Pages

Thursday 21 July 2011

పంట విరామంతో సర్కారుకు కనువిప్పు కలగాలి?

                                                                                                           
అసమర్ధ విధానాలతో ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది.  ధాన్యం కొనేవారు లేక, గోదాములు ఖాళీ లేక నిన్నటి దాక అవస్థలు పడ్డ రైతులు నేడు వరి పంటకు విరామం ప్రకటించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.  ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమం నేడు పతాక స్థాయికి చేరుకుంది. ఆయా జిల్లాల రైతు నేతలు అఖిలపక్ష రైతు నాయకులూ ఈ పోరాటానికి బాసటగా నిలుస్తున్నారు. పంట విరామం అంటే మాటలు కాదని,  అది రైతుల వల్ల అయ్యే పని కాదని ఎకసేక్కాలాడిన మంత్రులు, అధికారులకు రైతులు తమ సంఘటిత శక్తిని రుచి చూపిస్తున్నారు.  నిజానికి ఏటికేడూ దక్కే పంటతోనే రైతు బతుకు సాగుతుంది. ఒక పంట అందునా ఖరీఫ్ పంటను వదులుకోవడమంటే ఆ ఏడాది ఆదాయాన్ని రైతులు వదిలేసుకున్నట్టే. ధాన్యం కొనుగోళ్ళ విషయంలోనూ, వరికి మద్దతు ధర ప్రకటించే సందర్భంలోనూ రైతుల గోడు పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే  నేడు రైతులకు సేద్యం భారంగా మారింది.  
                                                            
రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యానికి తోడు కేంద్రం సైతం మద్ధతు ధరల విషయంలో పట్టనట్టు వ్యవహరించడంతో రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న కాలంలో అమలు చేయకుండా చూడాలని రైతులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరినా పాలకులు పెడ చెవిన పెట్టారు. ఫలితంగా
 కూలీల ఆందుబాటు రైతులకు పెను సమస్యగా మారింది. అధిక కూలీ రేట్లతో రైతులకు నికరాదాయం తగ్గి క్రమంగా వారు అప్పుల ఊభిలో కూరుకుపోయారు. వీటికితోడు ప్రకృతి వైపరీత్యాలు రైతుల్ని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. పైగా మార్కెట్ శక్తుల ఆధిపత్యానికి సర్కారీ నిర్లక్ష్యం తోడవటంతో రైతుకు మిగులుబాటు మిధ్యగా మారింది. ఈ పరిణామాలతో కొన్నేళ్లుగా వ్యవసాయం నుంచి వైదొలగుతున్న వారి శాతం క్రమంగా పెరుగుతోంది.  అటు సేద్యాన్ని ఇటు పాడినీ వదిలేసి రైతులు ఇతర రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఎందరో రైతులు కూలీలుగా మారిపోగా మరికొందరు పట్టణాల్లో వాచ్ మేన్లుగా, తాపీ కార్మికులుగా మారిపోవడం ఆత్యంత విషాదం. ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని మన రైతుల్నిలా దిగజారుస్తున్న పాలకుల్ని ఏమనాలి? దశాబ్దాలుగా పదవుల యావలో రాజకీయాలు తప్ప రైతు సంక్షేమం పట్టని పాలకుల్ని నిగ్గదీయకపోతే ఇక రైతులోకానికి మనుగడ లేదు. అన్నం పెట్టె అన్నదాతల్ని చిన్నచూపు చూస్తున్న వారికి,  తిరగబడలేని అసహాయులుగా భావిస్తున్న వారికి పంటవిరామ నిర్ణయం ఒక గుణపాఠం కావాలి.  సంఘటిత శక్తి అంటే ఏమిటో రుచి చూపిస్తేనే ప్రభుత్వాల కళ్ళు తెరుచుకుంటాయి.  బాధాకర నిర్ణయమే అయినా మరో మార్గం లేక రైతులు ఈ సాహసానికి దిగాల్సి వచ్చింది.   
ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంటకు విరామం నినాదంతో రైతులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించడం మనందరి బాధ్యత. రండి రైతు సోదరులకు వెన్నుదన్నుగా నిలుద్దాం. సర్కారు కళ్ళు తెరిపిద్దాం.

3 comments:

B. Yerram Raju said...

A wonderful piece. I would support the farmers' move. It is this lack of unity that the politicians of this country took advantage thus far. It is bold and expensive no doubt. But would certainly open the eyes of the policy makers and politicians. In US and other developed economies crop holidays are common but the loss arising therefrom is compensated by the Budget to stabilise the prices.
Please view my blog:
http://yerrambehara.blogspot.com//

Srisail Reddy Panjugula said...

Good one, Harikrishna garu. I am a member of TDP Rythu Committee, headed by Dr Kodela Sivaprasad garu. We've toured the Godavari districts and have witnessed the farmers' plight. TDP is engaging in mass protests and closely working with other political parties and independent farmers unions besides scientists and intellectuals. Agriculture is no small subject and we need to look into their problems in depth but for the time being we are concentrating on 'Labhasati Dhara' and 'Sanghatitha udyamalu'. I humbly seek your intellectual inputs on this, from time to time.

NSV Sharma said...

ప్రభుత్వం రైతుల అభివృద్ధి విస్మరించి అనవసర విషయాలపైన కాలయాపన చేస్తుంది. ఈ బ్లాగ్స్పోట్ బాగుంది ,మంచి విషయాలు వివరించారు. అభినందనలు.