గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కిలో కందిపప్పు ధర రూ. 100 అయినప్పుడు గగ్గోలు పెట్టిన నాయకులు నేడు రైతుకు కిలో కందిపప్పుకు కేవలం రూ. 30 ధర వస్తోంటే నోరుమెదపడంలేదని విమర్శించారు. ఉత్పత్తులకు తగిన ధర కల్పించలేని ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా భావించాలా అని ప్రశ్నించారు. తన చేతకాని విధానాలతో రైతుల పరిస్థితిని దిగజార్చిన ప్రభుత్వం, వారిని నిలువునా మోసగిస్తోందని, విద్యుత్ కోతలతో అటు రైతుల్ని ఇటు పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతోందంటూ జేపీ కిరణ్ సర్కారు వైఖరిని తూర్పార పట్టారు. క్షేత్ర స్థాయిలో రైతుల దుర్గతిని పట్టించుకోకుండా ప్రభుత్వం మన్ను తిన్న పాములా వ్యవహరిస్తే రైతుల బాగోగుల్ని ఎవరు పట్టించుకున్తారని నిగ్గదీశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల నికరాదయం తగ్గుతోందని, ఆ మేరకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దున్న పోతుపై వాన పడ్డ చందంగానే ఉంది.
Tuesday, 21 February 2012
ఇది రైతు ప్రభుత్వమా... హవ్వ! - జేపీ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కిలో కందిపప్పు ధర రూ. 100 అయినప్పుడు గగ్గోలు పెట్టిన నాయకులు నేడు రైతుకు కిలో కందిపప్పుకు కేవలం రూ. 30 ధర వస్తోంటే నోరుమెదపడంలేదని విమర్శించారు. ఉత్పత్తులకు తగిన ధర కల్పించలేని ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా భావించాలా అని ప్రశ్నించారు. తన చేతకాని విధానాలతో రైతుల పరిస్థితిని దిగజార్చిన ప్రభుత్వం, వారిని నిలువునా మోసగిస్తోందని, విద్యుత్ కోతలతో అటు రైతుల్ని ఇటు పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతోందంటూ జేపీ కిరణ్ సర్కారు వైఖరిని తూర్పార పట్టారు. క్షేత్ర స్థాయిలో రైతుల దుర్గతిని పట్టించుకోకుండా ప్రభుత్వం మన్ను తిన్న పాములా వ్యవహరిస్తే రైతుల బాగోగుల్ని ఎవరు పట్టించుకున్తారని నిగ్గదీశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల నికరాదయం తగ్గుతోందని, ఆ మేరకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దున్న పోతుపై వాన పడ్డ చందంగానే ఉంది.
Saturday, 18 February 2012
జేపీ పాదయాత్ర -ప్రభుత్వం నేర్వాల్సిన గుణపాఠం
రాష్ట్రంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను కూడా మిల్లర్లు అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బోనస్ సైతం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. "అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు" చందంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మంచి రేటు వచ్చే ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా రైతుల్ని అడ్డుకుంటోంది. రైతులు స్వేచ్చగా ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సిగ్గుచేటు. దీన్ని నిరసిస్తూ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఈ రోజు ఉదయం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్ణాటకలోని గిల్కసూగుర్ వరకు "రైతు సత్యాగ్రహ పాదయాత్ర" చేపట్టారు. వ్యవసాయానికి అయ్యే ఖర్చు 40 నుంచి 50 శాతం పెరిగితే ప్రభుత్వాల విధానాల వల్ల రైతుకు లభించే రేటు 30 - 40 శాతానికి పడిపోయిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించి కర్ణాటకలో ధాన్యాన్ని విక్రయిస్తామని చేతనైతే దీన్ని అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చట్ట విరుద్ద ఆంక్షల్నిఉల్లంఘించడం వినా రైతులకు మరో మార్గం లేదంటున్న జేపీ, తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు మేలు చేస్తే చాలంటున్నారు. జేపీ నిబంధనల్ని ఉల్లంఘించడం అటుంచి కేంద్రం ఆదేశాల్ని అమలు చేయకుండా రైతుల్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శిక్ష వేయాలి..? ఈ పాలకుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షించాలి..?ప్రభుత్వం జేపీ పాదయాత్ర తర్వాతైనా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
Tuesday, 14 February 2012
జీరో బడ్జెట్ వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ సదస్సులు ఆంధ్ర ప్రదేశ్ లో...
సహజ వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ దేశంలో ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోన్న సుభాష్ పాలేకర్ గురించి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సుపరిచితమే. ఆయన అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఆచరించేందుకు మన రాష్ట్రానికి చెందిన కొందరు పాలేకర్ ను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి రైతులకు రెండేళ్లుగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 22 వ తేదీ వరకు తిరుపతిలో జీరో బడ్జెట్ వ్యవసాయం పై ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతి సదస్సు గురించి 09849059573 ఈ నెంబరులో సంప్రదించవచ్చు.
అలానే ఏప్రిల్ 1 నుంచి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో సైతం ఇటువంటి సదస్సు జరగనుంది. హైదరాబాద్ లకడికపూల్ లో ఉన్న మారుతి గార్డెన్స్ లో జరగనున్న ఈ సమావేశానికి ఆసక్తి ఉన్న రైతులు హాజరు కావచ్చు. పర్యావరణ ఉద్యమకారుడు "సేవ్" సంస్థ నిర్వాహకుడు అయిన విజయరాం హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040 - 27654336 నెంబరులో సంప్రదించవచ్చు.
Thursday, 2 February 2012
బాధ్యతల నుంచి వైదొలగటమే జలవిధానమా...?
భవిష్యత్తులో ప్రతి నీటి బొట్టు వినియోగానికి లెక్కలు చెప్పాలని మంగళవారం విడుదలైన జాతీయ జలవిధానం ముసాయిదా నిర్దేశిస్తోంది. ప్రస్తుతం సేవలు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా సేవలు నియంత్రించే సంస్థలుగా మారాలంటోంది. ఇప్పటికే తక్కువగా ఉన్న జల విద్యుత్ ధరలను పునః సమీక్షించాలంటోంది. నీటి సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసాన్ని తగ్గించాలన్నది ఈ ముసాయిదాలోని మరో కీలకాంశం. రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి పనిచేస్తున్న పలు ట్రైబ్యునళ్ళ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఒకే ట్రైబ్యునల్ ఉండాలని ముసాయిదా ప్రతిపాదించింది. ఫెడరల్ విధానాన్ని తుంగలో తొక్కి దేశం మొత్తం ఒకే జలవిధానం అంటూ సరళీకరణ ఆర్ధిక విధానాలను మరింతగా రాష్ట్రాలపై రుద్డటమే లోగుట్టనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రణాలికా సంఘం ఉచిత విద్యుత్తుపై ఆక్రోశం వెళ్ళగక్కిన నేపధ్యంలో కొత్త జలవిధానం అమలైతే రాష్ట్ర రైతులకు ఉచిత విధ్యుత్ అందే అవకాశం ఉండకపోవచ్చు. అలానే భూగర్భ జలాలకు సెస్సు వసూలు చేయాలని పేర్కొన్న దృష్ట్యా కేంద్రం ఆమ్ ఆద్మీని కాల్చుకుతినే ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని స్పష్టమవుతోంది.
అలానే నీటిని ప్రైవేటీకరిస్తే ప్రతి చుక్క నీటిని లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే అవకాశముంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. నీటిని అందించలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని గతంలో సుప్రీంకోర్ట్ చేసిన వ్యాఖ్యలతోనైనా పాలకులకు జ్ఞానోదయం కాకపోవడం నేటి విషాదం. మొత్తానికి నీటిని ఆర్ధిక వస్తువుగా గుర్తించి సమర్ధ వినియోగానికి పెద్ద పీత వేయాలన్నదే ఈ జాతీయ జల విధానం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
Sunday, 29 January 2012
"శ్రీ" వరి సాగులో బీహార్ రైతుల ప్రపంచ రికార్డ్
బీహార్ కు చెందిన ఐదుగురు రైతులు సాధించిన అపూర్వ విజయమిది. వీరంతా చైనాకు చెందిన ఒక రైస్ బ్రీడర్ సాధించిన ప్రపంచ రికార్డును తిరగ రాశారు. వరి సాగులో ఈ రైతులు సాధించిన విజయం వెనుక అక్కడి వ్యవసాయ అధికారుల కృషి ఎంతో ఉంది. బీహార్లోని నలంద జిల్లా కత్రిసరాయ్ బ్లాక్ లోని దార్వేష్ పురా అనే ఓ మారుమూల గ్రామం ఈ ప్రపంచ రికార్డ్ కు వేదిక కావడం విశేషం. ఈ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు " శ్రీ " సాగు పద్ధతిలో (సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్) వరి సాగు చేసి హెక్టారుకు 224 క్వింటాళ్ళ (22 .4 టన్నులు) ధాన్యం దిగుబడిని సాధించారు. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన యువ రైతు సుమంత్ కుమార్ ఈ రికార్డ్ ను సాధించిన రైతుగా ప్రపంచ ఖ్యాతిని అందుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ అనే రైతు 220 క్వింటాళ్ళు., నితీష్ కుమార్ అనే రైతు 196 క్వింటాళ్ళు., రామానంద్ సింగ్ 192 క్వింటాళ్ళు., సంజయ్ కుమార్ 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించడం అపూర్వం. వీరిలో ఒకరు మాత్రం గతంలో చైనా నెలకొల్పిన రికార్డును సమం చేయగా మిగిలిన నలుగురూ దాన్ని బ్రేక్ చేశారు. చైనాకు చెందిన యాన్ లాంగ్ పింగ్ అనే రైస్ బ్రీడర్ 2004 లో DH-2525 అనే వరి వంగడాన్ని వాడి హెక్టారుకు 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి రికార్డ్ ను నెలకొల్పాడు. ఇతన్ని చైనాలో " ఫాదర్ అఫ్ హైబ్రిడ్ రైస్ " గా పిలుస్తారు.
బీహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్
అరవింద్ సింగ్., జిల్లా వ్యవసాయాధికారి సుధామ మహతో తదితరులు సుమంత్ అతని
సహచరుల పొలాలకు వెళ్లి స్వయంగా ఈ రికార్డ్ దిగుబడికి నెలవైన పంట పొలాలను
పరిశీలించి వచ్చారు. నలంద జిల్లాలో 2008 లో మొదలైన " శ్రీ " సాగు విధానం వల్ల దాదాపు 25 వేల మంది రైతులు నేడు ఈ పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. తమ రైతులు సాధించిన ఈ విజయాలతో పొంగిపోయిన బీహార్ డైనమిక్ ముఖ్యమంత్రి
నితీష్ కుమార్ దేశంలో రెండో హరిత విప్లవం బీహార్ నుంచే ప్రారంభమవుతుందని
చెబుతున్నారు.
నిజానికి బీహార్ లో "శ్రీ " వరి సాగులో ఇంత విప్లవం రావడం వెనుక మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన సహకారం కొంత ఉంది. 2003 లో ఒక రకంగా దేశంలో తొలిసారిగా మన రాష్ట్రం "శ్రీ " వరి సాగుకు శ్రీకారం చుట్టింది. 1983
లో మడగాస్కర్లో ప్రపంచంలో తొలిసారి "శ్రీ " సాగు పద్దతి మొదలయ్యాక నేడు
విశ్వ వ్యాప్తమైంది. మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ
పద్ధతిని పాటించాక దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నుంచి స్పూర్తిని పొందాయనే
చెప్పాలి. అప్పట్లో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా ఉన్న డాక్టర్
ఆలపాటి సత్యనారాయణ అప్పటికే శ్రీలంక లో సాగులో ఉన్న "శ్రీ" సాగు
విధానాన్ని పరిశీలించి వచ్చి మన రాష్ట్రంలో ఈ పద్దతిని ప్రోత్సహించారు.
వారి కృషి వల్ల " శ్రీ" సాగు అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచింది. 2004 లో రాష్ట్రానికి చెందిన గుడివాడ నాగరత్నం నాయుడు అనే రైతు హెక్టారుకు సుమారు 17 . 25 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి జాతీయ స్థాయిలో ఆదర్శ రైతుగా నిలిచారు.
అదే
కాలంలో బీహార్ రాజధాని పాట్నా లో ఉన్న Directorate of rice Developement
డైరెక్టర్ గా ఉన్న దివాకర్ మన విశ్వవిద్యాలయానికి వచ్చి " శ్రీ " సాగులో
శిక్షణ పొంది, మెలకువలు తెలుసుకుని తన రాష్ట్రంలో ఈ పధ్ధతి వ్యాప్తికి ఎంతో
కృషి చేశారు. దీని ఫలితంగా నేడు బీహార్లోని ఒక్క నలందా జిల్లాలోనే 90 శాతం
మంది రైతులు "శ్రీ " పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 2005 లో
సత్యనారాయణ గారు పదవీ విరమణ చేశాక " శ్రీ " సాగు వ్యాప్తి గురించి
విశ్వవిద్యాలయంలో ఆశించిన మేరకు కృషి జరగలేదు. వ్యవసాయ శాఖతో సహా ఎవరూ
పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా మన రాష్ట్రంలో ఈ పద్దతిని పరిశీలించిన
బీహార్, బంగ్లాదేశ్, అస్సాం, బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు "
శ్రీ " సాగుతో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తే.,
మన రైతులు మాత్రం ఆరేళ్ళు గడిచినా "శ్రీ" వ్యాప్తికి ముందుకు సాగలేక
పోయారు. సత్యనారాయణ గారు అందించిన సహకారంతో పాటు స్వయం కృషితోనే నాగరత్నం
నాయుడు వరి సాగులో అధిక దిగుబడులు సాధించగలిగారు. నేడు ఆయన ఒక్కరే "శ్రీ "
పద్దతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా తోటి రైతులకు
సేవలందిస్తున్నారు.
సుమంత్ అనే యువ రైతు సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుందాం. Friday, 27 January 2012
ఇన్నాళ్ళకు కరవు బృందం వస్తుందట!
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సుమారు 34 .24 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ లో మొదలైన కరవు నేటికీ రబీ లోనూ కొనసాగుతుండటం రైతుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రైతుకు అంతకు మించిన విచారం ప్రభుత్వ సహాయ నిరాకరణ రూపంలోనూ ఎదురైంది. ఖరీఫ్ కరవు పరిస్థితులపై కేంద్రానికి నివేదించిన రాష్ట్రం తగిన సహాయాన్ని పొందటంలోనూ, స్వయంగా రైతులకు తానూ సహాయం చేయడంలోనూ విఫలమైంది. కరవు తీవ్రతను తెలుసుకునేందుకు, రైతులకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఫిబ్రవరి 5 న రాష్ట్రంలో పర్యటించనుంది. కరువొచ్చిన ఆర్నెల్లకు కేంద్ర బృందం ఏం చూసి రైతుకు సహాయ పడుతుందో ఏలిన వారికే తెలియాలి.
గత కొన్నేళ్లుగా రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం మాని చేష్టలుడిగి చూస్తున్నాయి. కేంద్రం సైతం ఆంధ్ర ప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపుతోంది. ఇటీవల "థానే" తుపాన్ దెబ్బ తగిలిన తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయంగా రూ. 600 కోట్లు ప్రకటించింది. అటువంటి భారీ నష్టాలను ఇటీవలి కాలంలో తరచుగా చవిచూసిన ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోంది. కోరిన సాయంతో పోల్చితే ముష్టి విదిల్చినట్టు నామమాత్రపు సాయం ప్రకటిస్తున్న కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రైతుల జీవితాలతో ఆటలాడుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతు శ్రేయాన్ని గాలికి వదిలేసింది. రైతాంగం ఇంత తీవ్ర కరవు కష్టాల్లో ఉండగా వారిని ఆదుకునేందుకు నోరు మెదపని మన ఎంపీలను ఏం చేయాలి...? రాజకీయాలు లేదా వారి సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప వీరు ప్రజలకు చేస్తున్నదేమిటి..? వీరి నిర్లక్ష్యానికి తగిన జవాబు చెప్పేందుకు రైతులు సంసిద్ధం కావాలి. రైతులకు ఇచ్చే పరిహారంలోనూ వాటాలు పంచుకునే నీతిలేని నాయకులకు పార్టీలకు అతీతంగా రైతులు గట్టి జవాబు చెప్పాలి.
Monday, 16 January 2012
"ఉచిత" డ్రామాలొద్దు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కూడా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్, రుణాల మాఫీతో రైతుల్ని, చేనేత వర్గాలను బుట్టలో వేసుకోవాలని తపిస్తున్నారు. భారతీయ రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదిస్తారే తప్ప రాజకీయ నాయకుల్లా తేరగా వచ్చే వాటికి ఆశపడరు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డీ కరిచే నేతలు రైతుల కోసం ఉచిత వాగ్దానాలను ఇవ్వటం కంటే రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావడం లేదు..? పంట పండించేందుకు అవసరమయ్యే ఉత్పాదకాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి..? అసలవి అందుబాటులో ఉన్నాయా..? గిరాకీ సరఫరాకు తగిన రీతిలో ఉత్పత్తి వస్తోందా.. లేక ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారా.. అటువంటి సందర్భాల్లో మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని ఏ మేరకు ఆదుకుంటోంది ..? అలానే ఉత్పత్తికి విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఏ మేరకు కల్పిస్తోంది..? దేశంలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న వ్యవసాయ దిగుమతుల పై సుంకాలు విధించి దేశీయ రైతులకు తగిన రక్షణలు కల్పిస్తోందా...? తద్వారా మన రైతులకు మంచి ధరలు వచ్చేలా చూస్తోందా... ? ఇక్కడ ఒక్క ములాయం గురించే కాదు ఉచిత వాగ్దానాలతో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వారి పరిస్థితిని దిగజార్చే ప్రతి పార్టీకీ., ప్రతి నాయకునికీ ఈ విమర్శ వర్తిస్తుంది. నేతలూ గుర్తుంచుకోండి... మీ ఉచిత వాగ్దానాలతో ప్రజల్ని సోమరుల్లాగా మార్చకండి. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయకండి. మన నేతలు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు పైన పేర్కొన్న వన్నీ చేస్తే ఉచిత వాగ్దానాలు ఇచ్చి రైతుల్ని మోసగించాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఫలితాన్నివ్వండి చాలు. రైతుకు అదే పదివేలు.
Subscribe to:
Posts (Atom)










