Pages

Saturday, 13 August 2011

నేడు పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు వర్ధంతి


                                                                         
భవిష్యత్తులో మంచి వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగి పేరు తెచ్చుకుంటావని నన్ను మనస్పూర్తిగా ఆశీర్వదించిన ఆ ఆత్మీయుడు గతించి నేటికి ఏడాది. ప్రముఖ వ్యవసాయ  శాస్రవేత్తగా దేశ ప్రజలకు, రైతు సోదరులకు సుపరిచితుడైన పద్మశ్రీ ఈడ్పుగంటి వెంకట సుబ్బారావు (ఐ.వి. సుబ్బారావు) గతేడాది ఆగష్టు 14 న పరమపదించిన సంగతి తెలిసిందే. నిరాడంబరుడు, సహృదయుడు, సౌమ్యుడు అయిన శ్రీ సుబ్బారావు  గారు ఆచార్య ఎన్.జి. రంగా  వ్యవసాయ  విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆ  పదవికే వన్నె తెచ్చారు. నేను ఆయన శిష్యుడిని కాకపోయినా వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగేందుకు నాకెంతో తోడ్పడ్డారు. వారు  అభిమానించే తెలుగు జర్నలిస్టుల్లో నేనొకరిని కావడం నా అదృష్టం. వారి అభిమానం నాపై అంతగా ఉండేది మరి. వ్యవసాయ జర్నలిస్టుగా నన్ను తీర్చిదిద్దిన వారిలో శ్రీసుబ్బారావు,  శ్రీఆలపాటి సత్యనారాయణలు ముఖ్యులు.  అంతిమ ఘడియల్లో పరామర్సించేందుకు వెళ్ళినప్పుడు వారు నాతొ మాట్లాడిన జ్ఞాపకాలింకా నా స్మృతి  పథంలో పదిలంగా ఉన్నాయి.  పశ్చిమ గోదావరి జిల్లా పసలపూడిలో రైతు కుటుంబంలో జన్మించిన శ్రీసుబ్బారావు గారి కృషి వల్ల  రంగా వర్సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి లబించింది. అఖిల భారత సైన్సు కాంగ్రెస్ అధ్యక్షులుగా వారందించిన సేవలు నిరుపమానం. 
          వారి వర్ధంతిని పురస్కరించుకుని శ్రీఐ.వి. సుబ్బారావు స్మారక కమిటీ వారి సహకారంతో రైతునేస్తం వ్యవసాయ మాస పత్రిక తన 7వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ  జర్నలిస్టులు,  శాస్రవేత్తలు, ఉత్తమ రైతులకు అవార్డులు ప్రకటించింది. రైతుల  సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ఆర్టికల్స్ రాస్తూ వాటి పరిష్కారానికి నా వంతు చిరు ప్రయత్నం చేస్తున్నందుకు గుర్తింపుగా ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో నాకు అవార్డు ప్రకటించినందుకు రైతునేస్తం పత్రిక వారికి నా ధన్యవాదములు. ఇది నాకొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 18 న హైదరాబాద్  రెడ్ హిల్స్ లోని  FAAPCCI  లో అవార్డుల బహుకరణ సభ ఉంటుందని రైతునేస్తం ఎడిటర్ శ్రీ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. గురుతుల్యులు శ్రీ సుబ్బారావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  వారే లోకంలో ఉన్నా మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.

Friday, 12 August 2011

"అగ్రి ఇండియా" రైతుల కన్నీళ్ళు తుడుస్తుందా..?

                                                            
 వ్యవసాయరంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం "అగ్రి ఇండియా" పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుందట..! ఇందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగాలకు కేంద్ర కేబినేట్ అనుమతి లభించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి రూపొందించే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విత్తనాలు, పనిముట్లు, పశువుల టీకాలు... వగైరా అంశాల్లో మేధో హక్కుల పరిరక్షణతో  పాటు వాటిని వాణిజ్యపరంగా అమల్లోకి తేవడం, సాంకేతికతను మార్కెటింగ్ చేయడం, రైతులకు అవగాహన కల్పించడం ఈ కంపెనీ ఉద్దేశం. 
                                                               
            రైతులకు ఏం చేయాలో ఎటువంటి చర్యలు తీసుకుంటే వారి పరిస్థితి  మెరుగు పడుతుందో డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ ఏనాడో సూచించింది. మన రాష్ట్రంలో వై.ఎస్. జమానాలో అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ సంగతిని ఆయనే మర్చిపోయిన విషయం ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తోంది. వ్యవసాయ సంస్కరణలు అమలుతో రైతుల పరిస్థితిలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు నిపుణుల సిఫార్సులు ఎన్నో అందుబాటులో ఉండగా కోట్లు ఖర్చు పెట్టి కమిటీల పేరిట ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం ప్రభుత్వానికే చెల్లింది. 2003 లో ఆమోదించిన విత్తన చట్టాన్నే ఇంకా పార్లమెంటులో చట్ట రూపంలోకి తెచ్చుకోలేకపోయాం. ఈలోగా ఆ చట్టం సైతం మరెన్నో మార్పులు సంతరించుకోవాల్సి ఉంది. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని పాలకులు, పవార్ లాంటి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి ఉన్నంత కాలం వారి బతుకులు బాగుపడతాయనుకోవడం భ్రమే.

Thursday, 11 August 2011

పంట విరామంపై కందా నేతృత్వంలో కమిటీ

                                                                                                                                                          
పంట విరామం ప్రకటించి  ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేసిన రైతుల్ని ఊరడిన్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం మోహన్ కందా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. వ్యవసాయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కందా గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవజ్ఞులు. పంట విరామానికి దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను ఈ స్వతంత్ర కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ కమిటీలో ప్రముఖ వ్యవసాయ శాస్రవేత్త పద్మశ్రీ ఎం.వి. రావు, రంగా వర్సిటి డి.ఆర్.  సుధాకర రావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ కే. సుదీర్, కే. ప్రతాపరెడ్డి లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా ఉంటారు. 4 వారాల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది. కొనసీమతో పాటు పలు జిల్లాల్లో 1 .35 లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం పాటిస్తున్న సంగతి తెలిసిందే. సమస్య గురించి తెలిసినా కమిటీల పేరుతొ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటాన్ని రైతు నేతలు విమర్శిస్తున్నారు. పంట విరామం పాటించి ఈ సీజన్లో ఉపాధి కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన అవసరముంది. 

Saturday, 6 August 2011

యూరియాపై నియంత్రణ ఎత్తివేత?

                                                                                   
దేశంలో పెట్రోలు ధరలు పెరిగిన వెంటనే తమ ఉత్పత్తుల ధరల్ని ఇష్టానుసారం పెంచే కంపెనీల కున్న  స్వేచ్చ రైతులకు లేదు. ఉత్పత్తి చేసే వారికే ధర నిర్ణయించే అధికారం పారిశ్రామికులకు ఉన్నట్టే రైతులకు ఆ హక్కు లేకపోవడం వల్ల అన్నదాతలు కుదేలవుతున్నారు. తాజాగా కేంద్రం యూరియా ఎరువులపై ఇన్నాళ్ళుగా ఉన్న నియంత్రణను ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రైతులపై దాదాపు 250 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇప్పటికే డి.ఎ.పి., కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలకు ఈ నిర్ణయంతో అడ్డూ అదుపూ ఉండదు. ఒక వైపు అన్ని రకాల సేద్య ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాకా రైతులు తల్లడిల్లుతుంటే కేంద్రం రైతులపై ఎప్పటికప్పుడు మోయలేని భారం మోపుతూ రైతుల పరిస్థితిని అంతకంతకూ దిగజారుస్తోంది. యూరియా ధర తక్కువగా ఉండటం వాళ్ళ రైతులు ఎక్కువగా వాడేస్తున్నారని, ధరలు పెంచుతామని కంపెనీలు కేంద్రానికి పదే పదే చేసిన వినతులకు కేంద్రం వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరలు పెంచాలని కేంద్రాన్ని రైతులు వేడుకుంటున్నా కనికరించని పాలకులు పరిశ్రమలపై మాత్రం దయ చూపించడం గమనార్హం. కంపెనీల వినతికి తోడు  యూరియాపై  ఇస్తున్న  రాయితీని తగ్గించుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయానికి తెగబడినట్టు తెలుస్తోంది.
                                                                         
ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో యూరియా ధరలు పెరగటం వల్ల రైతులకు రాయితీ పెంచాల్సిన కేంద్రం ఇలా రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదే పదే అవే తప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుండటం దేశ భవిష్యత్ రీత్యా క్షేమకరం కాదని గుర్తించాలి.

Friday, 5 August 2011

భూసేకరణ-సుప్రీంకోర్టు చివాట్లు

                                                        
పరిశ్రమలు, పట్టణీకరణ, గృహసముదాయాలు తదితరాల పేరిట బడుగుల భూముల్ని హస్తగతం చేసుకునే కుట్రల్ని నిన్న అత్యున్నత నాయస్థానం కడిగి వేయటం ఒక శుభపరిణామం. సెజ్ ల పేరిట అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దురాగతాలకు ఇది చెంప పెట్టు. ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో  సెజ్ ల  కోసం అక్రమంగా నోటీసులు ఇచ్చి పేదల జీవనాధారమైన పంట భూముల్ని లాగేసుకునే ఇటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణలు చేయడంపై సుప్రీంకోర్ట్ ప్రభుత్వ చర్యను తూర్పార పట్టింది. "సామాన్యుల  సంక్షేమం పట్టని కొందరు బుర్ర లేని వ్యక్తులు భూసేకరణ చట్టాన్ని రూపొందించారని, అది మోసకారి చట్టమని, కండబలం కలిగిన వ్యక్తులే ప్రైవేటు భూముల్ని స్వాధీనం చేసుకుంటారని, దీనివల్ల భూముల ధరలకు రెక్కలోస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. పోలేపల్లి, సోంపేట, కాకరాపల్లి, సత్యవీడు .... ఇలా మన రాష్ట్రంలో పచ్చని భూముల్లో సెజ్ ల మంటలు ఎగసిపడినా పాలకులు కరుణించలేదు. 
ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పేరిట లక్షలాది హెక్టార్లలో పంట భూములు సాగుకు నోచుకోక వృధాగా ఉండటంవల్ల దేశంలో ఆహారోత్పత్తి ఆశించిన రీతిలో పెరగటం లేదు. ఆహార భద్రత అంశాన్ని పక్కన పెడితే పేదల భూములతో స్వార్ధ రాజకీయం ఎలా ఆటలు ఆడుతుందో ఆంధ్ర ప్రదేశ్ లో మనం స్వయంగా చూశాం. తమకు జీవనాధారమైన భూముల విషయంలో ప్రభుత్వాలే భూసేకరణల పేరిట మోసం చేస్తాయని ఊహించని నిరుపేదలు ఎందరో నేడు రోడ్డున పడుతున్నారు. వీటి వెనుక ఉన్న కుట్రలు తెలియక సర్వస్వం కోల్పోయిన నిర్భాగ్యులు చివరికి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండటం విషాదం. అక్రమార్కుల కుట్రల్ని వెలికి తీస్తున్న మీడియా కధనాలనే సుమోటో గా తీసుకుని కనీసం కోర్టులైనా ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుందాం.

Thursday, 4 August 2011

పంట విరామంపై రైతుల "ప్రతిధ్వని"

                                                                            
రాష్ట్రంలోని తూర్పు గోదావరి సహా పలు జిల్లాల రైతులు పంట విరామం దిశగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఖరీఫ్ లో పంట విరామం పాటించాలని రైతులు  తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. రాత్రి 9 గంటలకు ఈటీవి 2 ప్రతిధ్వనిలో పంట విరామం పై మంచి చర్చ వచ్చింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోళ్ళు సాగినా ప్రతి క్వింటా పైనా రైతుకు 700 రూపాయలు నష్టపోతున్నారని చర్చలో పాల్గొన్న రైతు నేత చెంగల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళకు రైతు చేతికి ఒక ఆయుధం దొరికిందని, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని వారన్నారు. రైతుల స్థితిగతులపై  నియమించిన పలు కమిషన్లు చేసిన విలువైన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తుండటం వల్లనే ఈ  దుస్థితి దాపురించినదని వక్తలు  అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు సూచించిన వర్కింగ్ గ్రూప్ నివేదికను ప్రభుత్వం గుర్తించి అమలు  చేయాలని నిపుణులు కోరారు. 
                                                            
            ఇదిలా ఉండగా ఆహార భద్రతపై పంట విరామం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న 90 శాతం చిన్న, సన్నకారు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సాగుదార్ల ప్రాధాన్యం గుర్తించి ప్రభుత్వాలే రైతుల కాళ్ళ వద్దకు వచ్చే పరిస్థితి తీసుకొస్తామని, ఈ దిశగా దేశంలో బలమైన రైతు ఉద్యమం నిర్మిస్తామని రైతు నేతలు వక్కాణించారు. జాతీయ రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడు చెంగల్ రెడ్డి, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు, రంగా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్త్రార్ జలపతిరావు, పి.సి.సి. కిసాన్ సెల్ నేత కోదండ రెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉండి కుడా కోదండ రెడ్డి గారు రైతుల పట్ల సానుభూతితో మాట్లాడడం బాగుంది. 
             రైతులు పంట విరామం విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవించి వారిని అన్ని  విధాలా ఆదుకుంటుందని ఆశిద్దాం.

Monday, 1 August 2011

మట్టి వినాయక విగ్రహాలు పెట్టి పూజించండి

                                                 
ఈ రోజు అనుకోకుండా పర్యావరణ ప్రేమికుడు విజయ్ రామ్ ను కలవడం జరిగింది. గత ఏడాది లాగా ఈసారి కూడామట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలనే ఉద్యమాన్ని ఆయన భుజాలకు ఎత్తుకున్నారు. గత ఏడాది వీరు హైదరాబాద్ సిటీలో దాదాపు 500 కు పైగా విగ్రహాలను అందించడం జరిగింది. ఈసారి వినాయక విగ్రహాలకు పంచెకట్టు కూడా కట్టి ఆకర్షణీయంగా రూపొందించారు. ఇటీవలే అక్కినేని అమల గారు కూడా ఎర్రగడ్డ అర్బన్ ఫారెస్ట్ నర్సరీలో ఉన్న వీరి విగ్రహాల తయారీ కేంద్రానికి వెళ్లి గణపతిని పూజించి రెండు విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మొదలైన ప్లాస్టర్ అఫ్ పారిస్ భారీ విగ్రహాల పిచ్చి ఇంతకు ముందు అలవాటు లేని కోస్తా, సీమల్లోని గ్రామాలకు సైతం పాకింది. ఇక్కడ హుస్సేన్ సాగర్ పాడైనట్లే రాష్ట్రంలోని లక్షలాది గ్రామాల్లో పంట కాలువలు, చెరువులు నాశనమయ్యే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున కాసేపు నుంచుంటే రోగాలు రావటం ఖాయమని డాక్టర్లు ఇప్పటికే చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజలు ఈ కాలుష్యానికి కొంత అలవాటు పడినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు మాత్రం ఈ చెరువులో బోటు షికారుకు వెళ్ళవద్దని వారు సూచిస్తున్నారు. 
                                                        ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ రామ్ తన 'సేవ్' సంస్థ ద్వారా చేస్తున్న ఈ కృషిని  అభినందిస్తూ పర్యావరణంతో సహా చెరువుల ఇతర జలవనరుల పరిరక్షణకు పాటుపడుతున్న అతనికి మనవంతుగా తోడ్పడదాం. అందుకు మనం చేయాల్సిందల్లా.. మరో నెల రోజుల్లో జరగనున్న వినాయక చవితికి మట్టి వినాయకులను తెచ్చి పూజించడమే. ఎవరికీ ఇబ్బంది కలగని, పెద్దగా ఖర్చు కూడా లేని వీటితో పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.  ఇది విజయ్ రామ్ ఒక్కడి బాధ్యత కాదు, మనందరి బాధ్యత కూడా.