Pages

Thursday 8 December 2011

పాల ఉత్పత్తి పెంపునకు మిల్క్ మిషన్

       రాష్ట్రంలో త్వరలో మిల్క్ మిషన్ ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 22 వేల గ్రామాల్లో తోలి విడతగా సుమారు 3766 గ్రామాల్లో స్వయం సహాయక బృందాల ద్వారా మిల్క్ మిషన్ పధకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రూ.5138 కోట్లు ఖర్చయ్యే ఈ పధకం కింద తొలిదశలో దాదాపు పదిహేనువేల పాల ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో రూ. 491 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం 2 . 98 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. దీన్ని 4 . 96 కోట్ల లీటర్లకు పెంచటం మిల్క్ మిషన్ లక్ష్యం. దీనిలో భాగంగా పాల సేకరణ, మార్కెటింగ్ కోసం తగిన ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. వీటికి తోడు ఒక్కో మండలంలో మినీ డెయిరీలు, నాలుగేసి పాల ప్రగతి కేంద్రాలు  ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తారు. తద్వారా రాష్ట్రంలో 67 శాతం పాల ఉత్పత్తిని పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
                                                         
కరవుతో అల్లాడుతున్న రైతుల్ని ఆదుకునేది పాడి పరిశ్రమే. వ్యవసాయానికి పాడి పంట రెండు కళ్ళు లాంటివి. పంట నష్టపోతే పాడి రైతుల్ని ఆడుకుంటుంది. పశుపోషణ పై రైతులకు శ్రద్ధ తగ్గుతున్నందువల్లనే కరవు కాటకాలు వచ్చిన ప్రతిసారి రైతులు తట్టుకోలేకపోతున్నారు. స్థిరమైన ఆదాయాన్ని అందించే పాడిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రభుత్వం పధకాలను ప్రకటిస్తోందే తప్ప వాటి అమలును పట్టించుకోవడం లేదు. ఫలితంగా మంచి పధకాలు కూడా పనికిరానివిగా మారుతున్నాయి. పశుక్రాంతి పధకమే దీనికి ఒక ఉదాహరణ. ఇప్పటికైనా పాలకులు రైతులకు పశుపోషణ పట్ల ఆసక్తి పెరిగేలా తోడ్పాటును అందించాలి. సబ్సిడీపై దాణాలను అందించి మంచి ధర ఇచ్చి రైతుల్నిప్రోత్సహించాలి. పధకాల అమలులో లోటుపాట్లను సరిద్దుకుంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. పాలకులకు కావలసిందల్లా చిత్తశుద్ది మాత్రమే.

No comments: