Pages

Wednesday, 31 October 2012

ఈ చీకట్లను తరిమికొట్టండి!

                                                            
కరెంటు కోతలతో పరిశ్రమలే కాదు రాష్ట్రంలోని సకల జీవన రంగాలు కకావికలమౌతున్నాయి.  రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్ మిధ్యగానే మిగిలింది. ఎన్నో ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ రెండు మూడు గంటలకే పరిమితం కావడంతో పంటలు జీవం కోల్పోయాయి. వేళాపాళా  లేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 60 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడుతున్నాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎడురవనుందని ముందే తెలిసినా ముదస్తూ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, ట్రాన్స్ కో విఫలమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.                                                                                                                                 
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 900 మెగావాట్లే. నిండని జలాశయాలతో విద్యుత్ ఉత్పత్తి అతి స్వల్పంగా ఉంది. కీలకమైన బొగ్గు ఆధారిత విద్యుత్  109 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. సంప్రదాయేతర రంగంలో విద్యుత్ ఉత్పత్తి 903 మెగావాట్లకు మించడం లేదు. నెలకు 1500 కోట్లు అదనంగా ఖర్చు చేయగలిగితే కరెంటు పుష్కలంగా సరఫరా చేయవచ్చని నిపుణుల సూచనను పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతిరోజూ 65 మిలియన్ యూనిట్ల లోటు తేలుతోంది. దీన్ని భర్తీ చేయలేక ట్రాన్స్ కో, డిస్కం లు భారీ విధ్యుత్ కోతలకు  తెగబడుతున్నాయి. కోతల ఫలితంగా గత ఆరేడు నెలల్లో 20 వేల కోట్లకు పైగా వర్క్ ఆర్డర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చిన్న పరిశ్రమలు  లబోదిబోమంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న చీకట్లను తొలగించేందుకు  ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు నొక్కి చెబుతున్నాయి. ప్రజలు కూడా విద్యుత్ పొదుపును అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Tuesday, 16 October 2012

"సూక్ష్మం" గ్రహిస్తే సేద్యం పదిలం!

భూసారం క్షీణించకుండా పది కాలా పాటు వ్యవసాయం నిలదొక్కుకోవాలంటే ఆచరించదగిన యాజమాన్య పద్దతులను సుస్థిర వ్యవసాయ విధానంగా వ్యవహరిస్తారు. ఈ విధానం కింద మన సహజవనరుల్ని సంరక్షిన్చుకోవడంతో పాటు సంప్రదాయ సాదు పద్దతులు, విత్తనా రకాలాను పరిరక్షించుకోవడం ద్వారా జన్యు వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. జన్యు, జీవ వైవిధ్యాన్ని కాపాడటమంటే మన వ్యవసాయాన్ని కాపాడుకోవటమే. నెలలో ఉండే సూక్ష్మజీవుల నుంచి భూమిపై బతుకుతూ పంటకు మేలు చేసే కీటకాల వరకు రైతునేస్తాలుగా పేరొందిన అన్ని రకాల జీవులనూ నాశనం చేసే రసాయన సేద్యంతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాం. సేద్యాన్ని పరాదీనం చేస్తున్నాం.జీవ, జన్యు వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాం. ఈ అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. అప్ లోడ్ చేసిన వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను.
                                                                                               

Tuesday, 18 September 2012

గణనాధా నమోస్తుతే!

                                                           
తొలి పూజలందుకునే శ్రీ మహా గణపతి ఓంకార స్వరూపుడు.  మన విజ్ఞానమే  వినాయకుడు, మన  బుద్దే వినాయకుడు., మన తెలివితేటలే వినాయకుడు.... వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకోగలిగిననాడు మన అభీష్టాలు సిద్దిస్తాయంటారు మహర్షులు.  ఇంకేం... ఈర్ష్యా ద్వేషాలను విడనాడి స్వశక్తిని నమ్ముకుంటే అందరికీ కార్యసిద్ధి లభిస్తుంది. వినాయక చవితి సందర్భంగా బ్లాగు మిత్రులకు, facebook మిత్రులకు శుభాకాంక్షలు.  

Monday, 10 September 2012

హైబ్రిడ్ పరిశోధనలలో లోపించిన పురోగతి!

                                                             
మన దేశంలో హైబ్రిడ్ వరి వంగడాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను సోమవారం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వరి సదస్సు నొక్కి చెప్పింది. దశాబ్దాలు గడుస్తున్నా మన పరిశోధనలు ముందుకు సాగటం లేదు. ఆహార భద్రత అంటూ గొంతు చించుకుంటున్న కేంద్ర సర్కారు... ఆ దిశగా పరిశోధనలకు పెద్ద పీట వేయడంలో ఘోరంగా విఫలమైంది. మన రాష్ట్రం విషయానికి వస్తే., రెండు దశాభ్దాల క్రితం రూపొందించిన చైతన్య, కృష్ణవేణి, ఐ.ఆర్ రకాలనే రైతులు నేటికీ వాడుతున్నారు. దిగుబడులు పెరగకపోవడం వల్ల రైతుకు నికరాదాయం తగ్గి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పరిశోధనలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ దుస్థితి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా ఈ దిశగా దూసుకుపోతుంటే., మనం ఎక్కడో ఉన్నాం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తోంటే., మన రైతులు సేద్యంలో నిలదొక్కుకునే పరిస్థితులు కూడా కల్పించలేకపోతున్నాం. "శ్రీ" వరి సాగు విధానంతో హెక్టారుకు 224 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డ్ సాధించిన రైతులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రభుత్వాలు కనీసం ఇటువంటి విదానాలనైనా ప్రోత్సహిస్తే అన్నదాతకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు ఉంటేనే వ్యవసాయం  మనుగడ సాగిస్తుంది.

Friday, 31 August 2012

మట్టి గణేష్ విగ్రహాలనే పెడదాం!

                                                    
రాష్ట్రంలో ఏటా వినాయక చవితికి ఉపయోగిస్తున్న విగ్రహాలు 90 నుంచి 93 శాతం ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ తో రూపొందించినవే కావటం గమనార్హం. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని బాగా తగ్గించవచ్చు. గత రెండేళ్లుగా ఈ దిశగా చేపడుతున్న చర్యల వల్ల ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. నగర, పురపాలక సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొందరు వ్యక్తులు, "సేవ్" వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ దిశగా మట్టి విగ్రహాలను తయారు చేసి చిన్నవి ఉచితంగా, పెద్దవి కొద్దిపాటి ధరలకు అందిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పడకుండా రసాయనాలతో కూడిన రంగులు వాడిన రంగు రంగుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఈ ఏడాది మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం.  ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు 15 వేల మట్టి విగ్రహాలను సరఫరా చేయించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  ఈ దిశగా 100 స్కూళ్లలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇంటింటా ఈ వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేద్దాం...  మట్టి వినాయకులకు జై కొడదాం.

Thursday, 23 August 2012

ఛీ ఛీ సిగ్గులేని కేంద్ర మంత్రి

                                                            
భారత దేశపు అత్యంత చెత్త వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మరోసారి తన బుద్దిని బయట పెట్టారు. విత్తన చట్టంలో తీసుకురావాల్సిన సవరణల గురించి మాట్లాడేందుకు అఖిల పక్షంతో డిల్లీకి వెళ్ళిన కన్నా బృందంపై రుసరుసలాడి తన అసహనాన్ని వెళ్లగక్కారు. మంత్రి కన్నా దీన్ని సరదాగానే తీసుకున్నా వారితో వెళ్ళిన రైతు నాయకులతో నేను మాట్లాడినప్పుడు.., పవార్ తమను ఎందుకొచ్చారు అన్నట్టు చూసారని., కనీసం అతిదులమన్న గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. విత్తన చట్టంలో బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ఉన్న పలు అంశాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమైనా., కార్పొరేటే సంస్థలకు బాకా వూదటంలో నేర్పరి అయిన పవార్, దేశీయ రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకుంటాడని ఆశించడం అత్యాశే. విత్తన చట్టంలో ఇటువంటి సవరణలు చేస్తే కార్పొరేట్, ఎంఎన్ సీలు నష్టపోతాయని  పవార్ కి బాగా తెలుసు. వీళ్ళు లాభ పడేలా చేయాలనేదే ఆయన ఉద్దేశమని యావత్ దేశానికి తెలిసినా పాపం మన మౌన రుషి మన్మోహన్ సర్కారుకు తెలియదు. భారతీయ రైతుల్ని రక్షించాలంటే స్వతంత్ర భారత చెత్త వ్యవసాయ మంత్రి పవార్ ను క్రికెట్ కు పరిమితం చేయండి మహాప్రభో!

Monday, 20 August 2012

రాష్ట్ర రైతుల్ల పట్ల కేంద్రం సవతి ప్రేమ

దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ఆహారోత్పత్తి కుంటుపడి తద్వారా ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతకు మించి సేద్యంలో మరిన్ని నష్టాలకు రైతులు సిద్దపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరవు సాయం విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సొంత రాష్ట్రం పట్ల చూపుతున్న మమకారం, దక్షిణాది  రాష్ట్రాల విషయంలో చూపుతున్న సవతి ప్రేమ కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి మునుముందు సమస్యలు తెచ్చిపెట్టనుంది. కరవు కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతుల విషయంలో ఏమీ మాట్లాడని మన ఎంపీలు., సంకీర్ణ ప్రభుత్వంలో కొందరు మిత్రపక్ష మంత్రులు వ్యవహరిస్తున్న తీరును గుడ్లప్పగించి చూస్తుండటం విచారకరం. ఏదేమైనా అంతిమంగా నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రైతుల పరిస్థితి., కరవు వల్ల, ఆహార భద్రతా సమస్య తదితర అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.