Pages

Sunday, 8 September 2013

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                         

                                         శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
                                       ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!

           భాద్రపద శుద్ధ  చవితి రోజు నిద్ర లేచి ప్రాతః కాలంలో పత్రి సేకరణ కోసం పొలాలు, తోటల్లోకి వెళ్లి పెద్ద కాలువలో ఈతలు కొట్టి రావడం..., స్నానాదులు ముగించి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం... , కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని ప్రతిష్టించి నిష్టగా పూజ చేయడం.., చిన్నతనంలో అన్ని పూజల కంటే ఈ వినాయకుని పూజలోనే ఎక్కువగా పాల్గొనటం.., ముఖ్యంగా శ్రీ వినాయక వ్రత కధను నేనే చదవటం బాగా అలవాటు. కధ చదవటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా కాలక్రమంలో పత్రిని కొనుగోలు చేసి తీసుకురావటం మాత్రం అలవాటైంది. గణపతి నవరాత్రుల కాలంలో హైదరాబాద్ లో ఈ పండగ సంబరాలు జరిగే తీరు నభూతో నభవిష్యతి! ఈ  ఏడాది కూడా ఎప్పటిలా శాంతి సామరస్యాలతో వినాయక ఉత్సవాలు జరగాలని కోరుకుంటూ మిత్రులు, హితులు,సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరునా వినాయక చవితి శుభాకాంక్షలు.
                                            సర్వేజనా సుఖినోభవంతు.

Friday, 6 September 2013

వ్యవ"సాయం" తోనే ఆహార భద్రత

దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్రం గొప్ప ముందడుగు వేయడం సంతోషించదగిన విషయమే. కానీ ఆహార భద్రత కల్పించే క్రమంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను కేంద్రం ఉపెక్షిస్తుండటమే విచారకరం. దేశంలో తిండి గింజలు పండించే రైతులే ఒక పూట తిండికి నోచుకోలేక పోతున్నారు. వారి సంక్షేమం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా., రెట్టింపు దిగుబడులు సాధించాలంటే రైతుకు ఏ విధంగా చేయూత నివ్వాలనే అంశాలను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఆహార భద్రత సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుకు భద్రత కల్పిస్తేనే ఆహార భద్రత సుసాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                             

Friday, 5 July 2013

కాగితాల్లోనే కార్యాచరణ!

ఏటా వ్యవసాయ కార్యాచరణ కాగితాల్లోనే కనిపిస్తోంది తప్ప పంట దిగుబడుల్ని పెంచేందుకు,  రైతుల్ని ప్రోత్సహించేందుకు సర్కారు చిత్తశుద్దిని చూపటం లేదు. ఏటికేడూ లక్ష్యాలు ఘనంగానే కనిపిస్తున్న వాటిని సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి బొత్తిగా శూన్యం. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, సాగునీరు వంటి పంట ఉత్పాదకాలు అందటం ఎంత ముఖ్యమో సాంకేతికతను ఉపయోగించి మెరుగైన దిగుబడులు సాదించేలా రైతులకు సాగు విధానాల్లో సలహాలు అందించడం అంటే ప్రధానం. ఇవన్నీ విస్మరిస్తున్న కారణంగా అధికోత్పత్తులు సాధించడంలో ఆశించిన పురోగతి సాధ్య పడటం లేదు. ఇప్పటికైనా సాగు చేస్తున్న రైతులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలు చూపగలిగితే మన రైతులు అధ్బుత దిగుబడులు సాధించడంలో ప్రపంచంలో ఎవరికీ తీసిపోరనటంలో  సందేహం లేదు. ఎటొచ్చీ సర్కారు చిత్తశుద్ది పైనే సందేహమంతా...!
                                                           

Sunday, 30 June 2013

"శివగీతార్చన"

నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన"  పాటల సీడీని విడుదల చేశాక రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో, మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన "శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని మిగిల్చాయి. 




Friday, 14 June 2013

సీజన్ ముంగిట రైతులు చిత్తుచిత్తు!

సకాలంలో వర్షాలు కురిసినా విత్తనాలు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు . సర్వం సిద్ధం చేశామంటున్నవ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులు ఏటా ఎదుర్కొంటున్న సమస్యలకు  తగిన పరిష్కారాన్ని చూపలేక పోతోంది. సీజన్ ముంగిట రైతుకు విత్తన సమస్యలు మామూలు  అవుతున్నా  సర్కారులో సర్కారులో చలనం లేదు. పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలోనూ రైతుకు పంట ఉత్పాదకాలను సకాలంలో అందించడం ద్వారా వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించటం లేదు.   ఈ  ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసి చెప్పినా రైతులు దుక్కులు దున్నే నాటికి విత్తనాలు సిద్దం చేయాల్సిన సర్కారు యెంత సన్నద్ధంగా ఉందో.,  నేడు రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడుతున్న పాట్లను చూస్తే తెలుస్తుంది. రైతు శ్రేయం విషయంలో ఎప్పుడూ మొద్దు నిద్ర పోయే ప్రభుత్వాలకు అన్నదాతల కష్టాలు కనిపిస్తున్నాయా...?
                                                       

Saturday, 11 May 2013

రైతు గుండెల్లో కార్పొరేట్ గునపం!

సదుపాయాలు కల్పించకుండా చిన్న రైతులు సేద్యంలో లాభాపడలేక పోతున్నారంటూ కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతుకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకునేందుకు  ఎలాంటి అవకాశాలు  కల్పించకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యవసాయ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని స్వాగతించాలా వద్దా అనే సంగతిని పక్కన పెడితే రైతుకు రక్షణ కల్పించే ఆంశాలను ఈ ఒప్పందాల్లో ఎందుకు  పొందు పరచలేదన్నదే ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ వ్యవసాయ విధానంలో రైతు ప్రయోజనాలను విస్మరించిన ఆంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు "ఈనాడు" ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                      

Thursday, 25 April 2013

చైతన్యం రావాల్సింది సర్కారులో....!

                                                               


ప్రభుత్వం మీ కోసం లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేసింది., ఈసారి  పనిముట్లకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, ఎరువులు కొరత లేకుండా చూస్తాం., విత్తనాలకు కొరత రానీయకుండా చూస్తాం....... రైతు చైతన్య యాత్రల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పెంచుతున్న అవగాహన ఇది. వాస్తవానికి రైతులకు అవగాహన పెంచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న సేధ్యరంగాన్ని గట్టెక్కించాలంటే రైతులకు మార్కెట్ తెలివిడిని పెంచే చర్యలు చేపట్టాలి. ఈ ఏడాది ఏయే పంటలకు గిరాకీ ఉంది.? ఏయే పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చెయాలి...? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఏ సమయంలో పంటను మార్కెట్ కు తీసుకువెళితే రైతుకు మంచి ధర వస్తుంది ...? ఒకవేళ ధర లేకపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది... ?  మంచి ధరలు ఎలానూ ఇవ్వలేని ప్రభుత్వం చైతన్య యాత్రల్లో రైతుకు నేర్పాల్సినవి ఇవే...! ఇవన్నీ వదిలిపెట్టి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని యాత్రల పేరిట ఈ జాతరకు ఖర్చు చేస్తుండటం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.