Pages

Wednesday, 31 August 2011

వినాయకచవితి నాడు బాల్యంలో నా జ్ఞాపకాలు

                                                                
వినాయక చవితి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి పత్రి కోసం మిత్రులతో కలిసి పొలాలకు వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మా వూర్లో వినాయకుడికే ఉత్సవాలు బాగా జరుగుతాయి. గణపతి నవరాత్రుల కాలంలో గ్రామంలో హరికధ, బుర్రకధ, తదితర పురాణ కాలక్షేపాలతో ఉత్సవ వాతావరణం ఉండేది. మరే పండగకు అలాంటి శోభ కనిపించదు. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ నా చిన్నతనంలో అదే ప్రత్యేక ఆకర్షణ. గ్రామం సెంటర్లో ఉండే వినాయక గుడిలో భారీ మట్టి వినాయకుడిని పెట్టి భక్తి శ్రద్దలతో పూజించేవారు. నిమజ్జనం రోజు ఆ విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి పంట కాలువలో కలిపేసేవారు. 
                   ఇది అన్ని ఊళ్లలో చేస్తారు వింతేముంది అని మీకు అనిపించవచ్చు., కానీ ఇప్పుడంటే ఆఫీస్ నుంచి వెళుతూ పత్రి పట్టుకు వెళుతున్నాం. మా  వూర్లో  పత్రి కొనటం కంటే ధనిక, పేద, చిన్న, పెద్ద రైతులు, కూలీలు ఈ తేడాలేమీ లేకుండా ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒక్కరు (మరీ ఆరోగ్యం బాగోని పక్షంలో తప్ప) పత్రి సేకరించేందుకు వచ్చేవారు. మేమంతా ఉదయం 5 గంటలకే నిద్ర లేచి  కనీసం రెండు కిలోమీటర్లు వెళ్లి పొలాల వెంట తిరిగి అన్ని రకాల పత్రాలను సేకరించి వస్తూ వస్తూ పెద్ద కాలువలో స్నానం చేసి 7 గంటల కల్లా తిరిగి వచ్చేవారం. ఈ క్రమంలో మా మిత్ర బృందమంతా కలిసి ఒక్కటిగానే వెళ్ళేవారం. పెద్ద కాలువలో దిగాలంటే మొదట్లో భయం వేసేది. రైతు బిడ్డను కదా చిన్నప్పుడే ఓ ఏడాది నాన్న ఈత నేర్పించడంతో ఆ భయమూ పోయింది. పత్రి సేకరణ, కాలువ స్నానం... స్నేహితులతో నిజంగా అదొక గొప్ప అనుభూతి. ముందు రోజు తెచ్చిన మట్టి విగ్రహం పెట్టి ఆ రోజు పూజ పూర్తి చేసేవారం.  ఏటా వినాయకచవితి అంటే గుర్తుకువచ్చే ఈ జ్ఞాపకాలను తడిమి తడిమి చూసుకోవడం అదొక అనిర్వచనీయమైన అనుభూతి. 
   మీకూ ఇటువంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా..? ఇంకేం ఎంచక్కా బాల్యంలోకి వెళ్లి ఆ జ్ఞాపకాలను ఒక్కసారి ఆస్వాదించి రండి. మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                          
అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. గత ఏడాది కంటే ఈసారి పర్యావరణం పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో పెట్టిన మట్టి విగ్రహాలే ఇందుకు సాక్ష్యం. ప్రజల్లో ఈ అంశంపై మంచి అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు. ఇదే స్పూర్తిని ఇక ముందూ కొనసాగించి మన పర్యావరణాన్ని  కాపాడే క్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం.

Sunday, 28 August 2011

మట్టి వినాయకుడికీ జై!

                                                              
వినాయక చవితి సమీపించింది. రెండు రోజుల్లో తమ తమ ఇళ్ళలో పూజించే ప్రతి ఒక్కరూ చిన్న చిన్నవిగ్రహాలను కొనుగోలు చేయడం మొదలుపెడతారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాదన్నా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. పక్కింటి వారిని చూసి పోటీ పడకుండా., పొరుగు కాలనీ వారికంటే పెద్ద విగ్రహం పెట్టాలనుకోకుండా, భారీ విగ్రహం పెట్టి మన అపార్టుమెంటులో ఇతరుల కంటే ఘనంగా చేయాలనే గొప్పలకు పోకుండా మట్టి విగ్రహాలను పెట్టి మన పరిసరాలను కాపాడుకుందాం. ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. ఈ రోజు మిత్రుడు వాసిరెడ్డి అమరనాధ్ గారు తన స్లేట్ స్కూల్ లో 2000 మట్టివిగ్రహాలను తన విద్యార్ధులకు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. పర్యావరణంపై విద్యార్ధుల్లో చైతన్యం తీసుకు రావాలనే వారి తపనను అభినందిస్తూ, గత ఏడాది కంటే మరింత మంది మట్టి విగ్రహాలు పెట్టి పూజించాలని కోరుకుంటూ సకల జనావళికి రంజాన్, వినాయక చవితి శుభాకాంక్షలు.

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం!

                                                                          
చాప కిందకి నీళ్ళు వస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్.ఎల్.డి.అధ్యక్షుడు అజిత్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదట సారిగా ఆంధ్రాలో రైతులు సమ్మె చేయడం చూశామని, ఇది జాతీయ స్థాయి ఉద్యమానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. పంట విరామం ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చిన ఆయన తర్వాత డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో రైతుల పరిస్థితి  దారుణంగా ఉందన్నారు. గత ఏడాది కాలంలో డీజిల్ ధర 40 శాతం, కూలి ఖర్చులు 35  శాతం, ఎరువుల ధరలు 30 శాతం వరకు పెరిగాయని గుర్తు చేస్తూ, అదే స్థాయిలో పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ప్రకటించడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని  "హూడా" కమిటీ సూచించినా  ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చెల్లిస్తుండటం బాధాకరమన్నారు. జనతాదళ్ (ఎస్) ప్రధాన కార్యదర్శిడానిష్ అలీ, ఆరేస్పీ నేత అబనీరాయ్, సి.పి.ఎం.ఎంపీ రామచంద్ర డొమ్, బీ.జే.డి నేత సిద్దార్ధ మహాపాత్రో, తెలుగుదేశం నేత  మైసూరా రెడ్డి లు ఈ అఖిలపక్ష పర్యటనలో పాల్గొన్నారు. రైతుల  జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు తెలుగుదేశం సహా తొమ్మిది పార్టీలు కలసికట్టుగా జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని  అజిత్ సింగ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ పెంచి పోషించిన రైతు వ్యతిరేక ధోరణి వల్ల వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యింది. దీనిపై పార్టీలకు అతీతంగా రైతులు సంఘటితంగా పోరాడితే తప్ప పాలకులు కళ్ళు తెరవరు. అది సాధించాలంటే రైతులు ఒక్కటిగా ముందుకు కదలాలి.

Friday, 26 August 2011

ఆంధ్రప్రదేశ్ లోయూరియా కొరత-రోడ్డెక్కిన రైతులు

                                                           
ఎరువుల కొరతతో రాష్ట్ర రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెలలో వర్షాలు బాగా కురవడంతో నాట్లు పూర్తి స్థాయిలో పడటం వల్ల యూరియా అందుబాటులో లేక రైతుకు దిక్కుతోచడం లేదు. దేశీయంగా యూరియా గిరాకీ ౩ కోట్ల టన్నులైతే ఉత్పత్తి 210 లక్షల టన్నులు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్ లో రాష్ట్రానికి సుమారు 17 లక్షల  టన్నుల యూరియా అవసరమైతే అందులో కేవలం 13 శాతం అంటే 2 .22 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి దక్కాయి. అన్ని రకాల ఎరువులూ కలిపి 44 లక్షల టన్నుల దాకా కావాలన్న వ్యవసాయాధికారుల లెక్కలను ఎవరూ పట్టించుకోలేదు. అత్యవసర నిల్వల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కనీసం ఇవి కూడా లేకపోవడంతో రైతులకు యూరియా అస్సలు అందటంలేదు. కేంద్రం కేటాయించే అన్ని రకాల ఎరువుల్లో ౩౦ శాతాన్ని మార్క్ ఫెడ్ కు ఇచ్చి నిల్వ చేయాలన్న ఉత్తర్వులను ఈ సీజన్లో తుంగలో తొక్కారు. ఈ నేపధ్యంలో ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలకు దిగుతున్నారు. 
                                                           
  ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో రైతుకు సేద్యం గిట్టుబాటు కాక అవస్థ పడుతుంటే వాటి అందుబాటు కూడా ప్రశ్నార్ధకం కావడం దారుణం. లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరిన ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పోషకాధార రాయితీ ఎరువుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి యూరియా మినహా ఇతర ఎరువులు అన్నింటిపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసినట్లయింది. ఫలితంగా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి ఎరువుల కంపెనీల మధ్య పోటీ పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయని కేంద్రం నమ్మబలికింది. దీనికి భిన్నంగా ధరలు పెరగటంతోపాటు ఎరువులను అందుబాటులో ఉంచలేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంగా నిలిచింది. రైతుల కోసం ఇన్ని నీతులు చెబుతున్న పాలకులు ఇప్పుడేమంటారు..?

Wednesday, 24 August 2011

ఆహారశుద్ధి రంగంలో భారత్ వెనుకంజ!


                                                                      
ఆహారశుద్ధి రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చితే చాలా వెనుకబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తును అంచనా వేయగలుగుతున్న మన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోతోంది. ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న మన దేశం, వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విషయంలో మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది.ఒక అంచనా ప్రకారం ప్రపంచ ఆహారశుద్ధి ఉత్పత్తులలో మన దేశ వాటా 2 శాతానికి మించ లేదు. ఒక్క పామాయిల్ నుంచే మలేసియా దాదాపు 40 రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రపంచ పామాయిల్ విస్తీర్ణంలో ప్రముఖ స్థానంలో ఉన్న మనదేశం మాత్రం ఇంకా స్వయం సమృద్ధిని సాధించలేకపోయింది. 
తాజాగా దేశంలో ఆహారశుద్ధి రంగం ఆశించిన రీతిలో వృద్ధి చెందలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యవసాయంపై పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. శుద్ధి, నిల్వ సదుపాయాలూ సక్రమంగా లేకపోవడంతో దేశంలో సాలుసరి మొత్తం ఉత్పత్తిలో 50 శాతంగా  ఉన్న దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన పండ్లు, కూరగాయలు వృధా అవుతున్నాయని కమిటీ తెలిపింది. దేశంలో రెండు దశాబ్దాల నుంచే ఆహార శుద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ, ఈ రంగంలో ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. 
                                                                              
మన రాష్ట్రంలో కిలో టమాటోలు పావలాకి పడిపోవడం, ఒక్కోసారి పాతిక రూపాయల ధర పలకడం తెలిసిందే. ఆహార శుద్ధి పరిశ్రమలు తగినంతగా ఏర్పడితే రైతులకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ రంగంలో అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగు పడతాయి. రైతులకు సైతం మంచి ధరలు దక్కుతాయి.

Sunday, 21 August 2011

అప్పుల్లో రాష్ట్ర రైతు!

                                                            
ఇతర రాష్ట్రాలతో పోల్చితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. వ్యవసాయరంగానికి ఇస్తున్న పంట రుణాల్లో సంస్థాగత రుణాల వాటా తక్కువగా ఉండి., వడ్డీ వ్యాపారులు ఇచ్చే రుణాల శాతం అధికంగా ఉండటాన్ని ప్రణాళికా సంఘం ఈ సందర్భంగా ప్రస్తావించింది. రుణ మాఫీతో రైతుల అప్పులు గణనీయంగా తగ్గాయని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం. బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వకపోవడం, పుస్తక సర్దుబాట్లతో రైతులకు రుణాలు ఇస్తున్నట్టు బ్యాంకులు చెబుతున్న లెక్కలనే విశ్వసించి, రైతులకు విరివిగా పంట రుణాలు అందిస్తున్నామంటున్న రాష్ట్ర సర్కారు వాదనల్ని ప్రణాళికా సంఘం నమ్మటం లేదు. ఈ కారణాల వల్లనే ఆంధ్ర ప్రదేశ్ రైతులు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతుల కంటే అప్పుల పాలయ్యారని ప్రణాళికా సంఘం బలంగా నమ్ముతోంది. వీటికి తోడు పంటల బీమా ప్రయోజనాలు అతి తక్కువ మంది రైతులకే  అందుతుండటాన్నిప్రస్తావిస్తూ, ఎక్కువ మంది రైతులకు వర్తింప చేయడంలో ఎదురవుతున్న లోపాలను ప్రభుత్వం సరిదిద్దటంలో విఫలమైందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. 
వ్యవసాయానికి ఇస్తున్న రుణాల్లో 53 శాతం వడ్డీవ్యాపారుల నుంచే రైతులకు అందుతున్నట్టు నాబార్డ్ 
టాస్క్ ఫోర్సు ఇటీవలే తన అధ్యయనంలో తేల్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు జాతీయ స్థాయిలో 48 .5 శాతం మంది ఉంటే, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 82 శాతంగా ఉందని ప్రణాళికా సంఘం ప్రస్తావించింది. పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చినా ఇతర అవసరాలకు పంట రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా కౌలు రైతుకు అప్పులు దొరక్క అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి నష్టపోతున్నారు. పంట సాగు చేయని భూయజమానులను గుర్తించి వారికి రుణాలు నిలిపివేయాల్సిన అవసరాన్ని విధాన నిర్ణేతలు పట్టించుకోవటం లేదు. ఇదే రుణ సమస్యలకు హేతువవుతోంది.
ఇన్నాళ్ళూ పంట రుణాలు అందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా తామే రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రణాళికా సంఘం చెబుతున్న వాస్తవాలపై ఏమంటారో..! రైతుల కష్టాలన్నింటికీ రుణాలు దొరక్కపోవడమే ప్రధాన కారణమని తెలిసినా పదే పదే అవే తప్పులు చేస్తున్న విధాన నిర్ణేతలు వ్యవస్థాగతంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరముంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వానికే రైతుల బాగోగులు పట్టకపోతే బడుగు రైతుకు ఇంకెవరు దిక్కు..?