Pages

Saturday 9 August 2014

నాలుగు దశాభ్దాల "ఈనాడు"

రేపు ఆగస్టు 10 కి సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఈ రోజునే తెలుగు పత్రికా ప్రపంచాన "ఈనాడు" అక్షర దీపార్చన ఆరంభించింది. కేవలం 4500 కాపీలతో మొదలెట్టి అగ్రశ్రేణి  తెలుగు దినపత్రిక గా అప్రతీహతంగా ముందుకు సాగుతోంది. పత్రికా రంగంలో ప్రయోగాలకు పుట్టినిల్లుగా నిలిచి., ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టిన పత్రికగా "ఈనాడు" తెలుగు వారి గుండెలలో కొలువుదీరింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వార్తా ప్రమాణాలకు సరికొత్త భాష్యం చెప్పింది. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపకుండా సవాళ్ళను స్వీకరించి దృడంగా నిలిచింది.
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిన ప్రతిసారీ బాధ్యతను గుర్తెరిగి నిరంకుసాధికారానికి ఎదురొడ్డి పోరాడింది. విశ్వసనీయత, నైతిక విలువలే గీటురాళ్ళుగా పవిత్ర విలువల పరిరక్షణ కోసం సొంత వ్యక్తిత్వాన్ని "ఈనాడు" ఏనాడూ వదిలి పెట్టలేదు. ప్రజల పక్షాన ఉద్యమ శంఖాలను పూరించడంలో., విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతను స్వీకరించడంలోనూ "ఈనాడు" ది ఎప్పుడూ ముందుండే తత్వమే.

కోట్లాది ప్రజల ఆశీస్సులతో తెలుగువారి ఇంటింటి నేస్తం గా "ఈనాడు" ఇప్పటికీ మరెప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. ఈనాడు తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈనాడు  మిత్రులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. "నాలుగు దశాభ్దాల ఈనాడు" పై ఈ రోజు రాత్రి  9 గంటలకు., తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ఈటీవి ఆంధ్రప్రదేశ్, ఈటీవి తెలంగాణ చానళ్లు  ప్రత్యేక చర్చను ప్రసారం చేస్తున్నాయి.  లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు డా. జయప్రకాశ్ నారాయణ, ప్రముఖ తెలుగు దిన పత్రికలకు సంపాదకులుగా పని చేసిన సీనియర్ పాత్రికేయులైన ఇనగంటి వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి , పొలిటికల్ ఎనలిస్ట్ సి. నరసింహారావు లు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న పాత్రికేయ మిత్రులు తప్పక చూడాల్సిన చర్చ ఇది.
                                                                       

No comments: