Pages

Wednesday 28 September 2011

రైతు నేత నాగేంద్రనాథ్ నిరాహారదీక్ష

          శరద్ పవార్ కి వినతి పత్రం ఇస్తున్న శ్రీ యెర్నేని                             
రైతు సంక్షేమానికి నిరంతర పోరాటం చేస్తూ రైతాంగ సమాఖ్య అధ్యక్షులుగా ఉన్న యెర్నేని నాగేంద్రనాథ్ 100  గంటల నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఎన్నో రైతు సేవా కార్యక్రమాలతో రైతు సమస్యలు తెలుసుకుని రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్న కృషీవలుడు, నిరాడంబరుడు యెర్నేని కొంత కాలంగా పంట విరామంపై ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. పంట విరామం ప్రకటించిన రైతులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ ఖర్చులకు అదనంగా 50  శాతం చేర్చి మద్దతు ధర నిర్ణయించాలని, 60 ఏళ్ళు నిండిన రైతులకు రెండు వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, ఎగుమతి, దిగుమతి విధానాల విషయంలో రైతుకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని.... ఇలా రైతు శ్రేయం కోరే పలు డిమాండ్లతో నాగేంద్రనాథ్ దీక్షకు దిగుతున్నారు. 
ధరల విషయంలో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే విధానంలో రైతుకు స్వాతంత్ర్యం లేనందున మరో రైతు స్వాతంత్ర్య పోరాటానికి నాందిగా ఈ దీక్ష చేస్తున్నానని యెర్నేని గారు బుధవారం అమలాపురం వెళ్లబోయే ముందు  ఈనాడు ఆఫీసులో నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. తన పోరాటానికి మీడియా మద్దతు కోరారు. యెర్నేని గారు అక్టోబర్ 2  గాంధి జయంతి రోజు అమలాపురంలో దీక్ష ప్రారంబించి 100  గంటల పాటు కొనసాగిస్తానని అక్టోబర్ 6 వ తేదీన దీక్ష ముగుస్తుందని తెలిపారు. ఆరుగాలం కృషికి తగిన ప్రతిఫలం కోరుతూ రైతులు దీక్షలకు దిగాల్సిన పరిస్థితి రావడం శోచనీయం. రైతులు సంఘటితమైతే ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించకపోవడం సిగ్గుచేటు. కళ్ళున్నా రైతుల కష్టాలు చూడలేని పాలకులు, నేతలు ఉన్న ఈ పరిస్థితుల్లో యెర్నేని తన ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాను. రైతుల దయనీయ పరిస్థితిని గమనించి వారికి మేలుచేసే సంస్కరణలు తీసుకురావాలని మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. యెర్నేని గారు  అల్ ది బెస్ట్.

No comments: