Pages

Tuesday 13 September 2011

కందా కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందా...?

                                                

                             
 పంటల సాగుకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగి పోతుండటం వల్లనే రైతులు నష్టాల పాలవుతున్నారని, అటువంటి రైతుల్ని ఆదుకోవాలని మోహన్ కందా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ తన నివేదికను నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. అధికారికంగా ప్రభుత్వం ఈ నివేదికను వెల్లడించకపోయినా కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతులు చేస్తున్న కొన్ని డిమాండ్లను తమ నివేదికలో ప్రస్తావించారు. ముఖ్యంగా మే 15 వ తేదీ నాటికి కాలువలకు నీరు వదలాలని., జూన్ లోనే నాట్లు వేయడం ద్వారా రైతుకు నష్టాలు తగ్గించవచ్చని సూచించారు. అలానే ప్రస్తుతమున్న 75 శాతం లెవీని 50 శాతానికి తగ్గించాలని కూడా కమిటీ  సూచించింది. కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరల విషయంలో రైతుల వాస్తవ ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని కమిటీ భావించింది. మద్దతు ధరకు తక్కువగా ఉండటం వల్లనే రైతులు ఏటా నష్టాలను భరించాల్సి వస్తోందని కమిటీ అభిప్రాయపడింది. గత ఏడాది నుంచి ఇబ్బంది పెడుతున్న గోదాముల సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరింది. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడే మంచి ధరలు అందేలా చూడాలని, దీనికి తగ్గట్టుగానే ఎగుమతులపై నిర్ణయం తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సేద్యంలో ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, అందుకు తగ్గట్టు సాగు విధానాలను నిర్వచించుకోవడం, మార్కెటింగ్ ను పటిష్టపరచడం ద్వారా రైతుకు లాభసాటి సేద్యంపై ఆసక్తి పెరిగేలా చూడాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.
                                                              
అయితే పంట విరామం పాటించిన రైతులకు ఆర్ధిక సహాయం ఇవ్వటానికి కమిటీ నిరాకరించినట్టు తెలుస్తోంది. పంట విరామం విషయంలో రైతులు తాము పడుతున్న సమస్యలను, ప్రభుత్వం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని కూడా ఇప్పటికే పాలకులకు వివరించారు. కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్న విషయంపై పెద్ద ఎత్తున విమర్శలూ చెలరేగాయి. జయతీఘోష్ సహా ప్రభుత్వం పలు కమిటీలు వేసినా రైతులకు ఏం ఒరిగింది పాపం..? ఈ సూచనలన్నీ పాలకులకు తెలియనివా..?  ఈ కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశించడం గతానుభవాలను పరిశీలిస్తే సందేహమే.

1 comment:

mmd said...

ఇది మరో స్వామినాథన్ కమిటీ అవుతుంది. ప్రభుత్వం బహుసా ఇప్పటికే పాత కాగితాలవాడికి అమ్మేసుంటుంది. నిజం ఈ ప్రభుత్వాలకి ఎప్పుడు ఎక్కుతుంది గనుక......