Pages

Sunday, 27 November 2011

ఆహార భద్రత బిల్లు - రాజకీయ పాచిక!

                                                        
రానున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహ తంత్రంగా ఆహార భద్రతను కేంద్రం అడ్డం పెట్టుకోవడం లేదు కదా అన్న అనుమానం కలుగుతోంది. 2009 ఎన్నికల్లో యుపీఏను  ఉపాధిహామీ ఆడుకున్నట్టుగానే, 2014లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆహార భద్రత కాపాడుతుందన్న వాదన వినిపిస్తోంది.  అసలు అంతకంటే ముందు అంటే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రతా బిల్లుపై యూపీ సర్కారు ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తోంది. కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ సారధ్యంలోని మంత్రుల సంఘం ఒప్పుకున్న ఆహార  భద్రతాబిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, తర్వాత స్థాయీసంఘం పరిశీలనతో చట్టంగా మారడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఇదంతా వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని కావాలని చేస్తున్న జాప్యమేనన్న సందేహం కలుగుతోంది.                                                             
ఒకవేళ బాలారిష్టాలన్నీ దాటి ఇది ప్రజల ముందుకు వచ్చినా దీన్ని సక్రమంగా అమలు చేయడం అనుమానమే. ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతపైనే ఆసలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎటొచ్చీ ఆహార భద్రత చివరికి ప్రజలను పరిహసించే రాజకీయ క్రీడగానే మిగిలిపోతుందేమోనన్న భయం కలుగుతోంది.

Thursday, 17 November 2011

అధోగతిలో అన్నదాత

          
వేరుసెనగ నాశనమైంది, పత్తి ముంచేసింది. వరి లక్షల ఎకరాల్లో ఎండిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు అపార నష్టాన్ని చవి చూశారు. వరుసగా మూడేళ్ళు ఖరీఫ్ పంటలు నాశనమై రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారు. అప్పులు తీర్చుకునే మార్గం లేక కొందరు పేద రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతుల దయనీయ స్థితిని ప్రభుత్వం లేశమాత్రం కుడా పట్టించుకోవడం లేదు. వారి దయనీయ స్థితికి కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో సూచిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. స్కాన్ చేసిన కాపీని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. 
                                                                             
   

Saturday, 5 November 2011

రైతులంటే ఎందుకంత కసి!

                                                     
ఎరువుల ధరలు మళ్ళీ పెంచారు. రైతు చితికి చితికి పోతున్నా పాలకులకు సిగ్గు రావటంలేదు. ధరలపై నియంత్రణ ఎత్తి వేసిన నాటి నుంచి ఎరువుల ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచేస్తున్నాయి. దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాచుర్యం పెరిగితే, ఆ మేరకు రైతుల్లో అవగాహన పెరిగితే  ఈ కంపెనీలు సగం మూతపడటం ఖాయం. ఈ ఏడాది ఇప్పటికే 13 సార్లు  ఎరువుల ధరల్ని పెంచేసిన కంపెనీలు ఈ నెలలో రెండోసారి ధరలను పెంచేందుకు సాహసించడం కేంద్ర పాలకుల పుణ్యమే. పెట్రో ధరల్లా ఇష్టానుసారం ఎరువుల రేట్లను పెంచేస్తున్న కంపెనీలు, ఇప్పటికే అప్పుల పాలైన రైతుల బాగోగులు పట్టించుకోని కేంద్రం ఇందుకు తగిన మూల్యాన్నే చెల్లించుకుంటాయి. రైతులు ఎక్కువగా వాడే డై అమ్మోనియం ఫాస్పేట్ (డి,ఏ.పి) ధరను గడచినా ఆరు నెలల్లో బస్తాకు రూ.300 కు పైగా పెంచారు. తాజాగా బస్తా ధర వెయ్యికి చేరింది. ధరలు ఎక్కువ కావడంతో డి.ఏ.పి కొనుగోళ్ళు తగ్గడంతో కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరల్ని పెంచుతున్నాయి. 
                                                         తాజాగా ఫాక్ట్ కంపెని 20 :20 :0:13 ఎరువు 50 కిలోల బస్తా ధరను రూ.674 .93 నుంచి ఏకంగా వంద రూపాయలు పెంచింది. అలానే జింక్ కలిసి ఉండే బస్తా ధరను కూడా బస్తాకు రూ. 95 వరకు పెంచేశారు. ఒక పద్దతంటూ లేకుండా ఇష్టానుసారం ధరల్ని పెంచుతున్న కంపెనీలు, పాలకులు తమ పొరపాట్లను గుర్తించకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావడం తప్పనిసరి.

Thursday, 3 November 2011

ఎండుతున్న రైతు గుండె

                                                                      
రాష్ట్ర రైతు కరవు కోరల్లో చిక్కుకున్నాడు. 40 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు ఎండిపొయినట్లు సర్కారే చెబుతోంది. తీవ్ర కరవుతో అపార నష్టాన్ని చవి చూసిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం మరోసారి విఫలమైంది. రైతులు వ్యవసాయం నుంచి వైదొలగే పరిస్థితులకు కారణమవుతున్న సర్కారు తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సేద్య సంస్కరణలను అమలు చేయకపోతే వ్యవసాయం మునుముందు పడకేసే ప్రమాదముందని ఈ రోజు ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ జత చేస్తున్నాను.
                                                        

Tuesday, 25 October 2011

దీపావళి శుభాకాంక్షలు

                                                           
దీపావళి సందర్భంగా బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నిరాశా నిస్పృహలనే చీకట్లను పారద్రోలి, చైతన్యం కొత్త వెలుగై ప్రసరించాలని అది మీకు మంచి శుభాలను ఇవ్వాలని ఆశిస్తూ.........
                                                  మీ
                                       అమిర్నేని హరికృష్ణ.

Friday, 14 October 2011

మండుతున్న రైతు గుండెలు!

                                                         
తెలంగాణా లోని నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాలకు తోడు తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం,కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తాజా నివేదిక చెబుతోంది. తీవ్ర ఎండలు ప్రజలకు వేసవి తాపాన్ని రుచి చూపిస్తుంటే, ఇప్పటికే వేసిన పంటలు ఎండి పశువులకు గ్రాసంగా వాడాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 701 .8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ నెల 12 వ తేదీ నాటికి కేవలం రాష్ట్రంలో 556 మి. మీ. (21 శాతం తక్కువ) మాత్రమే వర్షం  కురిసింది. దాదాపు 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరి, వేరుసెనగ,మొక్కజొన్న, పత్తి, తదితర పంటలు ఎండి రైతులు పంటల్ని తగులబెట్టుకోవాల్సి వస్తోంది. 
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంటే, విద్యుత్ కోతలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. పంట కీలక దశలో ఉండగా వర్షాభావం రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. ప్రభుత్వ వైఖరి రైతుల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న 'ప్రత్యేక' పరిస్థితులపై స్పందించడంలో విఫలమవుతున్న పాలకులు, తమ చేత కాని తనాన్ని రైతుల విషయంలోనూ నిరూపించు కుంటున్నారు. ఇప్పటికే ధర లేక, నిల్వ వసతులు లేక, ఎరువులు దొరక్క, వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నిరాశలో ఉన్న రైతుల్ని సక్రమంగా విద్యుత్ సరఫరా ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం పదే పదే విఫలమవడం రైతుల స్థితిని మరింత దుర్భరం చేస్తుండటం విషాదం.

Wednesday, 5 October 2011

దసరా శుభాకాంక్షలు

                                                            
బ్లాగు మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.  దసరా అంటే పది రాత్రులని అర్ధం. నిజానికి నవరాత్రులు...అంటే తొమ్మిది రాత్రులు. చివరి రోజయిన దశమి తిధి తో  కలిపి మొత్తం పది రోజులు. ఈ పండగ శరత్కాలంలో వస్తుంది. అందుకే శరన్నవరాత్రులు అయ్యాయి. ఆశ్వయిజ మాసంలోని శుక్ల పక్షంలో మొదటి దినమైన పాడ్యమి నుంచి నవమి దాకా జరిపేవే శరన్నవరాత్రులు. వీటినే శారద నవరాత్రులని కుడా అంటారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే వరుసలో నవరాత్రి పూజలు జరుగుతాయి. వీటిని దేవీ నవరాత్రులని కుడా వ్యవహరిస్తారు. వసంత కాలంలో కాకుండా శరత్కాలంలో చేసే దేవీ ఆరాధన అయినందున ఈ పండగను అకాల్ బోధన్ అని బెంగాలీయులు అంటారు. అత్యాశ, గర్వం, కోపం, దురాశ, ఆకర్షణ, మోహం, ద్వేషం, అసూయ, స్వార్ధం, క్రూరం.... ఈ దశ దుర్గుణాలను చిహ్నంగా భావించే పది తలల రావణ సంహారాన్ని పలు ప్రాంతాల్లో విజయ దశమిగా జరుపుకుంటున్నాము. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మరోసారి శుభాకాంక్షలు.