గడచిన కాలం మనకు సంతోషాన్ని, విషాదాన్ని పంచి ఉండొచ్చు! జరిగి పోయిన వాటిని పదే పదే తలచుకుని ఇప్పటి కర్తవ్యాన్ని విస్మరించేకంటే ఇప్పటి నుంచి జరగాల్సిన, చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మంచిది. కాలం మనకోసం ఆగదు. దానిని ఎవ్వరూ నిలువరించలేరు. మారుతున్న, సాగిపోతున్న కాలంతో పాటే మనమూ ముందుకు సాగటమే మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యమ్. ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Saturday, 31 December 2011
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గడచిన కాలం మనకు సంతోషాన్ని, విషాదాన్ని పంచి ఉండొచ్చు! జరిగి పోయిన వాటిని పదే పదే తలచుకుని ఇప్పటి కర్తవ్యాన్ని విస్మరించేకంటే ఇప్పటి నుంచి జరగాల్సిన, చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మంచిది. కాలం మనకోసం ఆగదు. దానిని ఎవ్వరూ నిలువరించలేరు. మారుతున్న, సాగిపోతున్న కాలంతో పాటే మనమూ ముందుకు సాగటమే మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యమ్. ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Thursday, 29 December 2011
లోక్ పాల్ పై ఇంతవంచనా ..?
అవినీతిపై సమర శంఖం పూరిస్తామని లోక్ పాల్ బిల్లు తెచ్చి తీరుతామని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ బొక్కబోర్లా పడింది. అవినీతి వ్యతిరేక బిల్లును నిరోదించే విషయంలో రాజకీయ పక్షాలన్నీ ఏకం కావడం వారి దుర్నీతిని తేటతెల్లం చేసింది. లోక్ సభలో హైడ్రామా మధ్య ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లును గట్టేక్కించడంలో అధికార కాంగ్రెస్ తన భాగస్వామ్యపక్షాలను ఒప్పించలేకపోయింది. రాజ్య సభలో సుదీర్ఘ చర్చ సమయంలో విపక్షాల నిలదీతతో అధికార కాంగ్రెస్ లోక్ పాల్ పై వెనకడుగు వేయటం సిగ్గుచేటు. నాలుగున్నర్ర దశాబ్దాల లోక్ పాల్ బిల్లుకు నేటికీ ఆమోదం పొందలేకపోవడం అవినీతిని తుదముట్టించడంలో నేతలకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధమవుతోంది. పార్టీలను ఒప్పించడంలో సర్కారు విఫలం కావడం వల్ల నాటకీయ పరిణామాల మధ్య లోక్ పాల్ బిల్లుకు గ్రహణం పట్టింది. అవినీతిని తుదముట్టించే బిల్లు అన్నా హజారే చెప్పినట్టు కాకుండా ఇలా ఉండాలంటూ తమ సొంత సూత్రీకరణలు చేసిన పార్టీలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించి బిల్లును శక్తిహీనం చేశాయి. పార్టీలన్నీ అవినీతి బురదలోనే తాము పోర్లాడతామని మరోసారి రుజువు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. స్కాంలతోనే సహవాసం చేస్తామని నిరూపించాయి. హజారేలు ఎందరు వచ్చినా, నిజంగా ఆ గాంధీయే తిరిగి జన్మించినా నేటి రాజకీయ నేతల బుద్దిని మార్చలేం. ఏమంటారు?
తుపాన్ ముందటి ప్రశాంతత!
"థానే" తుపాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే సగం చచ్చిన రైతుల్ని ఈ తుపాన్ మరింతగా నష్టపరచనుంది. తీవ్ర కరవుతో అల్లాడుతున్న ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాల్లో పంటల్ని తుపాన్ ప్రభావితం చేయనుంది. ఇది ప్రధానంగా చెన్నైని దేబ్బతీయనున్నప్పటికీ రాష్ట్ర రైతులకు సైతం తీవ్ర నష్టం కలుగుతుంది. తుపాన్ల కాలం పూర్తయ్యాక వస్తున్న ఇటువంటి వైపరీత్యాలు రైతుల తలరాతల్ని మార్చేస్తున్నాయి. నష్ట తీవ్రతను బాగా పెంచే అవకాశం
ఉన్నదిగా భావిస్తున్న "థానే" తుపాన్ తీసుకురానున్న కష్టాల గురించి తలచుకుని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఒక సీజన్ నష్టపోతే మరో సీజన్ కాపాడుతుందనుకుని రబీ పంటలు వేసుకున్న రైతుల ఆశల్ని ఈ తుపాన్ ఆవిరి చేయనుంది. సాగు వ్యయం పెరిగి, గిట్టుబాటు ధరల్లేక, వరుస నష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గత వంద రోజుల్లోనే దాదాపు 163 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాచారం. కనీసం వారికి కరవు సహాయక చర్యలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం చేసిన అలక్ష్యం అందరికీ తెలిసిందే. కరవుపై నేటికీ కార్యాచరణను ప్రకటించకుండా తాత్సారం చేసిన పాలకులు కనీసం రైతుల్ని ఈ తుపాన్ నుంచయినా కాపాడాలి. తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కల్పించాలి.
Saturday, 24 December 2011
క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రపంచానికి శాంతిమార్గం చూపిన ఆ మహానీయిని జన్మదినం విశ్వ మానవాళికి పండుగ దినం. మంచిని పెంచి, చెడును వదిలివేయాలని ప్రభోదించిన ఏసుక్రీస్తు పుట్టిన రోజును "క్రిస్మస్ పండుగ"గా జరుపుకోవడం మనందరి ఆనవాయితీ. పాపులు, దీనుల కోసం పరితపించి వాళ్ళను జీవోన్ముక్తుల్ని చేసిన లోక రక్షకుడాయన. మానవాళికి ఆ మహనీయుడు అందించిన విలువల్ని కాపాడుకోవడం, ఆచరించడమూ మనందరి బాధ్యత. ఆ పవిత్ర కర్తవ్యాన్ని గుర్తెరిగి మసలాలని కోరుకుంటూ యావత్ మానవాళికి క్రిస్మస్ శుభాకాంక్షలు.
Wednesday, 21 December 2011
స్వతంత్ర భారతంలో చెత్త వ్యవసాయ మంత్రి ఎవరు ?
కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చెంప చెళ్ళుమని పించినా ఆయనకు బుద్ధి రావటం లేదు. స్వతంత్ర భారతంలో అత్యంత పనికిమాలిన వ్యవసాయ మంత్రిగా కీర్తిని సంపాదించుకున్న పవార్ రైతాంగ సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ మనుగడ కోసం కాంగ్రెస్ పవార్ తప్పిదాలను వెనకేసుకు వస్తూ పెద్ద తప్పే చేస్తోంది. పార్లమెంటులో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా అటు ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ సభ్యులు ఆయన తీరును కడిగేసినా సిగ్గు రావటం లేదు. దేశంలో పామాయిల్ రైతులకు కిలోకు రూ. 15 సబ్సిడీ ఇవ్వమంటే కుదరదన్న మంత్రి., విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలపై 20 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని స్వయంగా కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. నిజంగా ప్రపంచంలో ఆ మాటకొస్తే పామాయిల్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మలేసియా కంటే ఆయిల్ పామ్ సాగుకు మంచి భూములున్న ఆంధ్ర ప్రదేశ్లో ఈ పంట సాగుకు ఆశించిన ప్రోత్సాహాలు అందటం లేదు. దేశంలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్న పవార్ వంటి మిత్రపక్ష మంత్రుల్ని సరిచేయాల్సిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేక పోవడం వల్లనే. పవార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రైతాంగ శ్రేయం కోసం దృష్టి పెట్టు.
Friday, 16 December 2011
కరెంటు కష్టాలు....
ఓ వైపు మంచు దుప్పట్లు రాష్ట్రాన్ని కప్పేస్తుంటే., నడి శీతాకాలంలోనే కారు చీకట్లు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా కరెంటు కష్టాలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కరవు దెబ్బతో ఇప్పటికే రాష్ట్ర రైతులు అల్లాడుతుంటే, కరెంటు సరఫరా సక్రమంగా లేక వేసిన పంటలు సైతం ఎండుముఖం పడుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన విద్యుత్ డిమాండ్, సరఫరా పడిపోవడం వ్యవసాయానికి ఏడు గంటలు అందించాల్సిన పరిస్థితుల్లో గృహాలకు కోతలు తప్పడం లేదని కొందరు అధికారులు బాహాటంగానే ఆంగీకరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్ల నీటి మట్టాలు తగ్గటంతో జల విద్యుత్ 1500 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఫలితంగా శీతాకాలం మధ్యలోనే దినసరి విద్యుత్ వాడకం 250 మిలియన్ యూనిట్లకు చేరువైంది. వేసవి సమీపించేకొద్దీ ఇది మరింత పెరుగుతుందన్న ఆందోళన విద్యుత్ శాఖను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇపుడు పంటలకు కరెంటు సరఫరాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరవు దెబ్బతో నష్ట పోయిన రైతులు చేనుకు నీరందించే మార్గం లేక వారు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రబీ పంటలు ఎండుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాకతీయ ధర్మల్ ప్రాజెక్ట్ లో 70 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడం జెన్ కోకు మరో దెబ్బ.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాపం రాష్ట్ర సర్కారు వినతుల్ని కేంద్రం పెడచెవిన పెట్టడంతో ఏం చేయాలో పాలుపోక కిరణ్ సర్కారు తలపట్టుకుంటోంది. మరో వైపు పరిశ్రమలకు చాలినంత సరఫరా లేక వారు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గిన కారణంగా ఇప్పటికే పరిశ్రమలకు 42 శాతం మేర ట్రాన్స్ కో కోత పెడుతోంది. ఈ నేపధ్యంలో కరెంటు కోతలకు స్వస్తి చెబుతామని పైకి గంభీరంగా చెబుతున్నా సమస్యను ఎలా అధిగమించాలో అర్ధం కాక సర్కారు గుంజాటన పడుతోంది. అటు రైతులు ఇటు పరిశ్రమలు మధ్యలో గృహ వినియోగదార్లు పడుతున్న అగచాట్లతో ఆంధ్ర ప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు దోమలతో మరో నెల తర్వాత వేసవిని తలపించే వాతావరణంతో ఉక్కపోతను భరించటానికి ప్రజలు సిద్దం కావాలి మరి!
Thursday, 15 December 2011
రూపాయి బియ్యంలో పురుగులు ఇందుకే వస్తున్నాయ్..!
ఉద్యోగుల కొరత కారణంగా నిల్వ చేసిన ఆహార ధాన్యాల నాణ్యతకు సంబంధించి తనిఖీలు చేపట్టడం లేదని భారత ఆహార సంస్థ చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత ఆహార సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగులు గత తొమ్మిదేళ్ళలో సుమారు వెయ్యి మంది తగ్గిపోవడంతో సాధారణ తనిఖీలు కూడా చేపట్టలేని స్థితిలో ఎఫ్.సి.ఐ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు కొనుగోలు చేసి నిల్వ చేసే ఆహార ధాన్యాల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వికేంద్రీకరణ కొనుగోళ్ళ పధకం (డి.సి.పి) ప్రకారం ఆహార ధాన్యాల కొనుగోళ్ళు, జాగ్రత్తగా నిల్వ చేయడం రాష్ట్రాల బాధ్యత. ఎఫ్.సి.ఐ నుంచి నాణ్యమైన ఆహార ధాన్యాలను తీసుకుని చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించడం కూడా రాష్ట్రాలే చూసుకోవాలి. ఎఫ్.సి.ఐ డిపోల నుంచి ఆహార ధాన్యాలు పంపిణీ కేంద్రాలకు వెళ్ళే ముందు కల్లెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు నాణ్యతను పరిశీలించుకోవాలి ఇప్పటికే ఎఫ్.సి.ఐ పౌరసరఫరాల శాఖను కోరింది. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి వాటిని తగిన ప్రమాణాలతో నిల్వ చేయాలని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన నేపధ్యంలో ఆహారోత్పతుల నిల్వలో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో రూపాయికే కిలో బియ్యం పధకాన్ని ప్రవేశపెట్టడం ఆ బియ్యాన్ని అందుకున్న వారెందరికో బియ్యంలో పురుగులు కనిపించడం తెలిసిందే. ఆహార ధాన్యాల నిల్వల నాణ్యతా తనిఖీలు లోపించడం వల్లనే ఈ తరహా సమస్యలు తలెత్తి ఉంటాయని మనం ఊహించవచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం వల్లనే ఆహార ధాన్యాలు ముక్కి పోతున్నాయని గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని పలుమార్లు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా జాగ్రత్త పడి పేద ప్రజలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాలను సక్రమంగా నిల్వ చేయడంపై ఎఫ్.సి.ఐ తో పాటు కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి.
Subscribe to:
Posts (Atom)








