Pages

Thursday 22 September 2011

ఎరువుల ధరలు ఎన్ని సార్లు పెంచుతారు?

                                                            
కష్టాల్లో ఉన్న రైతుల్ని గట్టెక్కించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కందా కమిటీ వేసింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్లనే రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదని ఇలాంటి కమిటీలెన్నో చెప్పాయి. పంటలు సాగు చేసిన రైతుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడ్డారు. రైతుకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచడంలో సర్కారు చేతులెత్తేసింది. మరోవైపు కంపెనీలు ఎరువుల ధరల్ని పెంచేసి రైతుకు పెద్ద షాక్ ఇచ్చాయి. తాను పండించిన పంటను ఎంత ధరకు విక్రయించుకోవాలో స్వేచ్చలేని రైతులు విత్తనాల నుంచి ఎరువుల వరకు ఇష్టానుసారం ధరలు పెంచుతున్న కంపెనీల తీరుతో నేడు తల్లడిల్లిపోతున్నాడు. కాంప్లెక్స్ బస్తాపై రూ.188 , పోటాష్ పై రూ. 192 వరకు గరిష్టంగా పెంచారు. ఫలితంగా రైతులపై సుమారు రూ. 350  కోట్ల మేర అదనపు భారం పడనుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ  ఏడాది ఎరువుల ధరలు ఇప్పటికే ఐదు సార్లు పెరగటం గమనార్హం. సేద్యం గిట్టుబాటు కాక రైతులు నష్టపోతుంటే ఇష్టానుసారం కంపెనీలు పెంచుతున్న ధరలను ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోతుండటం శోచనీయం. రాష్ట్ర సర్కారు పెంచిన వ్యాట్ తో ఇప్పటికే ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు  ఈ పరిణామం మరింత నిరాశ కలిగించింది. కష్టాల కడగండ్లతో ఖరీఫ్ ను ఆరంభించిన అన్నదాతలకు తాజాగా పెరిగిన ధరలతో రబీ సీజన్ పెను భారం కానుండటం విషాదం.

No comments: