Pages

Tuesday 29 July 2014

యాపిల్స్ కోనేవారూ పారాహుషార్ !

                                                                             



ఈ రెండు ఫోటోలను జాగ్రత్తగా గమనించండి. మొదటి ఫోటో లోని యాపిల్స్ నిగ నిగ మెరిసిపోతున్నాయి కదూ! ఇక రెండో, మూడో ఫోటోలను చూడండి... ఎలాంటి  ఆకర్షణ లేకుండా ఉన్న ఈ యాపిల్స్ కంటే మొదటి ఫోటోలోని యాపిల్స్ కొనడానికే వినియోగదారులు ఇష్టపడుతుంటారు. నిజానికి మన సిమ్లా లో విరివిగా పండే యాపిల్స్ రెండు, మూడు ఫోటోలలోనివే. మొదటి రకం యాపిల్స్ విదేశీ యాపిల్స్. విదేశీ యాపిల్స్ ఇంతలా మెరిసిపోవడం వెనుక వాటికి వ్యాక్స్ కోటింగ్ వేస్తారని మీకు తెలుసా?

గిరాకీకి తగ్గ సరఫరా మన దేశంలో లేకపోవడం వల్ల మనం యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ లోని కొంత భాగంలో పండే దేశీయ యాపిల్స్ ఏటా ఆగస్ట్ నెల నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, చిలీ, ఇరాక్ (వయా ఆఫ్ఘనిస్తాన్) చైనా ల నుంచి మన దేశంలోకి యాపిల్స్ యథేచ్చగా వచ్చిపడుతున్నాయి. యాపిల్స్ నిల్వ కాలాన్ని దాదాపు  10 నెలల వరకు పెంచాలంటే ప్రాసెస్ చేసిన పండ్లకు విదేశాల్లో ఎగుమతిదారులు ఎంచుకునే మార్గం వ్యాక్స్ కోటింగ్. ఇలా చేయటం వల్ల అవి తినేవారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ పండ్ల తోలు తీసి తిన్నప్పటికీ సమస్యలు వెంటాడే ప్రమాదముంది.

అందువల్ల యాపిల్స్ కొనుగోలు చేసేవారు పండు ఆకర్షణ చూసి మోసపోకుండా మార్కెట్లో వ్యాక్స్ కోటింగ్ లేని యాపిల్స్ చూసి కొనటం ఆరోగ్యానికి  ఎంతో మంచిది. అలానే దేశీయ పండ్లను చెట్టు నుంచి కోశాక వాటి సహజత్వం దెబ్బతినకుండా బాక్స్ లలో రవాణా చేస్తుంటారు. నిజానికి రెండో ఫోటోలో ఉన్న యాపిల్స్ ఇలానే ఉంటాయి. కోసిన వాటిని ప్రాసెస్ చేసి వ్యాక్స్ కోటింగ్ వేయకుండా కొంచెం ఆకర్షణీయంగా ఉండేవి మూడో ఫోటోలోనివి. వీటిని తిన్నా నష్టం లేదు. అలా చేస్తే వాటిని నిల్వ చేసే కాలం కొద్దిగా తగ్గుతుంది అంతే. మొత్తం మీద ఏ పండ్లు కొన్నా వాటిని మంచి నీటితో శుబ్రంగా కడిగి తినటం మంచిది.  

సుమారు రూ. 4,500 కోట్ల  విలువైన దేశీయ యాపిల్స్ తో పాటు ఏటా భారతీయ వినియోగదారులు దాదాపు రూ.,2000 కోట్ల విలువైన యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగించే యాపిల్స్  లో 60 శాతం వరకు దక్షిణ భారత దేశంలోనే అమ్ముడుపోతుండటం విశేషం. యాపిల్స్ కొనే దక్షిణ భారత పౌరులూ పారాహుషార్!             (సిమ్లా మిత్రుడు పురుషోత్తమరావు వెలది సహకారంతో)

No comments: