Pages

Wednesday 27 July 2011

ఖరీఫ్ రైతుకు మళ్ళీ గోదాముల కష్టాలు!

                                                     
దేశవ్యాప్తంగా రైతులకు, మిల్లర్లకు, కేంద్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా గోదాములన్నీ నిండిపోవడంతో ఈ ఖరీఫ్ కాలంలో వారి కష్టాలు మరింతగా  పెరగనున్నాయి. దేశంలో గత రబీలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరగటంతో గోదాములన్నీ పూర్తిగా నిండిపోయాయి. గత ఏడాది ఖరీఫ్ నుంచి ఈ సమస్య రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా కేంద్రం సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయింది. పైగా సీజన్లో పండించిన పంటను నిల్వ చేసుకునే వసతి లేక రైతులు నానా అగచాట్లు పడ్డారు. నిల్వ వసతులు లేవనే సాకుతో మిల్లర్లూ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టారు. గోదాముల సమస్య ఇంతగా ఇబ్బంది పెట్టినా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఏడాది గడిచినా ఇదే సమస్య పునరావృతం కావడంతో రైతులకు మళ్ళీ దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో ఆహార భద్రతా బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశంలో ధాన్యం సేకరణ యత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంత చేస్తున్నా రైతుల వద్ద ధాన్యం ఇంకా ఖాళీ కాలేదు. ప్రైవేటు గోదాముల్ని అద్దెకు తీసుకున్నా పరిస్థితి ఇసుమంత కూడా మార్పు రాలేదు. మరోవైపు దేశంలో అదనంగా గోదాములు నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసినా వాటిలోనూ మన రాష్ట్రానికి  అన్యాయమే ఎదురైంది. ఫలితంగా దేశంలో నేడు ధాన్యాన్ని ఆరుబయటే నిల్వ చేసే పరిస్థితి నెలకొంది. దీనికితోడు తాజాగా వర్షాలు సైతం ఊపందుకున్నాయి. ఈ వర్షాల తాకిడికి ధాన్యం పూర్తిగా తడిసి రైతులు, మిల్లర్లకు పెను నష్టం వాటిల్లుతోంది. 
                                                      
ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టకపోవడం, మద్దతు ధర ఇవ్వకపోవడం వల్లనే గోదావరి జిల్లాలో వరి పంటకు విరామం ఇచ్చేందుకు రైతులు ఉద్యమించడం తెలిసిందే. సమస్య తీవ్రత గురించి ప్రభుత్వానికి తెలిసినా గోదాముల సామర్ధ్యం పెంచేందుకు, రైతుల కష్టాలు తీర్చేందుకు పాలకులు ఆశించిన రీతిలో స్పందించడం లేదు. నిర్లక్ష్యం కొనసాగితే దేశ ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లనున్న రీత్యా కేంద్రం నిధులిచ్చి సరిపడా గోదాముల్ని నిర్మించి ఉత్పత్తి నష్టాలను కనీస స్థాయికి పరిమితం చేయాల్సి ఉంది.  ఇవే కష్టాలు  ఖరీఫ్ సీజన్నూ ముంచెత్తే ఆవకాశం ఉన్న దృష్ట్యా పాలకులు ఇకనైనా మేల్కొని గోదాముల కష్టాలకు చరమగీతం పాడతారని ఆశిద్దాం.

No comments: