Pages

Monday 25 July 2011

రైతులపై ఎరువుల ధరల భారం!

                                                         
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉంది రైతుల పరిస్థితి. ఇప్పటికే సేద్యం గిట్టుబాటు కాక రైతులు వ్యవసాయం   నుంచి  వైదోలగుతుంటే  రైతుల వెన్ను విరిచే చర్యలకు కంపెనీలూ  ఎగబడ్డాయి. ఆరు నెలల క్రితం కేంద్రం ఇచ్చిన అనుమతితో ఎరువుల ధరలను పెంచిన కంపెనీలు తాజాగా డి.ఎ.పి., కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడం ప్రారంభించాయి. తాజాగా స్పిక్ కంపెనీ కొత్త ధరలను ప్రకటించింది. ఒక్క యూరియాను మినహాయించి మిగిలిన ఎరువుల ధరలను పెంచుకోడానికి కేంద్రం  అనుమతించడంతో కంపెనీలు ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ధరలను పెంచాయి. ఈ పరిణామంతో రైతులపై అదనపు భారం పడనుంది. స్పిక్  కంపెని క్వింటా డి.ఏ.పి.పై నూట పదిహేను రూపాయల యాభై పైసలు అదనంగా పెంచింది. త్వరలోనే మరిన్ని కంపెనీలు ఎరువుల ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డి.ఏ.పి ధరలు పెంచినందువల్ల ఇక్కడ ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నా సగటు రైతుల పరిస్థితిని అర్ధం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమవడం శోచనీయం. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగి నికరాదాయం తగ్గి సేద్యం భారంగా మారిన పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఎరువుల ధరలు పెంచుకునేందుకు కంపెనీలకు అవకాశం ఇస్తున్న పాలకులు, ఆ మేరకు పంట ఉత్పత్తుల ధరలు పెంచటంలో మాత్రం అలక్ష్యం చూపుతుండటం బాధాకరం. ఇటువంటి నిర్ణయాలు రైతుల ఆర్ధిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయనుండటం విషాదం.

No comments: