Pages

Tuesday, 29 July 2014

యాపిల్స్ కోనేవారూ పారాహుషార్ !

                                                                             



ఈ రెండు ఫోటోలను జాగ్రత్తగా గమనించండి. మొదటి ఫోటో లోని యాపిల్స్ నిగ నిగ మెరిసిపోతున్నాయి కదూ! ఇక రెండో, మూడో ఫోటోలను చూడండి... ఎలాంటి  ఆకర్షణ లేకుండా ఉన్న ఈ యాపిల్స్ కంటే మొదటి ఫోటోలోని యాపిల్స్ కొనడానికే వినియోగదారులు ఇష్టపడుతుంటారు. నిజానికి మన సిమ్లా లో విరివిగా పండే యాపిల్స్ రెండు, మూడు ఫోటోలలోనివే. మొదటి రకం యాపిల్స్ విదేశీ యాపిల్స్. విదేశీ యాపిల్స్ ఇంతలా మెరిసిపోవడం వెనుక వాటికి వ్యాక్స్ కోటింగ్ వేస్తారని మీకు తెలుసా?

గిరాకీకి తగ్గ సరఫరా మన దేశంలో లేకపోవడం వల్ల మనం యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ లోని కొంత భాగంలో పండే దేశీయ యాపిల్స్ ఏటా ఆగస్ట్ నెల నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, చిలీ, ఇరాక్ (వయా ఆఫ్ఘనిస్తాన్) చైనా ల నుంచి మన దేశంలోకి యాపిల్స్ యథేచ్చగా వచ్చిపడుతున్నాయి. యాపిల్స్ నిల్వ కాలాన్ని దాదాపు  10 నెలల వరకు పెంచాలంటే ప్రాసెస్ చేసిన పండ్లకు విదేశాల్లో ఎగుమతిదారులు ఎంచుకునే మార్గం వ్యాక్స్ కోటింగ్. ఇలా చేయటం వల్ల అవి తినేవారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ పండ్ల తోలు తీసి తిన్నప్పటికీ సమస్యలు వెంటాడే ప్రమాదముంది.

అందువల్ల యాపిల్స్ కొనుగోలు చేసేవారు పండు ఆకర్షణ చూసి మోసపోకుండా మార్కెట్లో వ్యాక్స్ కోటింగ్ లేని యాపిల్స్ చూసి కొనటం ఆరోగ్యానికి  ఎంతో మంచిది. అలానే దేశీయ పండ్లను చెట్టు నుంచి కోశాక వాటి సహజత్వం దెబ్బతినకుండా బాక్స్ లలో రవాణా చేస్తుంటారు. నిజానికి రెండో ఫోటోలో ఉన్న యాపిల్స్ ఇలానే ఉంటాయి. కోసిన వాటిని ప్రాసెస్ చేసి వ్యాక్స్ కోటింగ్ వేయకుండా కొంచెం ఆకర్షణీయంగా ఉండేవి మూడో ఫోటోలోనివి. వీటిని తిన్నా నష్టం లేదు. అలా చేస్తే వాటిని నిల్వ చేసే కాలం కొద్దిగా తగ్గుతుంది అంతే. మొత్తం మీద ఏ పండ్లు కొన్నా వాటిని మంచి నీటితో శుబ్రంగా కడిగి తినటం మంచిది.  

సుమారు రూ. 4,500 కోట్ల  విలువైన దేశీయ యాపిల్స్ తో పాటు ఏటా భారతీయ వినియోగదారులు దాదాపు రూ.,2000 కోట్ల విలువైన యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగించే యాపిల్స్  లో 60 శాతం వరకు దక్షిణ భారత దేశంలోనే అమ్ముడుపోతుండటం విశేషం. యాపిల్స్ కొనే దక్షిణ భారత పౌరులూ పారాహుషార్!             (సిమ్లా మిత్రుడు పురుషోత్తమరావు వెలది సహకారంతో)

Monday, 7 July 2014

రైతుల ఆశల్ని మోడీ తీరుస్తారా?

యూపీయే పాలనా కాలంలో అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అస్తవ్యస్త నిర్ణయాలతో దేశంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది.  రైతుల ఆత్మహత్యలు విపరీత స్థాయికి చేరాయి. ఈ తరుణంలో ఢిల్లీ పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడి ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్ లో రైతులకు వ్యవసాయంపై భరోసా పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. సమస్య మూలాలకు చికిత్స ఎంత ముఖ్యమో, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమూ అంటే ప్రధానం. ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్నిఇక్కడ లింక్ చేస్తున్నాను.
                                                                             

Sunday, 1 June 2014

జయహో తెలంగాణ

                                                       
పోరాటాలు ఫలించాయి...
ఆకాంక్షలు నెరవేరాయి...
తెలంగాణ కల సాకారమైంది
29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన
ఈ శుభదినోత్సవ వేళ....
యావత్ తెలంగాణ ప్రజలకు....
తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన....
కె. చంద్రశేఖరరావు  గారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు.

Friday, 16 May 2014

జయహో బాబు-మోడీ

బాబు-మోడీ జోడీది చారిత్రాత్మక విజయం. అవినీతిపరుల్ని కుంభకోణాలకు పాల్పడిన వారిని పార్టీలకు అతీతంగా ఓడించిన తీరు చూస్తుంటే.,  ప్రజలెంత కసిగా కాంగ్రెస్ ను, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ను మట్టికరిపించారో చూస్తేనే తెలుస్తోంది. అలానే పోటెత్తిన ఉద్యమం నుంచి ప్రభవించిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పార్టీకి ఘనవిజయం అందించడం చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతగా స్వపరిపాలన కోరుకున్నారో అర్ధమవుతోంది.ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను ఇరు రాష్ట్రాల ప్రజలు రెండు కళ్ళు పొడిచేసారు.  కన్నూమిన్నూ కానక సమాజాన్ని లెక్కపెట్టక ఇష్టానుసారం వ్యవస్థలను దోపిడీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. జగన్ తో కలిపి నీ కిది నా కిది లో పాలుపంచుకున్న వారంతా దాదాపుగా ఓటమి పాలవటం చూస్తే, వేల కోట్లు దోచుకున్న వారిపై ఇది ప్రజల విజయంగా చెప్పాలి. ఈ తీర్పు దోపిడీ రాజకీయాలకు, అవినీతిపరులకు చెంప పెట్టు మాత్రమె కాదు చావుదెబ్బ కూడా. 
                                                                                                                                                                 


Wednesday, 30 April 2014

వ్యవస్థలతో పాటు వ్యవసాయాన్నీ దోచేశారు!

వ్యవసాయాన్ని పండగ చేస్తామన్న పాలకులు తమ దుర్నీతితో రైతు బతుకుల్ని ఛిద్రం చేశారు. గడచిన పదేళ్ళలో సేద్యంలో ఉత్పత్తి  పెరుగుదల నమోదైనా ఆ మేరకు రైతుల నికరాదాయం ఏ మాత్రం పెరగకపోవటమే ఇందుకు నిదర్శనం. దేశంలో 45 శాతం రైతులు అప్పుల్లో ఉంటె, ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 82 శాతంగా ఉందని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.  దీన్ని బట్టి వ్యవసాయం పండగ  అంటే అది ఎవరికి పండగ అయ్యిందనే విమర్శలే నిజం. వ్యవసాయం లో ఉత్పత్తి ఖర్చులు వందల శాతం పెరిగినా ఆ మేరకు రైతుకు గిట్టుబాటు ధర దక్కటంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల బతుకుల్లో మార్పు రావటం లేదు. వ్యాసంలో పేర్కొన్నట్టు., రైతుకు ఎప్పుడు ఏం కావాలో అది అందించకుండా సేద్యానికి తోడ్పాటు ఇస్తున్నట్టు నటిస్తే వ్యవసాయం నుంచి వలసలు పెరుగుతాయని హెచ్చరిస్తున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                                   

Monday, 31 March 2014

జయ జయ ఉగాది

వరుస ఎన్నికలతో ఈ  వసంతాన్ని ఆస్వాదించే అవకాశాలు బహు తక్కువ. నిజానికి ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు తొడిగే ఈ వసంతమంటే ఎవరికైనా ఇష్టమే మరి. మన జీవితాల్లో కూడా ఈ జయ నామ సంవత్సర ఉగాది కొత్త ఆశలు చిగురింప చేయాలని మనసారా కోరుకుంటూ  మిత్రులందరికీ  శ్రీ జయ ఉగాది శుభాకాంక్షలు.

                                                                             

Thursday, 30 January 2014

తెలుగు యువకుల సత్తా

ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టి పెరిగిన ఊరిని, కన్నవారిని మర్చిపోకూడదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తహ తహ లాడుతున్న ఎందరో ఎన్నారైలు ఇప్పటికే తమవంతుగా తమ తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో సాయపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి ఆలోచనతోనే ముందు తరాలకు మన గ్రామం చరిత్ర,, సంస్కృతి, గ్రామం లోని విశేషాలు, ప్రసిద్ధ వ్యక్తుల గురించిన సమాచారంతో పాటు ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో ఉన్న మన వూరి వారందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చి ప్రస్తుతం గ్రామాభివృద్ధికి ఏమేం చేయవచ్చో నిర్ణయించే ఒక సదవకాశం  swagraam.com ద్వారా కలగనుంది.
ప్రకాశం జిల్లాకు అద్దంకికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోదరులు బాచిన రాహుల్, అనిల్ లు దేశంలో తొలిసారిగా గ్రామాల అనుసంధానానికి, గ్రామాభ్యుదయానికి  swagraam.com కు రూపకల్పన చేయటం ద్వారా శ్రీకారం చుట్టారు. తెలుగు వారైన ఈ సోదరుల కృషి వల్ల మన స్వగ్రామానికి ఒక పేజి రూపొందించి దేశ విదేశాల్లో గ్రామానికి చెందిన వారిని ఆహ్వానించి గ్రామం అభివృద్ధికి పాటు పడవచ్చు. గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన చిత్రాలకు తోడు మన కుటుంబ సభ్యుల ఫొటోలనూ పేజీలో పెట్టుకోవచ్చు. కొన్ని ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వెబ్ సైట్ల తో పోల్చితే ఎంతో ఉపకరించే ఇటువంటి సైట్ రూపొందించిన ఈ సోదరులు అభినందనీయులు.
మరో విశేషం ఏమంటే ఎన్నో e-books రైట్స్ తీసుకుని మన విద్యార్ధుల కోసం ఉచితంగా అందిచేందుకు ఈ సైట్ ద్వారా వీరు కృషి చేస్తున్నారు. ఈ సోదరుల కృషిపై ఈ నెల 15వ తేదీన ఈటీవీ-2 లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే "యువ" లో ఒక ప్రత్యేక కధనాన్ని ప్రసారం చేశాం.  మీ కోసం ఆ వీడియో క్లిప్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.