Pages

Thursday, 28 September 2023

రైతు బాంధవుల మృతి తీరని లోటు










రైతు బాంధవుల మృతి తీరని లోటు 

దేశ వ్యవసాయ విప్లవానికి దిశానిర్ధేశం చేసిన భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ గారి మృతి దేశ రైతాంగానికి తీరని లోటు. అత్యున్నత వ్యవసాయ పరిశోధనలను గ్రామీణ రైతులకు చేరేలా., ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక సాగు సాంకేతికతను భారత రైతులకు తెలిసేలా వ్యవసాయ విధానాల రూపకల్పనకు సాయపడిన మహా మనిషి స్వామినాథన్‌గారు.  అన్నదాత కార్వనిర్వాహక సంపాదకునిగా  2019 జనవరిలో స్వర్ణోత్సవ సంచికకు వీరితో ప్రత్యేక వ్యాసం రాయించడం నేను మర్చిపోలేని జ్ఞాపకం. 

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అపార సేవలు అందించిన నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ చెరుకూరి వీరయ్యగారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం నుంచి పోలవరం వరకు సాగు నీటి ప్రాజెక్టులు, రైతుల సాగునీటి సమస్యలపై అవిశ్రాంతి కృషి చేశారు. 

కౌలు రైతుల శ్రేయం కోసం, బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులు,  కృష్ణా డెల్టా రైతుల నీటి సమస్యలు , సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ గారు...  వీరు ముగ్గురూ  24 గంటల తేడాతో చనిపోవడం రైతు లోకానికి పెను దుఃఖం కలిగిస్తోంది. పాతికేళ్లుగా వీరితో అనుబంధం మరువలేనిది.  రైతుల కోసం నిస్వార్ధంగా చేసిన వారి కృషి అనన్యసామాన్యం. తమ తమ పరిధిలో  రైతు శ్రేయం కోసం అలుపెరుగని కృషి చేసిన ఈ ముగ్గురికి నా నివాళులు. 🙏🙏🙏


Sunday, 17 September 2023

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు💐💐



Monday, 21 August 2023

వంశీ వాసిరెడ్డికి శుభాకాంక్షలు

 



ఒక్కరుగా పొందలేనిది సమష్టిగా సాధించగలమనే సహకార సూత్రం ఆధారంగా ఏర్పడుతున్నవే నేటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌.పి.)లు. విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు పనిముట్లు, యంత్రాలు సహా వ్యవసాయ ఉత్పాదకాలను నేరుగా వాటిని ఉత్పత్తి చేసే సంస్ధల నుంచి నాణ్యమైనవి పొందడం వల్ల సేద్యంలో సంభవించే 20-30 శాతం పంట నష్టాలను కూడా నివారించుకోవచ్చు. పైగా ఈ సంఘాలకు బ్యాంకర్లు నేరుగా రుణాలందిస్తే వాటి వసూలు కూడా నూరు శాతం ఉంటుంది. ఎఫ్‌.పి.ఓల ఏర్పాటుతో రైతుల మధ్య సంఘటిత్వం ఉండి మంచి ధరకు పంటను సమష్టిగా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించుకోగలడం, ఉత్పత్తికి ప్రాసెసింగ్‌ చేసుకోవడం వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశముంది. గత పదేళ్లుగా వీటి ఏర్పాటుకు నా ప్రతి వ్యాసంలో రైతులు ఇటువంటి సంఘాలుగా ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి చెబుతూ వస్తున్నా.

మిత్రుడు వంశీకృష్ణ వాసిరెడ్డి ఎఫ్‌.పి.ఓ ఏర్పాటు చేస్తున్నా అన్నా అనగానే ఎంతో సంతోషించాను. కొంత కాలంగా ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించి పున్నవల్లి (ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ దగ్గర) చుట్టుపక్కల గ్రామాల రైతులకు తన ఆలోచనలు చెప్పి "పున్నవల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌" ప్రారంభోత్సవానికి రేపు శ్రీకారం చుట్టాడు. తనకు విజయోస్తు. మిత్రులు సిబిఐ విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ గారు దీన్ని ప్రారంభించనున్న శుభసందర్భంలో వంశీ బృందానికి నా హార్ధిక శుభాకాంక్షలు.


Saturday, 15 July 2023

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసo  ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.



Wednesday, 7 June 2023

చెవిలో పుష్పాలు


సాగు వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ఇస్తామంటే కనీసం ఇవ్వడానికి ప్రయత్నిస్తారేమో అనుకున్నా.  ఇలా సాగు వ్యయాన్ని తగ్గించి చూపి చెవిలో పుష్పాలు పెడతారనుకోలేదు. కేంద్రం చూపుతున్న సాధారణ రకం వరి సాగు వ్యయం క్వింటాకు రూ. 1455.  వాస్తవ సాగు వ్యయం రూ.3300.  యాభై శాతం అదనంగా ఇవ్వడం కాదు రైతుకు సగం కూడా మద్ధతు ధర దక్కడం లేదు.

Friday, 28 April 2023

ఆహారశుద్ధితోనే ఆదాయ స్థిరత్వం

 

ఉత్పత్తిని అదే రూపంలో విక్రయించుకునే కంటే విలువ జోడించడం ద్వారా రెట్టింపు ధరను పొందే అవకాశముంది. భారత్‌లో ఆహారశుద్ధి రంగం విస్తరిస్తున్నప్పటికీ రైతులకు ధరల విషయంలో మాత్రం దగా తప్పడం లేదు. ఓ వైపు విలువ జోడింపు ఉత్పత్తులు సూపర్‌ మార్కెట్లను ముంచెత్తుతుంటే మరోవైపు ఆహారశుద్ధి రంగంలో దేశీయ తయారీ పరిశ్రమ ఇంకా వేగాన్ని అందుకోలేకపోతోంది. ఆహారశుద్ధి పరిశ్రమలను ఎక్కడికక్కడ విస్తరించి వాటిని రైతులతో అనుసంధానిస్తేనే సాగుదార్లకు మేలు జరుగుతుంది. వారికి స్థిరమైన ఆదాయాలు అందుతాయంటున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.



Wednesday, 15 March 2023

పోషకాహార భద్రత కావాలిప్పుడు



 దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.