Tuesday, 25 October 2011
Friday, 14 October 2011
మండుతున్న రైతు గుండెలు!
తెలంగాణా లోని నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాలకు తోడు తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం,కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తాజా నివేదిక చెబుతోంది. తీవ్ర ఎండలు ప్రజలకు వేసవి తాపాన్ని రుచి చూపిస్తుంటే, ఇప్పటికే వేసిన పంటలు ఎండి పశువులకు గ్రాసంగా వాడాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 701 .8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ నెల 12 వ తేదీ నాటికి కేవలం రాష్ట్రంలో 556 మి. మీ. (21 శాతం తక్కువ) మాత్రమే వర్షం కురిసింది. దాదాపు 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరి, వేరుసెనగ,మొక్కజొన్న, పత్తి, తదితర పంటలు ఎండి రైతులు పంటల్ని తగులబెట్టుకోవాల్సి వస్తోంది.
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంటే, విద్యుత్ కోతలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. పంట కీలక దశలో ఉండగా వర్షాభావం రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. ప్రభుత్వ వైఖరి రైతుల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న 'ప్రత్యేక' పరిస్థితులపై స్పందించడంలో విఫలమవుతున్న పాలకులు, తమ చేత కాని తనాన్ని రైతుల విషయంలోనూ నిరూపించు కుంటున్నారు. ఇప్పటికే ధర లేక, నిల్వ వసతులు లేక, ఎరువులు దొరక్క, వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నిరాశలో ఉన్న రైతుల్ని సక్రమంగా విద్యుత్ సరఫరా ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం పదే పదే విఫలమవడం రైతుల స్థితిని మరింత దుర్భరం చేస్తుండటం విషాదం.
Wednesday, 5 October 2011
దసరా శుభాకాంక్షలు
బ్లాగు మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అంటే పది రాత్రులని అర్ధం. నిజానికి నవరాత్రులు...అంటే తొమ్మిది రాత్రులు. చివరి రోజయిన దశమి తిధి తో కలిపి మొత్తం పది రోజులు. ఈ పండగ శరత్కాలంలో వస్తుంది. అందుకే శరన్నవరాత్రులు అయ్యాయి. ఆశ్వయిజ మాసంలోని శుక్ల పక్షంలో మొదటి దినమైన పాడ్యమి నుంచి నవమి దాకా జరిపేవే శరన్నవరాత్రులు. వీటినే శారద నవరాత్రులని కుడా అంటారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే వరుసలో నవరాత్రి పూజలు జరుగుతాయి. వీటిని దేవీ నవరాత్రులని కుడా వ్యవహరిస్తారు. వసంత కాలంలో కాకుండా శరత్కాలంలో చేసే దేవీ ఆరాధన అయినందున ఈ పండగను అకాల్ బోధన్ అని బెంగాలీయులు అంటారు. అత్యాశ, గర్వం, కోపం, దురాశ, ఆకర్షణ, మోహం, ద్వేషం, అసూయ, స్వార్ధం, క్రూరం.... ఈ దశ దుర్గుణాలను చిహ్నంగా భావించే పది తలల రావణ సంహారాన్ని పలు ప్రాంతాల్లో విజయ దశమిగా జరుపుకుంటున్నాము. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మరోసారి శుభాకాంక్షలు.
Thursday, 29 September 2011
ఈ దోపిడీ ఎన్నాళ్ళు!
రేపటి నుంచి మళ్ళీ ఎరువుల ధరలు పెరుగుతున్నాయనే విషయం రైతుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తి వేశాక ఈ ఏడాది ఇప్పటికి ఎరువుల ధరలు పైకి ఎగబాకటం ఇది పదమూడోసారి. తాజాగా డి.ఏ.పి., కాంప్లెక్స్ ధరలు బస్తాకు వంద నుంచి రూ.250 దాకా పెరగటం రైతుల్ని మరింత కుంగదీసింది. తాజా పెంపుతో రైతులపై సుమారు రూ. 500 కోట్ల భారం పడుతోంది. కేవలం వారం రోజుల్లోనే కంపెనీలు ఇలా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం నోరు మెదపకపోవడం పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ధరల పెంపుదలకు రూపాయి విలువ పెరగటమే కారణమని కంపెనీలు చెప్తున్నాయి. ఖరీఫ్ లో రైతులు గొడవ చేసినా పట్టించుకోని పాలకులు నేడు తీరికగా రబీ ప్రారంభమయ్యే నాటికి పోటాష్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి ఆనాడే దిగుమతి చేసుకుని ఉంటే నేడు ధరలు అదుపులో ఉండేవి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు అధిక ధరల భారం మోయాల్సి వస్తోంది.
ఏది ఏమైనా చితికిన రైతుల్ని ఇంకా ఇంకా నష్ట పరిచే విధానాల వల్ల సేద్యం మరింత దిగజారుతుందని పాలకులు గ్రహించాలి. పండించిన పంటకు ధరల్ని నిర్ణయించుకునే స్వేచ్చ రైతుకు లేకుండా జాగ్రత్త పడుతున్న పాలకులు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి.. ఈ దేశంలో రైతులు ఆగ్రహిస్తే మీకు మింగ మెతుకుండదని గ్రహించి మెలగండి. వ్యవసాయ ప్రధాన దేశంలో మునుముందు రైతులు తిరగబడే పరిస్థితి తెచ్చు కోవద్దనేది పాలకులకు మరోసారి హితవు. నా పిచ్చి గాని ఈ చెవిటి పాలకులు తమ తప్పుల్ని గుర్తిస్తారంటారా....? ప్చ్...!
Wednesday, 28 September 2011
రైతు నేత నాగేంద్రనాథ్ నిరాహారదీక్ష
శరద్ పవార్ కి వినతి పత్రం ఇస్తున్న శ్రీ యెర్నేని
రైతు సంక్షేమానికి నిరంతర పోరాటం చేస్తూ రైతాంగ సమాఖ్య అధ్యక్షులుగా ఉన్న యెర్నేని నాగేంద్రనాథ్ 100 గంటల నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఎన్నో రైతు సేవా కార్యక్రమాలతో రైతు సమస్యలు తెలుసుకుని రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్న కృషీవలుడు, నిరాడంబరుడు యెర్నేని కొంత కాలంగా పంట విరామంపై ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. పంట విరామం ప్రకటించిన రైతులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ ఖర్చులకు అదనంగా 50 శాతం చేర్చి మద్దతు ధర నిర్ణయించాలని, 60 ఏళ్ళు నిండిన రైతులకు రెండు వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, ఎగుమతి, దిగుమతి విధానాల విషయంలో రైతుకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని.... ఇలా రైతు శ్రేయం కోరే పలు డిమాండ్లతో నాగేంద్రనాథ్ దీక్షకు దిగుతున్నారు.
ధరల విషయంలో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే విధానంలో రైతుకు స్వాతంత్ర్యం లేనందున మరో రైతు స్వాతంత్ర్య పోరాటానికి నాందిగా ఈ దీక్ష చేస్తున్నానని యెర్నేని గారు బుధవారం అమలాపురం వెళ్లబోయే ముందు ఈనాడు ఆఫీసులో నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. తన పోరాటానికి మీడియా మద్దతు కోరారు. యెర్నేని గారు అక్టోబర్ 2 గాంధి జయంతి రోజు అమలాపురంలో దీక్ష ప్రారంబించి 100 గంటల పాటు కొనసాగిస్తానని అక్టోబర్ 6 వ తేదీన దీక్ష ముగుస్తుందని తెలిపారు. ఆరుగాలం కృషికి తగిన ప్రతిఫలం కోరుతూ రైతులు దీక్షలకు దిగాల్సిన పరిస్థితి రావడం శోచనీయం. రైతులు సంఘటితమైతే ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించకపోవడం సిగ్గుచేటు. కళ్ళున్నా రైతుల కష్టాలు చూడలేని పాలకులు, నేతలు ఉన్న ఈ పరిస్థితుల్లో యెర్నేని తన ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాను. రైతుల దయనీయ పరిస్థితిని గమనించి వారికి మేలుచేసే సంస్కరణలు తీసుకురావాలని మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. యెర్నేని గారు అల్ ది బెస్ట్.
Thursday, 22 September 2011
ఎరువుల ధరలు ఎన్ని సార్లు పెంచుతారు?
కష్టాల్లో ఉన్న రైతుల్ని గట్టెక్కించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కందా కమిటీ వేసింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్లనే రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదని ఇలాంటి కమిటీలెన్నో చెప్పాయి. పంటలు సాగు చేసిన రైతుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడ్డారు. రైతుకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచడంలో సర్కారు చేతులెత్తేసింది. మరోవైపు కంపెనీలు ఎరువుల ధరల్ని పెంచేసి రైతుకు పెద్ద షాక్ ఇచ్చాయి. తాను పండించిన పంటను ఎంత ధరకు విక్రయించుకోవాలో స్వేచ్చలేని రైతులు విత్తనాల నుంచి ఎరువుల వరకు ఇష్టానుసారం ధరలు పెంచుతున్న కంపెనీల తీరుతో నేడు తల్లడిల్లిపోతున్నాడు. కాంప్లెక్స్ బస్తాపై రూ.188 , పోటాష్ పై రూ. 192 వరకు గరిష్టంగా పెంచారు. ఫలితంగా రైతులపై సుమారు రూ. 350 కోట్ల మేర అదనపు భారం పడనుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎరువుల ధరలు ఇప్పటికే ఐదు సార్లు పెరగటం గమనార్హం. సేద్యం గిట్టుబాటు కాక రైతులు నష్టపోతుంటే ఇష్టానుసారం కంపెనీలు పెంచుతున్న ధరలను ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోతుండటం శోచనీయం. రాష్ట్ర సర్కారు పెంచిన వ్యాట్ తో ఇప్పటికే ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్న రైతులకు ఈ పరిణామం మరింత నిరాశ కలిగించింది. కష్టాల కడగండ్లతో ఖరీఫ్ ను ఆరంభించిన అన్నదాతలకు తాజాగా పెరిగిన ధరలతో రబీ సీజన్ పెను భారం కానుండటం విషాదం.
Wednesday, 21 September 2011
కాలయాపనకే రైతు కమిటీలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి కమిటీలు వేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులనే నేటికీ అమలు చేయని కేంద్రం, జయతిఘోష్ సహా పలు కమిటీల సూచనలను పట్టించుకోకుండా మన పాలకులు ఆడుతున్న దొంగాటకాన్ని ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ప్రచురితమైన నా వ్యాసం లో ఎండగట్టటం జరిగింది. స్కాన్ చేసిన ఆర్టికల్ ఇక్కడ లింక్ చేస్తున్నాను. చూడగలరు.

Subscribe to:
Posts (Atom)






