Pages

Tuesday 20 March 2012

ఓటి బతుకులు

                                                               
మొక్క మొలిచిననాడే...
మళ్ళీ కధ మొదలయ్యింది..
పైరు విత్తుతున్న ప్రతిసారీ...
రైతు గుండెలో విచ్చుకత్తులు దిగుతున్నాయి...
మొక్క ఎదుగుతున్న కొద్దీ..
రైతు బతుకు  గొడ్డుమోతుదవుతోంది...
కాయకష్టం కొండేక్కుతుంటే..
ఊతమిచ్చినవాడే ఊరేగుతున్నాడు..
కర్రు కదిలించినవాడు..
కర్పూరంలా కరుగుతున్నాడు...!
పాదు  ఫలమిచ్చినా ఊతకర్రదే పెత్తనమంతా...
ఏళ్ళు గడుస్తున్నా ఓటి బతుకే రైతులదంతా..!!
ప్రతి తిండి గింజ పై తినేవారి పేరు రాసుంటే...
రైతు నాలుకలపై ఆ బీజాక్షరాలు ఎందుకు లేవు?
కాలం కరుగుతున్నప్పుడల్లా...
కొత్త అప్పులు పెరుగుతున్నాయి....
పంట పండుతున్న ప్రతిసారీ...
రైతు డొక్కలు ఎండుతున్నాయి...!
జీవనసారాన్ని ఔపోసన పట్టిన రైతుకు...
మార్కెట్ మాయలు అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే..!
పదే పదే పడి లేస్తున్న ప్రయాసలో...
పాపం..
రైతు బతుకంతా ఓ జూదమే!!       

2 comments:

పల్లా కొండల రావు said...

" జీవనసారాన్ని ఔపోసన పట్టిన రైతుకు...
మార్కెట్ మాయలు అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే..!
పదే పదే పడి లేస్తున్న ప్రయాసలో...
పాపం..
రైతు బతుకంతా ఓ జూదమే!! "

ఇంతకన్నా ఏమి చెప్పగలం !?

Hari Krishna said...

ధన్యవాదాలు సర్., ఏళ్ళు గడుస్తున్నా వారి జీవితాల్లో మార్పు లేకపోవడం బాధాకరం. ఆ ఆవేదనలోంచి పుట్టిందే ఈ కవిత.
హరికృష్ణ