.  అసలు అంతకంటే ముందు అంటే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రతా బిల్లుపై యూపీ సర్కారు ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తోంది. కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ సారధ్యంలోని మంత్రుల సంఘం ఒప్పుకున్న ఆహార  భద్రతాబిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, తర్వాత స్థాయీసంఘం పరిశీలనతో చట్టంగా మారడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఇదంతా వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని కావాలని చేస్తున్న జాప్యమేనన్న సందేహం కలుగుతోంది.                                                             
ఒకవేళ బాలారిష్టాలన్నీ దాటి ఇది ప్రజల ముందుకు వచ్చినా దీన్ని సక్రమంగా అమలు చేయడం అనుమానమే. ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతపైనే ఆసలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎటొచ్చీ ఆహార భద్రత చివరికి ప్రజలను పరిహసించే రాజకీయ క్రీడగానే మిగిలిపోతుందేమోనన్న భయం కలుగుతోంది.

Thursday 17 November 2011

అధోగతిలో అన్నదాత

          
వేరుసెనగ నాశనమైంది, పత్తి ముంచేసింది. వరి లక్షల ఎకరాల్లో ఎండిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు అపార నష్టాన్ని చవి చూశారు. వరుసగా మూడేళ్ళు ఖరీఫ్ పంటలు నాశనమై రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారు. అప్పులు తీర్చుకునే మార్గం లేక కొందరు పేద రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతుల దయనీయ స్థితిని ప్రభుత్వం లేశమాత్రం కుడా పట్టించుకోవడం లేదు. వారి దయనీయ స్థితికి కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో సూచిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. స్కాన్ చేసిన కాపీని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. 
                                                                             
   

Saturday 5 November 2011

రైతులంటే ఎందుకంత కసి!

                                                     
ఎరువుల ధరలు మళ్ళీ పెంచారు. రైతు చితికి చితికి పోతున్నా పాలకులకు సిగ్గు రావటంలేదు. ధరలపై నియంత్రణ ఎత్తి వేసిన నాటి నుంచి ఎరువుల ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచేస్తున్నాయి. దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాచుర్యం పెరిగితే, ఆ మేరకు రైతుల్లో అవగాహన పెరిగితే  ఈ కంపెనీలు సగం మూతపడటం ఖాయం. ఈ ఏడాది ఇప్పటికే 13 సార్లు  ఎరువుల ధరల్ని పెంచేసిన కంపెనీలు ఈ నెలలో రెండోసారి ధరలను పెంచేందుకు సాహసించడం కేంద్ర పాలకుల పుణ్యమే. పెట్రో ధరల్లా ఇష్టానుసారం ఎరువుల రేట్లను పెంచేస్తున్న కంపెనీలు, ఇప్పటికే అప్పుల పాలైన రైతుల బాగోగులు పట్టించుకోని కేంద్రం ఇందుకు తగిన మూల్యాన్నే చెల్లించుకుంటాయి. రైతులు ఎక్కువగా వాడే డై అమ్మోనియం ఫాస్పేట్ (డి,ఏ.పి) ధరను గడచినా ఆరు నెలల్లో బస్తాకు రూ.300 కు పైగా పెంచారు. తాజాగా బస్తా ధర వెయ్యికి చేరింది. ధరలు ఎక్కువ కావడంతో డి.ఏ.పి కొనుగోళ్ళు తగ్గడంతో కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరల్ని పెంచుతున్నాయి. 
                                                         తాజాగా ఫాక్ట్ కంపెని 20 :20 :0:13 ఎరువు 50 కిలోల బస్తా ధరను రూ.674 .93 నుంచి ఏకంగా వంద రూపాయలు పెంచింది. అలానే జింక్ కలిసి ఉండే బస్తా ధరను కూడా బస్తాకు రూ. 95 వరకు పెంచేశారు. ఒక పద్దతంటూ లేకుండా ఇష్టానుసారం ధరల్ని పెంచుతున్న కంపెనీలు, పాలకులు తమ పొరపాట్లను గుర్తించకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావడం తప్పనిసరి.

Thursday 3 November 2011

ఎండుతున్న రైతు గుండె

                                                                      
రాష్ట్ర రైతు కరవు కోరల్లో చిక్కుకున్నాడు. 40 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు ఎండిపొయినట్లు సర్కారే చెబుతోంది. తీవ్ర కరవుతో అపార నష్టాన్ని చవి చూసిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం మరోసారి విఫలమైంది. రైతులు వ్యవసాయం నుంచి వైదొలగే పరిస్థితులకు కారణమవుతున్న సర్కారు తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సేద్య సంస్కరణలను అమలు చేయకపోతే వ్యవసాయం మునుముందు పడకేసే ప్రమాదముందని ఈ రోజు ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ జత చేస్తున్నాను.