Pages

Friday, 3 November 2017

పత్తి మార్కెట్‌ సమీక్ష

పత్తి పంట మార్కెట్లకు వస్తోంది. తేమ శాతం సాకుగా చూపి వ్యాపారులు రైతుల్ని దోచుకుంటున్నారు. కేంద్ర పత్తి సంస్ధ (సిసిఐ) పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు అంతర్జాతీయంగా పత్తి మార్కెట్లలో ధరల పోకడలు ఎలా ఉన్నాయి., ఫ్యూచర్స్‌ ధరల్లో కదలికలు., నాణ్యమైన పత్తికి  కనీస మద్ధతు ధర కంటే ధర ఎక్కువ పలుకుతుందా., తగ్గుతుందా అన్న విషయాలను సమీక్షిస్తూ ఈ నెల అన్నదాత మాసపత్రికలో  రాసిన నా వ్యాసమిది.
                                                                 

తేనెటీగల యూనిట్‌తో అదనపు ఆదాయం

సేద్యం లాభసాటి కాని పరిస్థితుల్లో రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించాల్సిన అవసరముంది. వ్యవసాయంతో పాటు పశుపోషణ, పట్టు, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకాన్ని చేపట్టగలిగితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ధిరమైన ఆదాయాలను అందుకోవచ్చు. నవంబరు అన్నదాత మాసపత్రికలో విజయరాయి పరిశోధన కేంద్రం (ప.గో) సహకారంతో తేనెటీగల యూనిట్‌ ఏర్పాటుతో రైతులకున్న అదనపు ఆదాయ అవకాశాల గురించిన వ్యాసం అందించాను.
                                                                         


Wednesday, 1 November 2017

"అన్నదాత" సారథ్యం

                                                                     


నిన్నటి నుంచి "అన్నదాత" వ్యవసాయ మాసపత్రిక బాధ్యతలు స్వీకరించాను. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తా చానళ్ల అసోసియేట్ చీఫ్ ప్రొడ్యూసర్ బాధ్యతలకు ఇది అదనం. 35 ఏళ్లపాటు అన్నదాత కు సంపాదకులు గా పనిచేసి మొన్నపదవీ విరమణ చేసిన డాక్టర్ వాసిరెడ్డి నారాయణ రావు గారి స్థానంలో పనిచేయడం నిజంగా సవాలే! వ్యవసాయమంటే ఇష్టపడే నాకు, దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన అన్నదాత పత్రిక బాధ్యతలు అప్పగించిన మా ఛైర్మన్ శ్రీ రామోజీరావు గారు, మా ఎండీ కిరణ్ గార్లకు కృతజ్ఞతాభివందనాలు.

Saturday, 28 October 2017

డా.రఘోత్తమరెడ్డి వ్యవసాయ పురస్కారం

                                                                     




డాక్టర్‌ జెన్నారెడ్డి రఘోత్తమరెడ్డి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఉపకులపతుల్లో వారొకరు. మల్యాల (వరంగల్‌) లోని వందలాది ఎకరాలను వ్యవసాయ పరిశోధనలకు రాసిచ్చిన రైతు బాంధవుడు. అలాంటి మహానుభావుని స్మారకార్ధం వ్యవసాయ జర్నలిజంలో విశేష కృషి చేసిన వారికిచ్చే అవార్డును నాకు బహుకరించడం ఎంతో సంతోషం కలిగించింది.అన్నదాత సంపాదకులు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు(2012లో) గారి తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిని నేను. నా పాత్రికేయ జీవన పురోగతిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు.

Sunday, 6 August 2017

రైతులతో ప్రకృతి దొంగాట!

వర్షాభావం తెలుగు రాష్ట్రాల రైతుల్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతులపై ఈ ప్రభావం అధికం. ఏటా తొలకరిలో మురిపించి జూలై, ఆగస్టులలో మొహం చాటేస్తున్న వర్షాల కారణంగా పంటల ప్రణాళికలను ముందుకు మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మేలో స్వల్పకాలిక పెసర వంటి పంటలు వేసుకుంటే నాట్లు పడేలోగా ఒక పంట తీసేయవచ్చు. ఈ దిశగా రైతులకు దిశానిర్ధేశం చేయాలంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                        

Tuesday, 9 May 2017

రైతులెందుకు దీనావస్ధలో ఉన్నారు?

స్వాతంత్ర్యం వచ్చాక నేటికి మన దేశం అన్ని రంగాలలో ఎంతో పురోగమించిన మాట వాస్తవం. కొనుగోలు శక్తి పరంగా పటిష్టమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగిన తొలి 5 దేశాల్లోనూ మనం చోటు సాధించాం. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సాధిస్తున్న మన మిలియనీర్ల సంఖ్యా ఏటికేడూ అధికమవుతోంది.  వ్యవసాయరంగంలోనూ విప్లవాత్మక మార్పులెన్నో చోటు చేసుకున్నాయి. కానీ ఒక్కటే ప్రశ్న.    రైతులెందుకు దీనావస్ధలో ఉన్నారు.., వారెందుకు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోంది..? మట్టినే నమ్ముకున్నవారిని పట్టిపీడిస్తున్న ఈ ప్రశ్నకు స్వాతంత్ర్యానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జవాబు చెప్పలేకపోవడాన్ని ఏమనాలి? రైతు దీనస్థితికి దారితీస్తున్న పరిస్థితుల్ని విశ్లేషించి వాటికి పలు పరిష్కారాలు సూచించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                      

Saturday, 29 April 2017

జలరంగ మేధావి విద్యాసాగరరావు

                                                                               


                                                                        
నీటిపారుదల రంగంలో ఎందరో ఇంజనీర్లు పనిచేశారు., పదవీ విరమణ చేశారు. కొద్ది మంది మాత్రం ఆ రంగంపై ఎనలేని ముద్ర వేశారు. ఇప్పటికే నీటిపారుదలరంగ దిగ్గజం టి. హనుమంతరావు గారి మరణంతో కోలుకోలేని స్థితిలో ఉన్న తెలుగు రాష్ట్రాలు విద్యాసాగరరావు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయి. సాగరన్న మరణంతో తెలుగు రాష్ట్రాలే కాదు యావత్‌ దేశం ఒక గొప్ప ఇంజనీరింగ్‌ మేధావిని కోల్పోయింది. ఈనాడు లో పనిచేస్తున్న కాలం నుంచి నేటి నా ఈటీవీ ప్రస్థానం వరకు ఈ మేధావులతో ఏర్పడ్డ పరిచయం నాకు నీటిపారుదల రంగంపై ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసింది. ముఖ్యంగా హనుమంతరావు, విద్యాసాగరరావు, చెరుకూరి వీరయ్యలతో ఏర్పడిన అనుబంధం ఆ రంగంపై నాకు ఎంతో పట్టు వచ్చేలా చేసింది.
2009 ఎన్నికలప్పుడు వైవెస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో సాగిస్తున్న ధనయజ్ఞాన్ని విద్యాసాగరరావు గారు నాకు ఒక రెండు గంటల పాటు చెప్పుకుంటూ పోయారు. అవన్నీ వాయిస్‌ రికార్డు చేసి వాటిని టైప్‌ చేస్తే అదొక పెద్ద పుస్తకం అయింది. ఇప్పటికీ అది నా వద్ద భద్రంగా ఉంది. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి లోటుపాట్లను సరిచేయడం ద్వారా నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి మలికిలేని వ్యవస్థ కోసం ఆయన తపించిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. అప్పటి నుంచి వారితో ఏర్పడ్డ సాన్నిహిత్యం ప్రతిధ్వని చర్చలకు వారిని ఆహ్వానిస్తూ ఇటీవలి వరకూ కొనసాగింది.

సాగరన్నా నువ్వు లేని తెలంగాణ చిన్నబోయింది. తెలంగాణ ఉద్యమానికి నువ్వు అందించిన చేయూత ఈ జాతి ఎప్పటికీ మర్చిపోదు. నీటిపారుదల రంగానికి నువ్వందించిన సేవల్ని తెలుగు జాతితో సహా ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.భౌతికంగా మమ్మల్ని వదిలి మీరు వెళ్లిపోయినా మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను.