Pages

Monday 1 August 2011

మట్టి వినాయక విగ్రహాలు పెట్టి పూజించండి

                                                 
ఈ రోజు అనుకోకుండా పర్యావరణ ప్రేమికుడు విజయ్ రామ్ ను కలవడం జరిగింది. గత ఏడాది లాగా ఈసారి కూడామట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలనే ఉద్యమాన్ని ఆయన భుజాలకు ఎత్తుకున్నారు. గత ఏడాది వీరు హైదరాబాద్ సిటీలో దాదాపు 500 కు పైగా విగ్రహాలను అందించడం జరిగింది. ఈసారి వినాయక విగ్రహాలకు పంచెకట్టు కూడా కట్టి ఆకర్షణీయంగా రూపొందించారు. ఇటీవలే అక్కినేని అమల గారు కూడా ఎర్రగడ్డ అర్బన్ ఫారెస్ట్ నర్సరీలో ఉన్న వీరి విగ్రహాల తయారీ కేంద్రానికి వెళ్లి గణపతిని పూజించి రెండు విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మొదలైన ప్లాస్టర్ అఫ్ పారిస్ భారీ విగ్రహాల పిచ్చి ఇంతకు ముందు అలవాటు లేని కోస్తా, సీమల్లోని గ్రామాలకు సైతం పాకింది. ఇక్కడ హుస్సేన్ సాగర్ పాడైనట్లే రాష్ట్రంలోని లక్షలాది గ్రామాల్లో పంట కాలువలు, చెరువులు నాశనమయ్యే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున కాసేపు నుంచుంటే రోగాలు రావటం ఖాయమని డాక్టర్లు ఇప్పటికే చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజలు ఈ కాలుష్యానికి కొంత అలవాటు పడినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు మాత్రం ఈ చెరువులో బోటు షికారుకు వెళ్ళవద్దని వారు సూచిస్తున్నారు. 
                                                        ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ రామ్ తన 'సేవ్' సంస్థ ద్వారా చేస్తున్న ఈ కృషిని  అభినందిస్తూ పర్యావరణంతో సహా చెరువుల ఇతర జలవనరుల పరిరక్షణకు పాటుపడుతున్న అతనికి మనవంతుగా తోడ్పడదాం. అందుకు మనం చేయాల్సిందల్లా.. మరో నెల రోజుల్లో జరగనున్న వినాయక చవితికి మట్టి వినాయకులను తెచ్చి పూజించడమే. ఎవరికీ ఇబ్బంది కలగని, పెద్దగా ఖర్చు కూడా లేని వీటితో పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.  ఇది విజయ్ రామ్ ఒక్కడి బాధ్యత కాదు, మనందరి బాధ్యత కూడా.

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

హుస్సేన్‍సాగర్ కలుషితమైనది వినాయక నిమజ్జనం వల్ల మాత్రమే అంటారా? ఇంక వేరే కారణాలేమీ లేవా?

కూకట్‍పల్లి నాలా హుస్సేన్‍సాగర్‍నే కాదు నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలనూ(ఎస్టీపీ) విషమయం చేస్తోంది.జీడిమెట్ల ప్రాంతం నుంచి వచ్చే రసాయనాలతో ప్రవహించే నాలా కారణంగా హుస్సేన్‍సాగర్ తీవ్రంగా కలుషితమవుతున్న విషయం మీకు తెలియదా?

వినాయక చవితి వస్తోందంటే చాలు మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణాన్ని కాపాడంటూ అందరూ చెప్పేవాళ్ళే.ఏడాదికో రోజు నిమజ్జనం చేస్తారు.మరి ప్రతిరోజూ జరిగే హాని,కలుషితం గురించి మాత్రం ఆలోచించరు.

విజయ్‍రామ్‍లాంటి పర్యావరణ ప్రేమికులకో విన్నపం ప్రతిరోజు జరిగే కలుషితాల గురించి కూడా గళమెత్తండి,దానికోసం పోరాడితే చాలా మేలు చేసినవారవుతారు.

అమిర్నేని హరికృష్ణ said...

విజయ్ మోహన్ గారు

మీరు చెప్పిన వన్నీ నిజమే. హుస్సేన్ సాగర్ కాలుష్యానికి వినాయక విగ్రహాలే కారణమని చెప్పటం నా ఉద్దేశం కాదు. చెప్పలేదు కూడా. ఇక్కడ సాగర్ లాగా పంట పొలాలకు కాలుష్యం బెడద ఉండకూడదన్నదే ఉద్దేశం. మీరన్నట్టు అన్ని రకాల కాలుష్యం గురించి ఉద్యమిస్తే మంచిదే.
ధన్యవాదాలు.