Pages

Sunday 24 July 2011

రైతుల వలసబాట!

                                                           
వ్యవసాయం నుంచి రైతులు వైదోలగుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనాభా లెక్కలు వెల్లడిస్తున్న ఈ గణాంకాలు చూస్తుంటే రైతుల దీనావస్థ కళ్ళకు కడుతోంది. దశాబ్దాలుగా సేద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితమిది.  దేశ ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన సాగురంగానికి జవసత్వాలు కల్పించక పోవడంతో అన్నదాతలు వరుస నష్టాల నుంచి బయటపడలేక పోతున్నారు. వ్యవసాయరంగం వృద్ధి చెందకపోతే దేశం వృద్ది చెందదని ఒక వైపు ఉపన్యాసాలు ఇస్తున్న పాలకులు సాగుదార్లకు స్థిరమైన ఆదాయం కల్పించటానికి తామేమి చేసామో చెప్పలేక పోతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్ల దాకా రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితులు క్షేత్ర స్థాయిలో నెలకుంటే ఇక రైతుకు నిలదొక్కుకునే అవకాశం ఎక్కడుంది?  నాణ్యమైన విత్తనాలతోపాటు రైతులకు అవసరమైన పంట రుణాలను ప్రభుత్వం అందించ లేకపోతోంది. బీమా పరిహారం చెల్లింపుల్లో మోసాలకు తోడు, ఎరువులు, సాగునీరు, సాగు సలహాలను అందించటంలో కొనసాగుతున్న నిర్లక్ష్యం రైతుల్ని కోలుకోనివ్వడం లేదు. వీటికి తోడు కూలీల కొరత, పండించిన పంటకు కనీసం తాను ప్రకటించిన గిట్టుబాటు ధరలను కూడా అందించలేకపోతున్న ప్రభుత్వ తీరుతో రైతులు ఏటా నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ అప్పులన్నీ పెరిగి పెరిగి రైతుల ఆత్మ హత్యలకు దారితీస్తున్నాయి. ఫలితంగా సేద్యం గిట్టుబాటు కాక రైతులు వ్యవసాయం  నుంచి వైదొలగాల్సి వస్తోంది. వీటిని సరిదిద్దటం చేతకాని ప్రభుత్వ నిర్వాకం కారణంగానే రైతులు వలసబాట పడుతున్నారు. రైతుల ఓట్లు దండుకొని పదవుల యావలో వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్న తీరు ఇలానే కొనసాగితే మునుముందు ఆహార భద్రత అటుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముంది. పరిస్థితిని చక్కదిద్దే సావకాశం ఇంకా తన చేతుల్లోనే ఉందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది.

No comments: